3397* వ రోజు ... ....

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!

3397* వ ప్రాభాత స్వచ్ఛ దిన చర్యలు!

          ఆ  రకరకాల చర్యలు 27-2-25గురువారం వేకువ సమయానివి! తొలుతగా 11 మందికీ, చివరగా మొత్తం 25 మందికీ చెందిన సేవలవి! అసలైన శివరామపురం చివరగా వెంకటాపురం వైపు కొనసాగిన 2 గంటల ప్రయత్నాలతో 100 గజాల మేర కనువిందుచేస్తున్న వీధి భాగం!

          రామానగరం, చల్లపల్లి, శివరామపురాల నుండి మూడో - నాలుగో కిలోమీటర్లు చీకట్లో ప్రయాణించిన కార్యకర్తలు దాదాపు 3 వారాలుగా పెదకళ్ళేపల్లి రహదారికే తమ కష్టాన్ని ధారపోస్తున్నారు.

          మరో నాలుగైదురోజుల పాటు - వెంకటాపురం సెంటరు దాక వీళ్ల సేవలు విస్తరించనున్నవట! వెంకటాపురం కోనేరు చారిటబుల్ ట్రస్టూ’, ‘మనకోసం మనంట్రస్టుల కార్యకర్తలూ, స్వచ్చంద సైన్యమూ కలిసికట్టుగా చేసిన కృషితో ఈ కిలోమీటరు నిడివి రహదారి పండ్ల మొక్కలతో, పూల నీడ చెట్లతో ఇప్పటికే ప్రత్యేకత సంతరించుకొన్నది.

          రానున్న ఆరేడు రోజుల పారిశుద్ధ్య సుందరీకరణ కృషితో ఇంకెంత శుభ్ర - సుందరంగా మార నున్నదో చూడాలి!

          ఈ పాతిక మంది చేతులూ అంతసేపు శ్రమించాక గడ్డీ పిచ్చి చెట్ల పనిపట్టాక - రోడ్ల ప్రక్కలను బరంతు పరిచాక ఎత్తు పల్లాల్ని సరిదిద్దాక - సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు తొలగించాక - కొబ్బరి బొండాల వ్యర్ధాల్ని ఎత్తి ట్రాక్టరులో నింపుకొన్న తర్వాత - చివరగా నలుగురి చీపుళ్లు క్షుణంగా ఊడ్చిన పిదప -

          6.15 కు కదా - ఈ ఊరి మెయిన్ రోడ్డు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తున్నది! ఇంత చిన్న ఊరి 50-60 ఇళ్ళ వారు ఇది గుర్తించి తీరాలి - ఈ రెండు వందల మీటర్ల ప్రధాన వీధినీ కాలుష్యరహితంగా మళ్లీ శివరాత్రి వరకూ నిర్వహించుకోవాలి!

          చాల నాళ్ళ తరువాత శ్రమదానానికి వచ్చిన కొండపల్లి బాబూరావు సమ్మతించనందువల్ల గోవాడ వెంకటేశ్వరమ్మ శ్రావ్యంగా పలికిన నినాదాలతో ప్రారంభమై, డాక్టరు గారి సమీక్షా వచనాలతోనూ,

          రేపటి మన బాధ్యతల కోసం శివరామపురం చివరి ఇంటి వద్ద కలవాలనే నిర్ణయంతోనూ - ఈ నాటి స్వచ్చ కధ సమాప్తి!

          తెగడ్తలను పొగడ్తలను

ఒక సత్యాన్వేషణమిది, ఊరిజనుల స్వస్తతకై

క్షేత్రస్థాయి కష్టములివి, తెగడ్తలను - పొగడ్తలను

సమానముగ పరిగణించి సాగుచున్న పయనం ఇది,

కాల కఠిన పరీక్షలను కాచుకొన్న ఉద్యమమిది!

- నల్లూరి రామారావు

   27.02.2025