3398* వ రోజు ... ....

గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!

శివరామపురం వెలుపల ఫలించిన స్వచ్ఛ దీక్షలు - @3398*

          శుక్రవారం – అంటే ఫిబ్రవరి మాసాంత వేకువలో - అదీ మరీ 4:12 కే నేటి గ్రామాలంకరణలు మొదలైపోయినవి. సదరు స్ధలమైతే సంత వీధి, నిన్నటి తమ వీధి సుందరీకరణ తపస్సును 7:00 వరకు ఆ నలుగురు కొనసాగిస్తూనే ఉన్నారు.

          ఇక నేటి శ్రమదానంలో ద్వితీయ భాగం శివరామపురానికి దక్షిణపు చివరి ఇంటి వద్ద శ్రీకారం వ్రాసుకొన్నది. రెండు చోట్లలో కలిపి 28 మంది.

          అసలీ నాటి పెదకళ్లేపల్లి మార్గమంతా ఈ పూట కటిక చీకటే. వీళ్ల శ్రమ వెంకటాపురం రోడ్డుకు పరిమితమైతే బాగుండేది. కాని 7-8 మంది అత్యుత్సాహం వాళ్లనిలోతైన తడారిపోయిన ఉభయ డ్రైన్లలోకి కూడా దించింది.

          పోనీ - అక్కడ వట్టి గడ్డో – సాదా మొక్కలో ఉన్నవా అంటే – అదేం కాదు - ఏవో తీగలూ, ముళ్ళ మొక్కలూ! ఇద్దరి చేతులైతే ఎండు పుల్లలే గీరుకొన్నాయో – ముళ్లే గుచ్చుకొన్నాయో గాని - మరీ మురికిగా, మొరటుగా రాటు తేలి ఉండడం గమనించాను!

          అసలు సుకుమార గృహిణీమణులు ఇంత వేకువ - మూడు నాలుగు కిలోమీటర్ల దూరాన వీధి సేవలకు వచ్చిందే గొప్ప! ఆ చీకట్లో – ఎగుడుదిగుడు చోటుల్లో – గొర్రులో చీపుళ్ళో పట్టుకొని గంటన్నర శ్రమించడం ఇంకెంత గొప్ప విశేషం?

          రైతుల మినప పొలాల ప్రక్కన ఎంతవరకు వ్యర్ధాలు తొలగించాలో – వేటిని తీసేయాలో స్వచ్ఛ కార్యకర్తల కెరుకే! పదేళ్ల రహదారి సేవల అనుభవజ్ఞులు మరి!

          ఆలస్యంగా మొదలెట్టినా చెత్తలోడింగు చకచకా గమ్మత్తుగా పూర్తయింది. ఒకరో – ఇద్దరో స్త్రీలు కూడ అందులో కల్పించుకొన్నారు.

          క్రమం తప్పకుండా ఈ శ్రమదాన సంగతుల్ని చదవని క్రొత్త పాఠకులు ఇప్పుడే దీన్ని చదివితే చెప్పాలి – చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమ శ్రమ సంక్లిష్టమా - సులభమా? వ్యర్ధమా – ఆవశ్యకమా?

          హెడ్మిస్ట్రెసమ్మ సుభాషిణి గారి తీరుబడి నినాదాలూ,

          DRK మహాశయుని సమీక్షా వచనాలూ ముగిశాక,

          రేపటి శుభోదయ సేవలకై శివరామపురం చివర్లో కలవాలని నిర్ణయించారు.

          కార్యకర్తకు ప్రణతులివిగో!

ఊరి మంచికి శ్రమించడమొక ఉత్తమోత్తమ వ్యసనమనుకొని

దాని కొరకు సుదీర్ఘకాలం తమ శ్రమ వెచ్చించ వలెనని

విజయములకై శ్రమలు తప్ప వేఱు మార్గం ఉండదనుకొని

కలిసిమెలిసి శ్రమించు స్వచ్ఛ కార్యకర్తకు ప్రణతులివిగో!

- నల్లూరి రామారావు

   28.02.2025