గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!
ఒక్క అడుగు దూరంగా 34 వ శతకం!
అనగా - శనివారం (1-3-25) వేకువ 4:20 – 6:20 కాలాల నడుమ నడుస్తున్న సామాజిక శ్రమైక జీవన వైభవం! స్వయంగా వచ్చి చూసి పాల్గొనలేని చదువరులు అసందిగ్ధంగా నమ్మజాలని కఠిన వాస్తవం!
తమ ఊళ్ళకూ – ఇళ్లకూ 3 - 4 కిలోమీటర్ల దూరంగా 2 గ్రామాలు దాటుకొని 30 కి పైగా మంది వెంకటా – శివరామపురాల నడుమ కాలుష్య శత్రువు మీద చేసిన అలుపెరగని సమరం!
ఇందరు వాలంటీర్ల యుద్ధంలో అందరూ యువకులనుకోవద్దు - 45-85 ఏళ్ల ఉత్సాహవంతులే! నడుమ్మీద చెయ్యేసుకొని పనిచేసే పెద్దలు, గొర్రునే ఊతకర్రగా శ్రమించే భారీ చెక్ పోస్టుల వారూ, మరో గంట తర్వాత శుస్త్ర చికిత్సలకు పూనుకోవలసిన వైద్య హస్తాలూ, పొలం పనులకు వెళ్లవలసిన రైతు పాదాలూ, బడుల్లో పాఠాలు చెప్పబోతున్న పంతుళ్ల గొంతులూ ఇలా రకరకాలు!
115 నిముషాల పాటు వీళ్లు :
1) తాడి చెట్లను రోడ్డు వార అందంగా సర్దిన –
2) దట్టంగా – ఒత్తుగా పెరిగి వికారంగా రోడ్డు అందాన్ని వెక్కిరిస్తున్న తుక్కునూ - చెట్లనూ సంహరించి, బైటకు ఈడ్చి, ట్రక్కులో పేరుస్తున్న –
3) సున్నిత మహిళా హస్తాలు రోడ్డును ఊడుస్తున్న –
4) అడ్డదిడ్డంగా పెరిగిన పూల చెట్లను సుందరీకరిస్తున్న -
దృశాలు ఆశ్చర్య - ఆనందకరంగా అనిపించడం లేదా? మీరు కూడా ఈ పనిలో దిగాలనిపించడం లేదా?
ఈ 11 ఏళ్ల గ్రామ స్వచ్చ – శుభ్ర - సౌందర్య తపస్సులు ఇన్నిన్ని గ్రామాల వారి దృష్టికెక్కలేదా?
ఇంకా - ఈ సామాజిక సేవకులు కొందరి దృష్టిలో “తొచీతోచని - బాగుపడడంచేతగాని - అమాయకుల్లా కనిపిస్తున్నారా?
హతవిధీ! ఇప్పటికే వెల్లివిరియాల్సిన సామాజికి స్ఫూర్తి ఇంకెంత కాలానికి మేల్కొనేను?
6.30 తరువాత అడపా గురవయ్య గారు పలికిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు, డాక్టరు గారి సమీక్షానంద వచనాలూ,
రేపటి శ్రమ మరొకమారు శివరామపురం దగ్గరగానే అనే నిర్ణయంతో నేటి కార్యక్రమ సమాప్తి!
శ్రమదాన సాంస్కృతికోద్యమం
సుమారొక వందేళ్ల క్రిందట స్వతంత్య్రోద్యమ సందడుండెను
తరతరాల బానిసత్వపు సంకెలల నది త్రెంచి వేసెను
ఇప్పుడొక శ్రమదాన సాంస్కృతికోద్యమం మొలకెత్తి, వాతా
వరణ రక్షకు బయలు దేరెను - మహోద్యమముగ మారుచుండెను!
- నల్లూరి రామారావు
01.03.2025