3400* వ రోజు....

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!

                మన స్వచ్చ సుందరోద్యమంలో 34 వ సెంచరీ i.e - @ 3400*

          ఈ ఆదివారం(2.3.25) వేకువ సేవలతో ఆఖరి సెంచరీ విజయవంతంగా పూర్తయింది. ఇవాళ్టి మ్యాచ్ లో ప్లేయర్స్ 29 మందైతే - మరో ఇద్దరం ఎక్సట్రా ప్లేయర్సు మన్నమాట !

          క్రికెట్  గ్రౌండ్ శివరామపురానికి 200 గజాల దూరంగా- వెంకటాపురం రహదారి. ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లి టీముకు ప్రత్యర్థి మాత్రం 150 గజాల రహదారికి చెందిన ఉభయ డ్రైన్ల లో కన్నూమిన్నూ కానక పెరిగిన పిచ్చి, ముళ్ల మొక్కలూ, తీగలూ, వందల కొద్దీ ఎండిన - వికారంగా ఉన్న తాడి, కొబ్బరి మట్టలూ, బోల్డన్ని మద్యం సీసాలూ,

       ఇద్దరు ప్రసాదుల జంట 100 కుపైగా ఎండు తాటాకుల్ని వీధికి దక్షిణపు గ్రౌండులో ఔట్ చేసేసింది!

          తూర్పు వైపున్న లోతైన గ్రౌండ్ లోని దట్టమైన పెద్ద బండెడు రకరకాల కాలుష్యాన్ని క్లీన్ బౌల్ట్ చేసిన ఆరేడుగురు ప్లేయర్స్ ని అభినందించక తప్పదు. ఏ క్యాచ్ ఎలా పట్టాడోగాని - వాళ్ళలో BSNL ఆటగాడి ముంజేయి వాచిపోయింది! అందుగ్గానూ, ఆటంతా ముగిశాక తక్కిన ప్లేయర్స్ నుండి అతగాడికి బోల్డన్ని పరామర్శలు!

          ఇక ఇందులో నలుగురనుకొంటా - మంచి ఆటగత్తెలూ ఉండిరి.  వాళ్ళ చీపుళ్ల - దంతెల బ్యాటింగుతో గ్రౌండు దుమ్మూ ధూళీ అదృశ్యమై పోయి, అందంగా మారిన విషయం గమనిచండి!

          మరి నేటి మ్యాచ్ కి అంపైర్ శ్రీమాన్ దాసరి రామకృష్ణులు వారు రానందున సరిగా జడ్జిమెంటు జరుగలేదు గాని, మరో ముఖ్యమైన ఉమన్ ప్లేయర్ పల్నాటి అన్నపూర్ణ  క్రొత్తరకం నినాదాలతో స్వచ్ఛ చల్లపల్లి వాలంటీర్ల టీమును కీర్తించింది !

     అలనాడెప్పుడో భారతీయ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కరుడు సరిగా ఇన్నే- 34 సెంచరీలే చేశాడట ! స్వచ్చ కార్యకర్తల టీము 34 సెంచరీలు చేసినా మరో 34 సెంచరీలకు సిద్ధంగా ఉండడం విశేషం! ఐతే ఇందులో మ్యానాఫ్ మ్యాచ్  ఎవరో తెలియ లేదు!

     ఇక-రేపటి ఆట కోసం బ్యాట్లు  పట్టుకొని, ప్యాడ్లు పట్టుకుని టీము సభ్యులంతా ఇదే వెంకటాపురం రోడ్డులో మరొక 100 గజాల ఆవల కలుసుకోవాలట!

34 సెంచరీలు బాదే తపస్సు మాది !

   సెంచరీలు కొట్టే తపస్సు మాది - డ్రైన్లు బాగుచేసే హవిస్సు మాది  

మాకు-రోడ్లు ఊడ్చి శుభ్రపరచు రోత పనులె ఇష్టం !

ప్రజారోగ్య ప్రయత్నాలు మేము మానుకోం !

అవి లేకిక మాకు నిద్ర పట్టదనుట రహస్యం!

                            సెంచరీలు కొట్టే తపస్సుమాది

ముప్పది వేలకు పైగా మొక్కలు నాటి పెంచుతాం

బస్టాండో- శ్మశానమో బాగుపరుస్తుంటాం

 ప్లాస్టిక్ దరిద్రాల మీద పళ్లు కొరుకు తుంటాం

ఇవే మా బలహీనతంటె ఇదుగొ - ఒప్పుకొంటాం.

                          సెంచరీలు కొట్టే తపస్సుమాది 

కుల మతాల రాజకీయ గొడవలు మా కంటవు

ఊరి - వీధి కాలుష్యమే ఉమ్మడి మా శత్రువు

 స్వచ్ఛ సుందరోద్యమమే కలుషితాల మృత్యువు

నువు మాతో కలిసేందుకెందుకాలస్యం చేస్తవు?

సెంచరీలు కొట్టే తపస్సు మాది- డ్రైన్లు బాగు చేసే హవిస్సుమాది

(Note : హవిస్సు = హోమం)

- నల్లూరి రామారావు

   02 .03.2025