గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!
మంగళవారపు శ్రమదాన ప్రభావం! - @3402*
నేటి (4.3.25) ప్రభావ శీలురు 23+1 రు. స్థలం వెంకటాపురం ఉత్తరాన పెద్ద వంతెన పరిసరం. అక్కడ మూడూళ్ళకు చెందిన అనధికార - అసహ్యకర చెత్త కేంద్రం కనిపిస్తుందేమో చూడండి! అప్పుడప్పుడు తగలబెట్టే వ్యర్ధాల బూడిద పోగుల్తో, క్రుళ్ళిన ఏ జంతు కళేబరపు ఘాటు వాసన, బాగా మసిబారిన పాడవాటి తాడి చెట్లతో అదొక శ్మశాన స్థలి కూడా కావచ్చు!
సదరు స్థలమే ఈ వేకువ 2 గంటల పాటు స్వచ్ఛ కార్యకర్తలకు పెను సవాలు విసిరింది – “చాతనైతే బాగుచేయండి చూస్తా, పెద్ద వచ్చారుగా 4 కిలోమీటర్ల నుండి మూడూళ్ల మొనగాళ్ళు__” అంటూ!
కార్యకర్తలు మీసాలు త్రిప్ప లేదూ, తొడలు కొట్టలేదూ గాని, ఎవరి ఆయుధాలు - పార, పలుగూ, చీపూర్లూ, దంతెలూ వాళ్ళు అందుకొని పని మొదలెట్టారు! [పాపం ఆ పిల్ల - పిత్తిరి డంపింగు యార్డుకేం తెలుసు – వీళ్లు మొండి ఘటాలనీ, ఇటు పెదకళ్ళేపల్లి దాక - అటు శ్రీకాకుళం దాక – వీళ్ల మంత్ర హస్తాలు ఎన్ని శ్మశానాల్ని – కాలవల్ని – పబ్లిక్ స్థలాల్ని ఎన్ని మార్లు శుభ్రపరచాయో! అంతెందుకు - ఈ డంపింగ్ యార్డు వరుసగా 10 వ సారి ముట్టడించబోతున్నారనీ!]
గంటన్నరపాటు జరిగిన ఆ వీరోచిత పోరాటంలో :
1) శివరామపురం వైపొక 100 గజాల రోడ్డూ, చెత్త కేంద్రం ఒక వంద గజాలూ ఎంత శుభ్రపడిందీ,
2) డ్రైన్లు పాక్షికంగానైనా చూడముచ్చటగా ఉన్నదీ,
3) ఎత్తు వంతెన మీది చెత్తా, దుమ్మూ, ఇసుకా ఏమయిపోయినదీ,
4) కొన్ని చెట్ల పాదుల రిపేరూ, కాండాలకు సపోర్టూ,
5) ప్రోగుబడిన ప్లాస్టిక్ వస్తువులూ,
6) శుభ్రపడి, తళతళ లాడుతున్న 200 గజాల రోడ్డూ...
దర్జాగా కనిపిస్తున్నాయా లేదా?
ఒకరిద్దరు కార్యకర్తలు మాత్రం “ఈ మూడూళ్ళ నుండి ముగ్గురేనా - పదిపదిహేను మంది వచ్చి మనతో కలవొచ్చుగదా?” అనుకోవడం విన్నాను!
నేటి విస్పష్ట నినాదకర్త ఆల్రౌండరుడనబడే బృందావనుడు. ఈ పూట 40 గంటల శ్రమ సమీక్షానందుడు దాసరి రామకృష్ణుడు.
రేపు ఇదే వంతెన వద్ద ఆగి వేంకటాపురం దిశగానే మన ప్రయాణం!
వట్టి కబుర్లకు బదులుగ
ఏకాదశ వసంతాల ఉద్యమ మేం చెపుతున్నది?
ప్రది దిన మేబది గంటల శ్రమ ఏం బోధిస్తున్నది?
సమయ - శ్రమ - మేధస్సుల త్యాగాలేమంటున్నవి?
వట్టి కబుర్లకు బదులుగ గట్టి మేలు చేయమనా?
- నల్లూరి రామారావు
04.03.2025