గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!
ఇంకెక్కడా జరగని 3403* వ శ్రమదానాన్ని చిత్తగించండి!
“తారీఖులు, దస్తావేజులు...” ప్రకారమైతే ఆ కష్టం బుధవారం (5.3.25) నాటిది; మా బజారు నుండి 5 కిలో మీటర్ల బహు దూరాన - వెంకటాపుర సమీపాన - ఏదో కొంపలు మునిగిపోయినట్లు- 4.20 AM కే 15 మంది స్వచ్ఛ యోధులతో దానికి శ్రీకారం! పొలోమంటూ నాలుగూళ్ళనుండి మంచు - చీకట్లో దారి వెతుక్కొంటూ వచ్చి కలిసిన 27 మంది తో మొత్తం 42 మంది పాల్గొన్నారు!
ఇప్పటికీ ఇక్కడి ఊళ్ళ వాళ్ళర్థంచేసుకోలేనిది- “అరె! 8 మంది స్త్రీలతో సహా ఇందరు ఈ చెత్త - మురికి పనుల కోసం ఎలావస్తారూ “అని!
తలపెట్టిన పని నిస్వార్ధమైతే, పది మందికీ పని కొచ్చేదైతే, అది! 11 ఏళ్లుగా పారదర్శకంగా- ఋజు మార్గంలో పయనిస్తున్నదే ఐతే-పద కొండేళ్లనాటి ఈఉద్యమ సత్సంకల్పం దృఢమైనదే ఐతే- ఇలాగే జరుగు తుంది మరి!
ఈ వేకువ జామున వీళ్ల పనిపాటులు జరిగింది కాలువ పెద్ద వంతెన వద్దనేగాని అవి కిలోమీటరు పర్యంతం విస్తరించాయి. వంతెన దగ్గరి డంపింగ్ కేంద్రమూ, వంతెన తూర్పు కాలువ గట్టూ పాతిక మందికి పని కల్పించాయి ! యువక జనాభా కాస్త ఆలస్యంగా వస్తేనేం - వాళ్ళు వెంకటాపురం దగ్గరగా రోడ్డు అంచుల పల్లాల్ని పూడ్చిన తీరు చూడండి!
ఇక్కడి ట్రాక్టరు మట్టిని శివరామపురంలోని వీధి పల్లాలు పూడ్చి వచ్చింది 5 గురు. రోడ్డు ఊడ్పులూ, ప్లాస్టిక్ల ఏరుడూ, బాట పల్లాల సరిజేసుడూ... అన్నీ షరామామూలే!
నెలరోజుల పైగా చల్లపల్లి – శివరాంపురం- వెంకటాపురాల 4 కిలో మీటర్ల వీధి సుందరీకరణను సరిగా పట్టించుకోని -ఆయా ఊళ్ల జనులిక మిగిలిన 2 రోజులైనా వచ్చి, చూసి, ఈ శ్రమ సందడిలో పాల్గొంటారని ఆశిద్దాం!
1) 7 వ తేదీ గన్నవరంలో ఉప ముఖ్యమంత్రి గారి సందర్శన సమయంలో ‘స్వచ్ఛ చల్లపల్లి స్టాల్’ ఏర్పాటూ,
2)DRK గారి నేటి పనుల సమీక్షా,
3) శాస్త్రి + గోపాల్ ల బిస్కెట్ల పంపిణీ ఏక కాలంలో జరిగి,
4) ఈ ఇద్దరూ 5 వేలు, 2 వేల చెక్కులను మేనేజింగ్ ట్రస్టీ గారికి అందించి,
రేపటి వెంకటాపురం దగ్గర శ్రమదానానికి మరింత మంది రావలెననెడి సందేశంతో నేటి కార్యక్రమ సమాప్తి!
స్వచ్ఛ కేతన మెగురుచు నుంటది
ఋతువు మారుతోంది స్వచ్ఛ క్రతువు నిలకడగ ఉన్నది
ఋతువు మార్పు ననుసరించి పనులు మారుతూ ఉన్నవి
గ్రామమందు సదా స్వచ్ఛ కేతన మెగురుచు నుంటది
దేశమెల్ల చల్లపల్లి ఖ్యాతి వ్యాప్తి చేస్తుంటది!
- నల్లూరి రామారావు
05.03.2025