గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!
శ్రమదానానికి మరొక అత్యుత్తమ ఉదాహరణ - @3406*
అందుక్కారణాలు :
ఇది శనివారపు (8.3.25) శలవు దినం కావడ మొకటీ, 15 మంది వ్యవసాయ మహిళా కార్మికులూ, ఆరేడుగురి ZP పాఠశాలా బలగమూ, ఇంకో 6 గురు చిన్నా - పెద్దా వెంకటాపురస్తులూ - అంటే నేటి 53 మంది సామాజిక శ్రమ జీవుల్లో సగంమంది స్థానికులు కావడం రెండోదీ; రహదారి కాలుష్యం మీద తిరుగు బాటు చేసిన వైనం మూడవది !
మహిళా దినోత్సవ మంచి సందర్భమేమో- నేటి 53 మంది కార్యకర్తల్లో 23 గ్గురు – డ్రైనయి తేనేం, రోడ్డు మార్జిన్లయితే నేం, బరువు డిప్పలు మోసిన కష్టమయితేనేం – మహిళాధిక్యతే కనబడింది!
ఇప్పటికీ మన పురుషాధిక్య సమాజంలో ఒక్క మారైనా- ఒకానొక ఆదర్శ సామాజిక సేవలో మహిళల డామినేషన్ ఎంత గొప్ప సంగతి!
ఈ వేకువ పనుల్లో సింహభాగం ప్రాత బాట పగిలిన తారు ముక్కల్ని ఏరి, డిప్పల కెత్తి, మోసి, క్రొత్త తారు రోడ్డు ప్రక్కపల్లాలు పూడ్చి చిరకాలం మన్నేలా ఆశీర్వదించడమే! స్త్రీ- బాల కార్మికుల ఈ పవిత్ర మనోగతం తప్పక నెరవేరాలని కోరుకొందాం!
కత్తులతో నరుకుడుగాళ్లు 2 ముఠాలుగా మారి, ఒక చిన్న బృందం పెద్ద వంతెన దగ్గరి తాటి చెట్ల సుందరీకరణలో మునగ్గా 2 వ పెద్ద ముఠా రోడ్డు పడమటి డ్రైను వ్యర్థాల అంతు చూసింది!
వీధి మొత్తాన్ని ఐదారుగురు మహిళలు ఊడ్చేశారు. గంటన్నర తర్వాతనే ప్లాస్టిక్ వ్యర్థాల్ని, గాజు పెంకుల్ని, ప్రాత చెప్పుల్ని ఏరేవాళ్లు 3 గోనె సంచులు నింపి, సంతృప్తి చెందారు!
వ్యర్థాల లోడింగు లోనూ తలా ఒక చెయ్యేశారు. ఈ పూట కత్తులూ, డిప్పలూ చాల లేదు- ఒక దశలో!
ఇప్పుడొక ప్రశ్నేమనగా: క్రింది వాళ్లలో ఎవరిది అదృష్టం?
ఐదారూళ్ల కార్యకర్తలు తమ ఊరి ఆహ్లాదం కోసం వచ్చి, సుమారు 100 పని గంటలు శ్రమిస్తుంటే పట్టని గ్రామస్తులదా-
పెదకళ్లేపల్లి బాటలో ఉన్నందుకు 5 వారాలుగా నానా చాకీరీ చేసి, మార్గాన్ని బహు ముఖంగా మెరుగు పరుస్తున్న స్వచ్చ కార్యకర్తలదా –
మినప చేలో 10 నిముషాల పాటు జరిగిన సమీక్షా సభను చూసి తీరాలి! “ఎక్కడమ్మా నీవు లేనిదీ - ఏమిటీ నువు చేయిలేనిదీ ..” అంటూ మహిళా చైతన్యాన్ని ఉసి గొలిపే నందేటి శ్రీను గళమూ, అ గానలాహిరికి ఆనందిస్తున్న స్త్రైణమూ ..,
ఈ శ్రమానంతర సన్నివేశాన్ని రెప్ప వేయక చూసి ఆనందిస్తున్న స్వచ్చోద్యమ సారథి మొదలైన నలుగురైదుగురమూ,
ఇది గాక, చెక్ పోస్ట్ వెంకటేశ్వరుల వారు తన నెల వారీ 520/- చందాను DRK గారికి సంతోషంగా ఇచ్చుకొన్నారు.
రేపటి శ్రమ కూడ వెంకటాపురంలోనే!
అదో వెర్రి ఆవేశము
అదో వెర్రి ఆవేశము అంతమంది స్త్రీ పురుషులు
మురుగు కంపు-డంపు కంపు ముక్కులదర కొడుతుండగ
వంతెన కడ కళేబరాల వాసనలను భరిస్తూ
గంటన్నర పైగా తమ కష్టం ధారపోయడం!
- నల్లూరి రామారావు
08.03.2025