3410* వ రోజు ....

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!

అర్ధ శతక వేకువ శ్రమలకు దీటైన ముగింపు - @3410*

         ముగింపు పలికిన వీరాధివీర – శూరాధి శూర కార్యకర్తలు పెయింటర్ వెంకట్ కాక 28 మందే! ఈ పూట కాలుష్యాల మీద తొలివేటు వేసింది మాత్రం 10 మంది! ఆ ముహూర్తం 4.18AM. అక్కడికి వచ్చేందుకు వాళ్లు 3.30 కే లేచి, నాలుగైదు కిలోమీటర్లు దాటి వచ్చారు సుమా! పనుల ముగింపు 2 గంటల 10 నిముషాల తర్వాత!

         వీధి కర్తవ్యాలు నెరవేరింది ప్రాత శివరాపురం దగ్గర్లోనే! తాడి చెట్లు కొన్నిటిని మూలాలతో సహా నరికిన నలుగురూ, గ్రామ ప్రవేశం వద్ద పొడవాటి తాటి దూలాల నడుమ కూడ ఆకులూ, ఎండు వరిగడ్డి లాగి, ఏరిన మహిళా మతల్లులూ, ఇది ఈ P.K. పల్లి రహదారి సేవల తుది ఘట్టం కావున కిలోమీటరు బారునా ఏ అశుభ్రతలు మిగిలిపోయినవోనని వెదుకాడుతున్న Dr.DRK వైద్యుడూ,

         ఇంకా-ఈ శ్రమ సన్నివేశాల్ని ఫోను కంట్లో దాస్తున్న 77 ఏళ్ల శాస్త్రి మహాశయుడూ, తెలవారే కొద్దీ ఉరవళ్ళతో – పరవళ్ళతో ఊరి ముఖ్య వీధిని ఇంకెంత సుందరీకరించాలనో ఆరాటపడుతున్న స్వచ్ఛ కార్యకర్తలూ, చెక్ పోస్టు వాని అరుపులూ, అందుకు భిన్నంగా మౌనంగా - తాపీగా పని చేసుకుపోతున్న ఐదారుగురూ.. ఇదీ 6.00 AM కు శ్రమ దృశ్యం!

         వీధి శుభ్రతకు తుది మెరుగులు (ఫినీషింగ్ టచస్) దిద్దడంలో – టైమయిపోతున్న తొందరలో ఎవరెంత ఆత్రపడుతోన్నదీ, ముగ్గుర్నలుగురైతే సర్కస్ మనుషుల్లాగా పరుగెడుతున్నదీ నేను గమనిస్తూనే ఉన్నాను!

         సమయాభావం వల్ల తుక్కు లోడింగు బాధ్యత 7:30 తర్వాత ట్రస్టు ఉద్యోగులకు మిగిలింది.

         6:40 కి ముగింపు సభను ధాటిగా నినాదాల్తో ప్రారంభంచినది కోడూరు వారు; వెంకటాపురం విద్యార్థులకు వ్రాతపలకలూ, పెన్నులూ ఇచ్చింది ప్రాతూరి వారనుకొంటా!

వీర సింహుల వారి పండ్ల పంపకమూ, మాలెంపాటి వైద్యుని చాక్లెట్ల  పంపకమూ సరే సరి!

         ఇక ఈ 50 రోజుల శ్రమదాన ఫంక్షన్ లో  DRK గారెంత సంబర పడి ఉంటారో ఊహించండి!

         76 ఏళ్ల స్థానిక శివరామపురం పెద్ద – రావి మోహనరావు గారు గత 2 వారాల తన వీధి పారిశుద్ధ్య శ్రమతో తన ఆరోగ్యం ఎలా మెరుగుపడిందో వివరించిన ఆనందాన్ని కూడా గమనించాలి.    

         రేపటి నుండి మన శ్రమదాన దృశ్యాలు పాగోలు రోడ్డుకు తరలి పోనున్నవి!

        కాటు వేసి చంపుతుంటే

మనుషుల్లో విచక్షణలు మటుమాయం ఔతుంటే –

ఊరుమ్మడి భావనలే మృగ్యములై పోతుంటే –

కాలుష్యం బ్రతుకులను కాటు వేసి చంపుతుంటె –

స్వచ్ఛ-సుందరోద్యమాల సాహసాలు తప్పవులే!

- నల్లూరి రామారావు,

   12.03.2025