3417* వ రోజు ....

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!

గుర్తుంచుకొండి - ఇది 3417* వ శ్రమదానం!

         ఈ బుధవారం (19.3.25) వీధి బాధ్యతలతో సహ ఏ11 ఏళ్ల నుండో సదరు శ్రమ వితరణ గల్లీ – లేక శ్మశానం - లేక సమీప రహదార్ల మీద - ఎండా, మంచూ, వానల ఆటంకాల్లోనూ జరుగుతూనే ఉన్నది! ఏ 8-9 ఏళ్ల నుండో ఆ వితరణానంతర గ్రామ శ్రామికుల  పని వార్తలు ఇలా వ్రాస్తూనే ఉన్నాను! కార్యకర్తలూ, ఇతర పాఠకులూ ఆసక్తితోనో, విసుగుతోనో చదువుతూనే ఉన్నారు.

         ఇంత సుదీర్ఘకాలంలో గ్రామ కాలుష్యాలు గానీ, మురుగుగుంటల దైన్యం కానీ, వాటిని పరిహరిస్తున్న స్వచ్చ కార్యకర్తలు గానీ నెమ్మదించలేదు, అలసిపోలేదు, అంతిమ విజేత ఎవరో తేలనూలేదు! రోడ్ల మీద వ్యర్ధాలు విరజిమ్మే దుస్సంప్రదాయం తగ్గింది గాని,  జనుల్లో పూర్తి స్వచ్చ-శుభ్ర-సౌందర్య స్పృహ రానూ లేదు!

         ఏకాదశ వసంతాల పిదప కూడ ఇంకా స్వచ్ఛ కార్యకర్తల సహనానికి పరీక్షలే! గ్రామస్తుల సామాజిక స్పృహ అసంపూర్ణమే!

         ఆ మధ్య 50 రోజుల వెంకటాపుర రహదారి బాగుచేత చివర్లోనూ, మళ్లీ నిన్నా - ఈరోజూ పాగోలు వీధి పనుల్లోనూ స్ధానికుల భాగస్వామ్యం పెరగడం చూస్తే ఆశ చిగిరుస్తున్నది!

         ఈ  వేకువ 4.18 నుండి 6.12 దాక చందమామ-NTR పాఠశాలల నడుమ 35 మంది ప్రాత + క్రొత్త కార్యకర్తల పని తీరు గమనించారా? రోడ్డు దక్షిణాన + ఉత్తరపు డ్రైన్ అంచునా - మొత్తం 100 గజాల్లో రకరకాల పనులెలా జరిగిందీ, N-లంక రహదారి నుండి ఈ చిన్న వీధి ఎంత ముచ్చటగా ఉన్నదీ మరీ మరీ చూడండి!

         నేటి తుది సభా ప్రారంభ నినాదాలు RTC తోట నాగేశ్వరరావు గారి వంతు, గ్రామానికి RTC బస్టాండులోని టాయిలెట్ల పునరుపయోగ ప్రయత్నాన్ని వివరించడం DRK గారి వంతు!

         రేపటి వేకువ NTR పాఠశాల వద్ద కలుసుకొని జరిపే వీధి సేవలకు బహుశా సదరు విద్యార్థులు కూడా వస్తే రావచ్చు!

        ఈ పర్యాటక కేంద్రం

ఏ ప్రత్యేకత లేకనె ఇంతమంది మహామహులు

గ్రామం సందర్శనకై వస్తున్నారను కొనకుడు

ఈ పర్యాటక కేంద్రం ఇందరి నా కర్షించుటకై

ఎంతటి శ్రమ కారణమో ఇంచుక ఆలోచించుడు!

- నల్లూరి రామారావు,

   19.03.2025.