గాజు, స్టీలు, నార సంచులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!
పాగోలు మార్గంలోనే 3418* వ శ్రమదానం కూడ!
ఆ మార్గంలోని NTR పాఠశాల గేటు వద్ద ఎకో వ్యానూ, పనిముట్ల బండీ, దానికి దక్షిణంగా ఖాళీ మినప చేలో కారునూ నిలుపుకొని, ఈ గురువారం (20-3-25)వేకువ 4.17 కే 15 మంది తొలి కార్యకర్తల జట్టు క్రమశిక్షణగా నిలబడి ఉన్నది చూశారా?
2-3 పంచాయతీల - 2-3 వేల మీటర్ల దూరం నుండి వాళ్ళా వేళప్పుడక్కడకు వచ్చారు! వచ్చి చేతులు ముడుచుక్కూర్చోలేదు - ఆ తర్వాత వచ్చిన పాతిక మందితో కలిసి, వీధి దౌష్ట్యాల మీద తిరగబడ్డారు!
మరి - ఈ వేకువ సమయపు యుద్ధమన్నాక - డ్రైనుల్లో పనులు చేయడమంటే – అదేమీ తమాషా కాదే! ఒంటికి ముళ్లు గీరుకోవచ్చు, ఏటవాలుగా, డ్రైన్ అంచున వీడ్కోలు వాహాన చోదకుడు – KSR లాగా కాలుజారి పడనూవచ్చు, ఎవరో ప్లాస్టిక్ సంచుల్లో కుక్కి పడేసిన నిలవున్న ఆహారాల ఘాటుకంపులు ముక్కుల్లో దూరనూ వచ్చు!
నేనొక ప్రక్క మద్యం ఎంగిలి సీసాలు షణ్ముఖునితో కలిసి సేకరిస్తూనే – 150 గజాల వీధి బారునా 40 మంది తమ కోసం కాక-విస్తృత ప్రజానీకం కోసం
1) కొమ్మలు కత్తిరిస్తూనూ
2) డ్రైన్ల తుక్కు లేరుతూనూ
3) మురుగు నీళ్ళ నుండి ప్లాస్టిక్ దరిద్రాల్ని లాగి ప్రోగులు పెడుతుంటేనూ,
4) వీధినీ - మార్టిన్లనూ శుభ్రంగా ఊడుస్తుంటేనూ
ఆ సామాజిక సామూహిక సత్కార్యాచరణల దృశ్యాన్ని కనిపెడుతూనే ఉన్నాను!
తక్కిన వ్యర్ధాల్ని లోడు చేయలేదు కనుక వాటి కొలత తెలియలేదు. మా ఇద్దరి సంపాదన మాత్రం 3 ½ గోతాల సీసాలన్న మాట!
“ఈ మందు బాటిళ్ల పానా-పీనా మహానుభావులే ఈ కాలంలో ప్రభుత్వాలు నడవడానికి కావలసిన ఆదాయ వనరులు” అని పల్నాటి, అడపా కార్యకర్తలు వ్యాఖ్యానించారు!
ఈ ఉదయం మైకును స్వాధీనం చేసుకొని నినాదాలను గర్జించిన కార్యకర్త మాలెంపాటి అంజయ్య గారు, నిన్న A.P.S RTC చైర్మెన్ ను కలిసి, బస్టాండు టాయిలెట్ల మరమ్మత్తుకు అనుమతి సంపాదించిన వృత్తాంతం తెలిపిన వారు Dr. డి.ఆర్.కె.
తన 35 వ పుట్టినరోజు సందర్భంగా చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమానికి లక్ష రూపాయల భూరి విరాళాన్ని అందించిన వారు అమెరికా- కాలిఫోర్నియా ప్రవాసి దాసరి అనుదీప్ గారు.
రేపటి ప్రజా పనుల కోసం మనం కలువదగిన చోటు పాగోలు బాటలోని NTR పాఠశాల ఎదురుగనే!
నరకానికి తొలి మెట్టని
ఇదుగో పాగోలు బాట! ఇప్పుడిలా ఉండె గాని
ఒకనాడిది నరకానికి తొలి మెట్టని గుర్తుందా?
మహాదాత రామబ్రహ్మ మహనీయుని పుణ్యంతో
హరిత-పుష్ప సంపదతో అలరారెను చూడునేడు!
- నల్లూరి రామారావు,
20.03.2025.