గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!
పాగోలు ఊరి దారిలో ముగిసిన 3420* వ శ్రమ!
ఇంచుమించు స్థిరవారం కూడ (22.3.25) వీధి పారిశుద్ధ్య పనులు నిన్నటి వలెనే! కాకపోతే నిన్నటి చోటు నుండి మరో 110 గజాల పడమరగా! అందుకు తోడు నిన్న శుభ్రపరచిన మరో 30 గజాల బాట దక్షిణపుటంచు, కరెంటు తీగలకు దాపుగా పెరిగే మరో చెట్టు కొమ్మల పనిబట్టారు!
రోజుటిలా కాక ఈ పూట ఎండు కొమ్మలు ఎక్కువగా దొరికాయి. కొన్నిటినైతే ఈపూట నినాద కర్త గుట్టు చప్పుడు కాకుండా పాఠశాల కంచె ప్రక్క లోతు డ్రైనులో నుండి బట్టలకేమంత బురద అంటకుండానే బైటకు లాగాడు!
మర రంపాల రణ గొణలైతే మరీ 4.30 కాకుండానే విన్పించాయి-పూల చెట్ల, హద్దులు మీరే పెద్ద చెట్ల సుందరీకరణమన్నమాట! మళ్లీ ఆ శాఖలన్నిటినీ సైజులుగా తెగ నరికే పనొకటి! ఈ బాపతు పచ్చి కొమ్మలు 2 గుట్టలుగా బుద్ధిగా 7:30 దాక పడి ఉంటవి! అప్పుడిక ట్రస్టు ఉద్యోగులు రంగ ప్రవేశం చేస్తారు - మొక్కలకు నీళ్లు, కొమ్మ రెమ్మల్ని షెడ్డర్ తో తునకలు చేయడమూ వాళ్ళ పన్లు!
నిన్నటి కన్నా కార్యకర్తలు కొంచెం తగ్గి 35 కు కుదించుకుపోవడానికి ఇద్దరు వైద్య కార్యకర్తల విదేశీయానం, అపార్ట్ మెంట్ల నుండి 5 గురు డుమ్మా కొట్టడమూ కారణాలు!
చిత్తశుద్దితో వీధి శుభ్రతకు అంకితులైపోతే ఈ 35 మంది చాలరా? 6 గురు మాత్రం 6.10 కి 2 వ విజిల్ ఊదాకనే పని విరమించారు - ఎవరి తృప్తి వాళ్లది - పనిని రేపటికి వాయిదా వేయలేని వీక్ నెస్ వాళ్లది మరి! ఆ మాటకొస్తే మొన్నటి షెడ్డర్ తుక్కును మొక్కలకు మల్చ్ గా వేసి ఒకాయనైతే- 6.15 కి తిరిగొచ్చాడు!
కార్యకర్తల్లో సగం మందిని చూస్తే జాలేస్తుంది! “ ఈ స్వచ్చంద శ్రమదానం దురదృష్ట వశాత్తూ ఎప్పుడైనా ఆగిపోతే ఎలా?" అని వాళ్ళ బెంగ!
మినప చేలో సమీక్షా సభను మౌనధారిగదా అని అంబటి వాని నినాదాలతో ప్రారంభింప జేస్తే- అతగాడు చెవుల తుప్పొదిలించాడు! కోడూరు వారి తిరుపతి లడ్డూ, గురవయ్య సూక్తులూ నేటి విశేషాలు!
రేపటి మన కలయిక విజయా కాన్వెంటు – ప్రభుత్వాసుపత్రుల వద్ద!
ప్రత్యక్షోదాహరణము!
“ఆర్థిక సహకారాలకు శ్రమదాతృత తోడైతే -
గ్రామస్తులు స్వచ్చోద్యమ కారులతో జతకడితే -
ఊరైన-శ్మశానమైన ఉన్న ఫళానా మెరుగగు”
అనుటకు పాగోలు రోడ్డె ప్రత్యక్షోదాహరణము!
- నల్లూరి రామారావు,
22.03.2025.