3427* వ రోజు....

 గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులెందుకు!

ఉగాది దరిదాపులో పాగోలు దారి శ్రమదానం @3427*

         29-3-25 - వేకువ 4.20 ప్రాంతంలో దానికి శ్రీకారం! ఔను మరి - ఇది శనివారం కనుక కార్యకర్తల తాకిడి పెరిగి పెరిగి 43 కు చేరింది. ఇందులో పాస్టర్ డేవిడ్ గారి ‘బైబిల్ కాలేజి’ పరివారమూ, నేనేదో నిన్న రాని సీనియర్ కార్యకర్తల్ని సరదాగా పేర్కొన్నందుకు కాస్త రోషం వహించి, అదేదో స్వర్ణ కాబోలు – 2 రోజుల యాత్రను కుదించుకొని ఇప్పుడు హాజరైన మోకాలి - నడుము సమస్యల కార్యకర్తా, వివిధ వృత్తుల వారూ ఉన్నారు!
         అందరూ పని ప్రారంభించినది దాదాపు నిన్నటి చోటనే! కత్తులకూ
, దంతెలకూ, డిప్పలకూ, ఆమాద్మీ చిహ్నాలకూ, సరి సమాన పాత్రలు లభించాయి.

         బైబిలు బ్యాచి వచ్చి, డిప్పలందుకొన్నాక శ్రమ వేగం పెరిగింది. ఒకటి – రెండు సందర్భాల్లో కొందరు డిప్పలెత్తుకొని పరుగు తీయడమూ కనిపించింది.

         ఒక ఆదినారాయణుడూ, ఒక కస్తూరి విజయుడూ కరెంటు తీగలకు తగులుకొన్న తాడిమట్టల్ని లాగేప్పుడు మాత్రం నాక్కాస్త జంకు కల్గిన మాట వాస్తవం.

         మంచినీళ్ళ ఆనందుడు గాని, ఆ ఇన్ చార్జి మాలెంపాటి గాని లేనందున కోట వారికాబాధ్యత మోపారు – ఫర్వాలేదు – ఆమె సమర్ధవంతంగా 40 లీటర్ల మంచి తీర్థం త్రాగించారు!

         ఒక్క దక్షిణపు డ్రైన్ లోనూ, దాని ఒడ్డుల మీదా ఎప్పుడు పడి మొలిచి పెరిగాయో గాని, దాదాపు 50 తాడి మొక్కలు డజను మంది కత్తుల వాళ్ల సహనాన్ని పరీక్షించాయి.

         ప్లాస్టిక్ సీసాల, తుక్కుల నిపుణుడొకాయన ఈ పూట కూడ గోనె సంచిడు సేకరించారు!

         6.15 దాక నందేటి శ్రీను గారి కాఫీ కార్యక్రమమూ, తరువాత దక్షిణపు మినప చేలో సమీక్షా సమావేశమూ జరుగగా - ఒకరు కరివేపాకుల పంపకమూ, ఇంకొకరు కాలెండర్ల  బహూకరణ ముగించాక –

         గ్రామ సర్పంచి గారు నిలకడగా స్వచ్చ సుందరోద్యమ నినాదాలను కావించాక –

         రేపటి మన ఉగాది వేకువ శ్రమదానం చోటు పాగోలు పంచాయితీ పరిధిలోని శ్రీనగర్ లో ఉన్న దర్గా బయటనే అని నిర్ణయించారు.

         దేనికో మరి తెలియకున్నది.

దశాబ్దంగా ప్రవర్థిల్లిన స్వచ్చ సుందర చల్లపల్లికి  

రాష్ట్రమంతా మారు మ్రోగిన శ్రమోత్సాహపు కర్మభూమికి

పరిచయాలూ - ప్రచారాలూ - ప్రసారాలూ – ప్రమోషన్ లూ,

వేడుకోళ్లూ, సిఫారసులూ దేనికో మరి తెలియకున్నది!

- నల్లూరి రామారావు,

   29.03.2025.