ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1985* వ నాటి సంస్కృతి :
ఎప్పుడు మేల్కొన్నారో గానీ, 3.55 కే గ్రామ కర్తవ్య నిర్వహణకు దిగిన 36 మంది స్వచ్చ సుందర చల్లపల్లి నిర్మాతలు 6.10 వరకు – అంటే 130 నిమిషాలకు పైగా – అంటే 70 పని గంటలకు పైగా తమ లక్ష్య సాధనలో కృతకృత్యులయ్యారు. నేటి ఈ కృషీవలుల గ్రామ మెరుగుదల ప్రయత్నం 3 విధాలుగా – 3 చోట్ల కొనసాగింది.
విజయవాడ మార్గంలో బాలాజీ ‘సామూహిక భవనాల’ (అపార్ట్ మెంట్ల) ముందు తమ వాహనాలను నిలుపుకొని, పనిముట్లను చేబూని, నారాయణరావు నగర్ ముఖద్వారం మొదలుకొని 250 గజాల మేర ఆ ప్రధాన వీధిని, ముఖ్యంగా కుడి ప్రక్క మురుగు కాల్వను అన్ని రకాలుగా – తుక్కును లాగి, పిచ్చి – ముళ్ల – వ్యర్ధ మొక్కలను, గడ్డిని నరికి, కరెంటు తీగలను తాకాబోతున్న - తామే నాటి పెంచుతున్న చెట్ల కొమ్మలను కత్తిరించి, ప్లాస్టిక్ సంచులు, కాగితం పొట్లాలు, ఖాళీ మద్యం సీసాలను పోగులు చేసి, రోడ్డంతా ఊడ్చి స్వచ్చ – శుభ్ర తరం చేశారు. ఇందులో కొందరు వంచిన నడుం ఎత్తని వారున్నారు! వయో వృద్ధులున్నారు! సుదీర్ఘ కాలంగా వీరు - తమ క్రియాత్మక సందేశాన్ని - నిశ్శబ్దంగా - నిరంతరంగా గ్రామ పౌర సమాజానికి పంపుతూనే ఉన్నారు!
ఇక గ్రామ రక్షణాత్మక (రెస్క్యూ టీమ్) దళం వారున్నారు. ఊళ్ళో రోడ్ల గుంటలు పడితే, కాలవ గట్లు కోసుకుపోతే, రోడ్ల – వంతెనల మలుపులు చెడిపోతే, చెట్ల పొందికలు లోపిస్తే .... అన్నీ వీళ్ళ వంతే! ఈ వేకువ కూడ కోసిన గడ్డిని, దుమ్మును ట్రాక్టర్ లో నింపుకొని, గంగులవారిపాలెం వంతెన సమీపంలో బండ్రేవు కోడు మురుగు కాలువ గట్టు కోత పడకుండా సర్ది వచ్చారు. అప్పటి నుండి నారాయణరావు నగర్ వీధి వ్యర్ధాలను ట్రాక్టర్ లో నింపుకొని చెత్త కేంద్రానికి చేర్చారు.
చల్లపల్లి సౌందర్యకారులు బందరు రహదారి ఉత్తరం వైపు భారీ కుడ్యాన్ని గోకే – కడిగే కార్మికులుగా, ప్రైమర్లు – రంగులు పూసే రంగుల కార్మికులుగా – రంగు రంగుల చిత్ర లేఖనాల కళాకారులుగా - గ్రామ సౌందర్యార్ధం బహుకృత వేషాలు వేస్తూ ఈరోజు కూడ తమ విధుల్లో మునిగిపోయారు. అమరావతి జమీందారు గారి ఆ గోడ మీది వైజయంతము, గోకులము ఇప్పుడు ధగధాగా మెరుస్తూ బాటసారుల దృష్టి మరల్చుతున్నవి!
కాఫీ సేవానంతరం మాస్కులతో కార్యకర్తలు తగు దూరం పాటిస్తుండగా – నందేటి శ్రీనివాస్ స్వయం రచిత ‘కరోనా ప్రబోధాత్మక గేయాన్ని’ ఆలపించగా - 6.15 కు నేటి స్వచ్చోద్యమ అధ్యాయం ముగిసింది.
రేపటి మన కృషిని కూడ బాలాజీ అపార్ట్మెంట్స్ దగ్గర ఆగి, కొనసాగించాలి.
వివరిస్తూ పోతుంటే
ఈ విశ్వం పరిరక్షణ పర్యావరణ క్రమ శిక్షణ
తోనే మానవ మనుగడ భద్రంగా ఉంటుందని....
అందు కొరకె రోజుకు ఒక గంట శ్రమిస్తాంమేమని...
చల్లపల్లి స్వచ్చోద్యమం చాటి చెప్పె చూడండని...
- డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
- నల్లూరి రామారావు
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలు
శనివారం – 18/04/2020
చల్లపల్లి.