3432* వ రోజు ....

ఒకసారి ఉపయోగించి వదిలేసే ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చాటుదాం మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.  

స్వచ్ఛ సుందర చల్లపల్లి 3432* వ రోజు స్వచ్ఛ సేవ తీరు తెన్నూ.

         ఈ రోజు వేకువ జాము 4:17 నిమిషాలకు 13 మంది కార్యకర్తలతో ప్రారంభమైన స్వచ్ఛ సేవలో NTR మోడల్ స్కూల్ దాటిన మలుపు నుండి పాగోలు రోడ్ మలుపు వరకూ రోడ్డుకు రెండు వైపులా ఉన్న పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలూ తొలగించే పనిలో కార్యకర్తలు విరామం లేకుండా పని చేసిన నిమిత్తం, నరికివేసిన కంప, తుక్కు లాగి పెద్ద గోతులలో పూడ్చడం అద్దంలా ఊడ్చి శుభ్రం చేసేందుకు గాను మహిళా కార్యకర్తలకు చేతి నిండా పని పడింది.

         ఒక సమూహంగా చేసే ప్రతి పనిలో ఎవరో ఒకరు పనిని ప్రతిసారీ పురమాయించాలి. కానీ ఇక్కడ స్వచ్ఛ కార్యకర్తలకు అపరిశుభ్రతగా కంటికి నచ్చని ప్రతి ప్రదేశమూ వారిదే ఎవరి పనిముట్లు వారు తీసుకుని ఒక్కొక్కరుగా వచ్చిన వారు వచ్చినట్లుగా వారి పనిలో ప్రవేశించి చీమలదండుగా విరామం లేకుండా ఆ సమయంలో చిందించే స్వేదజలంతో దశాబ్ద కాలంగా కడగబడుతున్న ఈ సుందర చల్లపల్లి ఎప్పటికీ ప్రత్యేకమే!
         ఇది ఒక స్వచ్చంద పరిశుభ్ర పరిశ్రమ, ఈ పరిశ్రమలో అనేక విభాగాల పనిచేసే స్వచ్ఛ కార్మికులు, ప్రతి విభాగమూ చాలా కీలకమైనదే, కలుపును తీసే వారు, ప్లాస్టిక్ ఏరే వారు, మొక్కలు సరిచేసేవారు, పాదులు తీసేవారు కొమ్మలు కత్తిరించువారు, ట్రాక్టర్ నడిపేవారు, లోడింగ్ చేసేవారు, పనిముట్లు అందించేవారు, పనిని పర్యవేక్షించువారు అన్నింటికీ అవసరమయిన వనరులు సమకూర్చేవారు, పాటలు పాడేవారు, స్టెప్పులు వేసేవారు, దాహం తీర్చేవారు స్వచ్ఛతకు జై కొట్టేవారు. ఇంతమంది గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్యాన్ని కోరుకునేవారి పొదిగిట్లో ఒదిగి ఉన్న గ్రామమే ఈ “స్వచ్ఛ సుందర చల్లపల్లి”.

         5:30 తరువాత ముందుగా అనుకున్న షెడ్యూలు ప్రకారం స్వీయ పర్యవేక్షణకు విచ్చేసిన స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ అధికారులను ఆహ్వానించి మన రోజువారీ శ్రమ విశేషాలూ పని జరిగే పద్దతులూ సుదీర్ఘ స్వచ్చంద యజ్ఞానికి గల కారణాలు, మన లక్ష్యాలు, గ్రామ స్వచ్ఛతకు కావలసిన అవసరాలు తదితర విషయాలు మన రధసారధుల వారు సోదాహరణంగా వివరిస్తూ అందరి కాఫీ విరామం సమయం తదుపరి గ్రూపు ఫోటోకు సిద్ధమవగా ఆ వేకువ సమయంలో ప్రభుత్వ అధికారుల సందర్శన ఒకింత అరుదైన ఘట్టం అయినప్పటికీ వారి చేరికతో గ్రూపు ఫొటో మరింత నిండుదనం చేకూరింది.

         డా. పద్మావతి మేడమ్ గారి శ్రావ్యమైన కంఠంతో ప్రతిధ్వనించిన జైహింద్ ను జతపరచిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లి నినాదం మరొక్కసారి కార్యకర్తలకు మన లక్ష్యాన్ని గుర్తుకొచ్చేలా చేసింది. రధసారధి గారి ఆహ్వానం మేరకు స్వచ్ఛాంధ్ర మిషన్ అధికారి గారి ఉపన్యాసంలో కార్యకర్తల సేవలను కొనియాడుటతో పాటు మా కార్పోరేషన్ నుండి అందించవలసిన సహకారాన్ని అందిస్తామని వాగ్దానమివ్వగా వారికి ధన్యవాదాలు తెలిపిన డాక్టరు గారి ప్రసంగంతోపాటు డా. మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు 2,000/- రూపాయాల విరాళం అందించగా

         “రేపటి మన ప్రసారాలు”లో భాగంగా ఈ పాగోలు రోడ్ లోనే ఈరోజు పని ముగించిన చోటనే కలుసుకుందామనే నిర్ణయంతో నిష్క్రమించడం జరిగినది.

చెత్త తోటి రోడ్లన్నీ నిండిన రోజుల్లో –

చెడ్డ కంపు కొట్టి డ్రైనేజి కదలని కాలంలో -

ఎవరు నోరు మెదపని రోజుల్లో

గంగులవారిపాలెం రోడ్డు నుండి మొదలు పెట్టి వీళ్లు

చల్లపల్లిలోని ప్రతి వీధి వీధిని వీళ్ళ చెమటలతో తడిపి,

పరిశుభ్రపరచి పచ్చదనముతో నింపే -        

- నందేటి శ్రీనివాస్

 

         చల్లపల్లిలోని హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి శ్రీ గౌడ వారి రామాలయం గౌడ సంఘం తరపున సంఘ పెద్దలు - సంఘ అధ్యక్షుడు వేముల అర్జునరావు, వేముల శేషగిరిరావు,  ఉప్పాల ఏడుకొండలు, జన్ను సాంబయ్య, మార్గాని వెంకటేశ్వరరావు, వేముల వెంకట శివ గార్లు లక్ష రూపాయల విరాళం అందజేసారు.

         శ్మశాన వాటిక అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నందుకు గౌడ సంఘం వారికి స్వచ్ఛ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.

- దాసరి రామకృష్ణ ప్రసాదు

 

         వందనములభివందనమ్ములు!

పెద్ద పెద్ద కబుర్లు చెప్పక - ఎవరెవరినో విమర్శించక

ఎవరికొరకో ఎదురు చూడక - ఊరి వీధులు బాగుపరచే

మురుగు కాల్వలు సంస్కరించే - హరిత సంపద విస్తరించే

స్వచ్ఛ సుందర కార్యకర్తకె వందనములభివందనమ్ములు!

- నల్లూరి రామారావు

 

  03.04.2025.