ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులు మనమెందుకు వాడుతాం.
ప్రతి ఒకరూ సామాజిక బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుతాం.
స్వచ్ఛ సుందర చల్లపల్లి 3433* వ రోజు శ్రమ విశేషాలు.
ది. 4.4.2025 శుక్రవారం నాటి వేకువ జాము 4:18 ని.లకు 9 మంది స్వచ్ఛ సైనికులతో పాగోలు రోడ్ మలుపులో ప్రారంభమై కార్యకర్తలు దారికి అటు ఇటు ప్రక్కన ఉన్న చెత్తా చెదారాలు ఎండిపోయిన కొమ్మలు వాటితో పాటు ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ కూల్ డ్రింక్ సీసాలు మొదలగు వాటిని దంతులు, గొర్రులతో లాగి శుభ్రం చేయడం మహిళా కార్యకర్తలు దారి రెండు ప్రక్కల చీపుర్లతో శుభ్రం చెయ్యడం లాంటి పనులు చేస్తూ ఉండగా వాతావరణంలో అనూహ్య మార్పులతో చిన్న వర్షపు జల్లులు ప్రారంభమయి ఆదిలోనే ఆగిపోయినవి.
ఎప్పటికప్పుడు నిన్నటి రోజు చేసిన పని వద్ద నుండి మెరుగులు దిద్దుతూ పాగోలు రోడ్డు బహు చూడముచ్చట గొలుపు తుందనడంలో సందేహం లేదు. రోడ్డు మీదకు వాలిన కొమ్మలను కట్ చేసి షడ్దర్ లో వేయడానికి సిద్ధం చేసిన ప్రత్యేక దళం సభ్యులు 4 గురు. ప్రతి చెట్టును అందంగా కనిపించేలాగున తయారు చేయడంలో సిద్ధహస్తులు.
కార్యకర్తలు బాగు చేయగా వచ్చిన తుక్కు, చెత్తను డిప్పలతో మోయడం చివరి వరకూ ఎక్కడా రోడ్డుపై అడ్డు లేకుండా చెయ్యడం కొద్ది మంది సైనికులు వారి విధిగా ఎంచుకున్నారు.
10 సంవత్సరాలుగా గ్రామ శుభ్రతకు ఇంత సమయ శ్రమదానం చేస్తున్న వివిధ రకాల ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, వైద్యులు, ఉపాధ్యాయులు వారు అనుకున్న స్వచ్ఛ సుందర చల్లపల్లి లక్ష్యం కోసం శ్రమిస్తుంటే మురికి కూపాలకు అపరిశుభ్రతకు దగ్గరగా నివశిస్తూ అంటువ్యాధుల నుండి కాపాడుకోవలసిన సామాన్య మానవులు మాత్రం ఈ స్వచ్ఛ ఉద్యమం గురించి వారికేమీ తెలియనట్లు ఇదేదో మనకు సంబందించినది కాదన్నట్లు, వీరు చేసేదంతా అనవసరమన్నట్లు చూస్తూ వెళుతూ ఉండడం ఏమని అర్ధం చేసుకోవాలో ఆ పెరుమాళ్ళకెరుక.
వాతావరణం చల్లగా ఉండి ఉత్సాహంగా పనిచేస్తున్న సైనికులకు వర్షం వచ్చేలా ఉందనీ అనుమానంతో 1 నిమిషం ముందుగానే పని విరమణకు సైరన్ ఊది చెయ్యెత్తిన రామారావు మాస్టారి పిలుపుతో అందరూ పని ఆపి కాఫీలు సేవించిన పిదప ఈ రోజు శ్రమ చివరి ఘట్టంలో దేసు మాధురి గారు పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లి నినాదం మార్మోగి ఒక్కసారిగా మబ్బులు మాయమై సూర్యుడు కనిపించాడు.
రేపటి సేవా యజ్ఞ ప్రాంతము కూడా ఆ ప్రదేశమేనని ప్రకటించి ముగించడం జరిగింది.
గ్రామంలో చెత్తచెదారం కనిపించని కాలమెప్పుడో అడుగడుగున స్వచ్ఛ శుభ్రతల ఆనంద వికాసమెన్నడో...
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
వందనములభివందనమ్ములు!
ప్రతి యొకరు సాధించగలిగే - ఊరి పరువును నిలుపగలిగే
ప్రజాహ్లాదం ప్రోది చేసే - కాలమున కెదురొడ్డి నిలిచే
సుదీర్ఘ కాలము నుండి సాగే స్వచ్ఛ సుందర శ్రమోద్యమమును
విజయపథమున నడుపు వారికె వందనములభివందనమ్ములు!
- నల్లూరి రామారావు
04.04.2025.