3435* వ రోజు ........

 ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?

ప్రతి ఒక్కరం సామాజిక బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుదాం.

3435* -  శ్రీరామ నవమి పర్వదిన శ్రమదానం!

"ఆదివారమైతే ఏంటటా - ఏడాదిలో చివరి పెద్ద పండగైతే మాత్రమేమిటిటా? మాకు మా గ్రామ సమాజ సుఖ సంతోష కల్పన కంటే గొప్పదా? పూజలుంటే 7.00  కు ఇళ్ల కెళ్లి చూసుకుంటాం - రోజూ వందలాది తోటి ప్రజలు ప్రయాణించే ఒక రహదారిని శుభ్ర - హరిత- సుందరంగా రూపొందించేందుకు ఈ పూట 50 మందిమి నిస్వార్థంగా కష్టిస్తూ సంతృప్తి చెందుతాం.." అంటూ పాగోలు రోడ్డు నడుమ నిన్నటి తరువాయిగా 4.20 – 6.10 సమయాల మధ్య చెమట చిందించిన స్వచ్ఛకార్యకర్తల ఆలోచన- ఆచరణలకు జేజేలు!

100 గజాల రహదారి కాలుష్యాలకూ, అస్తవ్యస్తతలకూ, 2 ప్రక్కల డ్రైన్ల పిచ్చి చెట్లకూ, తుక్కుకూ, వికారంగా కనిపించే పిచ్చి మేడి చెట్లకూ ఈ 2 గంటల్లో కాలం చెల్లింది.  ఎండూ, పచ్చి గడ్డి పరకలకూ ఆ గతే పట్టింది.  

అది ఎవరి ఇంటి ముంగిలో- ఆ బడ్డీ కొట్టెవరిదో – దాని చుట్టూ గలీజు లెవరి ఆశ్రద్దో పొలంలోకి కాలిబాట ఎవరి చేనులోకో - అవి ఎవరు అనాలోచితంగా - అలవోకగా విసిరిన ఖాళీ మద్యం సీసాలో, ప్లాస్టిక్ వస్తువులో వాళ్ళ కనవసరం! " రోడ్డు శుభ్రంగా ఉండాలి, బళ్లకూ, గడ్డి లారీలకూ చెట్ల కొమ్మలడ్డుపడకుండాలి, కనీసం ఈ కిలో మీటరు బాటైనా అటూ - ఇటూ తిరిగే వాళ్లకు ఆహ్లాదకరంగా మారాలి.. అనే ధ్యాసే స్వచ్ఛ కార్యకర్తలది!  సదరు లక్ష్యం పూర్తయి తేనే వాళ్ళకు పండగ!  

ఈ సామాజిక సంబరం కోసమే 105 కిలో మీటర్లు ప్రయాణించి Dr. గోపాళం గారు బెజవాడ నుండి వచ్చింది! మరి పని చోటుకు దగ్గర్లోని 6 ఇళ్ల వాళ్లకు ఈ వేడుక వద్దా అంటే-అది వేరే సంగతి!

3 చెట్ల సుందరీకరణ కోసం ముగ్గురు గంటన్నరపాటు చెమటలు దిగగార్చుతుంటే చూసి, వివేకానంద కళాశాల డైరక్టర్ గారు  “ఈ రోజున వెయ్యేసి రూపాయలిచ్చినా ఎవ్వరూ ఈ పని ఇంత నీటుగా చెయ్యరు” అనడం విన్నాను. పనులు ముగిశాక – అస్మత్ ప్రాయోజిత అల్పాహార  సేవనానంతరం

- సదరు యార్లగడ్డ శివ ప్రసాదు గారే 25 వేలూ,

- శంకర శాస్త్రి గారు 5 వేలూ ఉద్యమ  ఖర్చులకు ఇచ్చారు.

" పని చేయడమే బ్రతికున్న గుర్తు- మంచి పనివాళ్ళైన మీరంతా నందులు.. "  అని శివన్నారాయణుల ఉవాచ!

నల్లూరి శివ కుమారి ప్రాయోజిత అల్పాహారం నేటి విశేషం!

మన రేపటి పని వేడుక కూడ ఈ పాగోలు సమీపాననే!

వందనములభివందనమ్ములు!

మహామహులే పూనుకొనని మనో ధైర్యం కూడగట్టని

మధ్యలోనే వదలివేసిన స్వచ్ఛ సుందర హరిత కృషిని

దశాబ్దంగా నిర్వహించిన - దశదిశలకూ విస్తరించిన

ఆ మహోత్తమ కార్యకర్తకె వందనములభివందనమ్ములు!

- నల్లూరి రామారావు

   06.04.2025.