ఒకసారి ఉపయోగించి వదిలేసే ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
మళ్లీ 35 గురి పొరుగూరి వీధి సేవలు - @3437*
8.4.25 – మంగళవారం - కాస్త ఉక్కపోత తప్ప వాతావరణం వేకువ 4.19 - 6.10 నడుమ పనుల కనుకూలం – పాగోలు వెలుపల – పొలం దక్షిణానా, ఉత్తరం కాల్వలోనా ఎక్కువగా నేటి బాధ్యతలు కేంద్రీకృతం - 4.30 కాదు, 4.19 కే డజను మంది చుట్టారు 100 గజాల వీధి శుభ్ర – సుందరీరణకు శ్రీకారం. ఎవరే పనులెంచుకొందురో – ఎంత మేరకు పూర్తి చేసెదరో... అది మాత్రం పూర్తిగా ఐచ్ఛికం.
వీరిలో కత్తుల – శాఖా కోత యంత్రాల వారు వికారంగా కనిపించే మేడి చెట్లను సుందరీకరించిన చోటు – మృత జీవనుడైన రామబ్రహ్మానికి చెందిన పొలం ప్రాంతం! అక్కడి 2 పెద్ద గుట్టల తుక్కులే వారి శ్రమకు సాక్ష్యం! వాళ్ళకు మరో ఆరేడుగురు దంతెల - చీపుళ్ళ వారి సహకారం! ఇక చెప్పేదేముంది సదరు చోటు శుభ్ర - స్వచ్ఛతా సాక్షాత్కారం!
బాగా మురుగు పనుల్లో ఆరితేరిన 16 మందికి పైగా కార్యకర్తలది గంటకు పైగా ఉత్తరపు డ్రైనులో రకరకాల శ్రమ విన్యాసం! ఫోటోలోనైనా చూడిండి వాళ్ళ శ్రమ ఫలితం! కొంచెం కంపు వస్తున్నా – అందులోని గడ్డీ, తుక్కూ ఎండుటాకులూ, కొమ్మలూ, సీసాలూ తొలగించడానికి వేసవి వాతావరణం కనుక ఇదే సరైన తరుణం!
దక్షిణపు కాల్వలోనా, ఉభయ గట్ల మీదా 10 మంది కృషి సైతం కాదా అభినందనీయం? 6.00 దాటాక - అక్కడ ఒక 7-8 గజాల రోడ్డు మార్జిన్ బిట్టును చూసుకొని, తమ శ్రమ సద్యః ఫలితాన్ని గణించుకొంటున్నది చూడండి – విశ్రాంత ఉద్యోగద్వయం! “కష్టేఫలే” అనే సామెత ఇలాంటి వాళ్లను చూసే పుట్టిందా అని నా అనుమానం!
గంటన్నర శ్రమానంతరం రోడ్డు దక్షిణపు మినప పొలమే కార్యకర్తల నేటి తుది సమావేశ స్థలం. ఈ పూట స్వచ్చ సుందరోద్యమ నినాదాలను పలికింది భోగాది వాసు మాస్టారు గళం! నేటి కృషినీ, గతంలోని పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణాన్నీ వివరించి, వాఖ్యానించింది Dr. డి.ఆర్.కె. గారి చాతుర్యం!
మరువకండి-రేపటి వేకువ పాగోలు గ్రామం వద్దే మన పునస్సమావేశం!
ఉద్యమము అభివందనీయము!
అక్కడక్కడ కమలములతో - అందు పెంచిన వృక్షములతో
బాట ప్రక్కల పూలవనముల సౌరభముతో – పచ్చదనముతొ
ఊరి లోపల ఊరి వెలుపల స్వచ్ఛ మగు రహదార్లతోనూ
చల్లపల్లిని తీర్చిదిద్దిన ఉద్యమము అభివందనీయము!
- నల్లూరి రామారావు
08.04.2025.