ఒకసారి ఉపయోగించి వదిలేసే ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
3438* వ నాటి బాధ్యతలు మాత్రం ఏం తక్కువ?
బుధవారం (9.4.25) కూడ మళ్లీ ఆదే పాగోలు మార్గం; సమయదానాలు కూడ 4:20 – 6:10 మధ్యస్తాలే! ఊళ్లోవి కాక – పొరుగూరి వీధి శుభ్రతలు కూడ తమకే కావాలనుకొనే 38 మంది శ్రమ వైభవాలు! ముసలోళ్ళా – ప్రొద్దున్నే బడుల డ్యూటీలున్న పంతుళ్ళా - గృహిణులా - ఆటో రిక్షా తోలుకోవలసిన నాగరాజా... ఎవరు వెనక్కి తగ్గారు కనుక!
అసలిలాంటి మహత్తర సేవలందుకోవాలంటే చల్లపల్లీ, పాగోలూ, శివరాం, వెంకటాపురాల్లాగా అన్ని – ఊళ్ళూ పెట్టి పుట్టాలి! వేల రోజుల – లక్షల గంటల – ఇన్ని రహదారి బాధ్యతలు తీసుకోవాలంటే వాలంటీర్లకు ‘గట్స్’ ఉండాలి! వేకువ చీకట్లో పొదల్లో – మురుగు కాల్వల్లో ఇన్ని రకాల చీదర పనులకు దిగాలంటే దమ్ముండాలి!
ఇన్నిన్ని పనులు చేయడం సరే – తమ ఊరి కోసం జరిగే శ్రమ వేడుకను చూసే అదృష్టం మాత్రం ఉండొద్దూ? నా వరకు నేను ఈ రోజు ఆలస్యంగా వెళ్లడం వల్ల ఆ అదృష్టం పూర్తిగా దక్కనే లేదు. నేను చూసినంతలో
- ఈ కిలోమీటరుకు మించిన పాగోలు రోడ్డులో కార్యకర్తలు 3 బృందాలుగా విడిపోయి,
1) బ్రహ్మం గారి గుడి వద్ద 5 గురూ,
2) వీధి 2 వ మలుపు వద్ద 6 గురూ,
3) మిగిలిన వారు పాగోలు సమీపానా కర్తవ్యంలో మునిగారు.
ఇందులో ఎవరికెవరూ పోటీదారులు కారు, ఎవరి శ్రమ వాళ్ళది. ఎవరి సంతృప్తి కొలతలు వాళ్ళవి! తాడి చెట్లను సుందరీకరించే వాళ్లు - 2 రకాల సీసాలేరే వాళ్లు – గడ్డి చెక్కేవాళ్లు – నరికిన కొమ్మల్ని గుట్టలు పేర్చేవాళ్లు – మురుగు కాల్వల్ని చక్కదిద్దే వాళ్లు...
ఇంత సందడిలో - ఇందరి ఉమ్మడి శ్రమతో వీధికి కొంగ్రొత్త రూపురాక ఏం చేస్తుంది? శ్రమ విలువ తెలిసిన వాళ్ళకి - ఏకాస్తయినా సౌందర్య దిదృక్ష ఉన్న మనుషులకు ‘ఇది అన్ని ఊళ్లలోని అన్ని బజార్ల వంటిది కాదు – వీధంటే ఇలా కదా ఉండాలి! అనిపించదా?’
6.25 వేళ - మినప చేలో జరిగిన సభలో:
1) అమెరికా ప్రయాణికుడు M. ప్రేమానంద్ గారికి సాదర వీడ్కోలు,
2) గతంలో వలెనే ఇకముందు కూడ శ్రమదాన వేళ రాజకీయాల – కుల – మత – ప్రాంత ప్రస్తావనలు చేయవలదనే DRK గారి సున్నిత సూచన,
3) అవసరాన్ని బట్టి ఒకటికి 2 మార్లు పైడిపాముల కృష్ణకుమారి గారు నినాదాలు చేయడం,
4) రేపటి వేకువ కూడ మన పనులు పాగోలు వద్దననే నిర్ణయం!
వందనములభివందనమ్ములు!
స్వార్ధలోకములోనె ఉండక పరులకై శ్రమ ధారపోసే –
కీర్తి దురదలు అంటకుండే - పట్టుదలలను ప్రదర్శించే –
ఊరి వీధుల దుమ్ము ధూళిని ఊడ్చి వేసే - అందగించే
స్వచ్ఛ సుందర కార్యకర్తకు వందనములభివందనమ్ములు!
- నల్లూరి రామారావు
09.04.2025.