ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1986* వ నాటి గ్రామ కృషి చైతన్యం
ఈ వేకువ 4.02 కే ప్రారంభమైన స్వచ్చ చల్లపల్లి కార్యకర్తల అలుపెరగని నిరంతర – నిస్వార్ధ గ్రామ మెరుగుదల వ్యవసాయం ఒకానొక చోటైతే 6.40 వరకూ (ఆదర్శ కృషిలో పొందే ఆనందం కారణం కావచ్చు!) ఆగనే లేదు! ఈ 36 మంది శ్రమదాన వైభవం చల్లపల్లి లోని 3 ప్రాంతాలలో గమనించాను. మూడు రకాల ఆ కృషి వివరాలు:
1) బందరు జాతీయ రహదారి ఉత్తర దిక్కున – అమరావతి రాజు వారసుల ‘వైజయంతం’ నామఫలకం గల పెద్ద ప్రహరీ గోడ సుందరీకరణం అందులో మొదటిది. నానాటికీ ఈ చల్లపల్లిని మరింత – మరింత సుందరతరం చేయాలనే ఈ 7-8 మంది సుందరీకరణ విభాగం వారిది ఒక వెఱ్ఱో, ప్రగాఢమైన దీక్షో, కొత్తరకం తపస్సో... ఇప్పుడే చెప్పలేను. మొండి గోడల్ని, వంకరరాళ్లని కూడ సౌందర్యమయం చేసే ఒక పరుస వేది వీళ్ళ దగ్గర ఉందని మాత్రం చెప్పగలను! వీళ్ళ సుందరీకరణ యజ్ఞం మరో రెండు వారాలు పట్టినా ఆశ్చర్యం లేదు!
2) రెస్క్యూ టీం వారు – గ్రామ రక్షణ ప్రయత్నంలో వారి దొక లోకం! ఊరిలోని ఏ మూల – ఏ లోపం వస్తుందో వాళ్ళకెలాగో తెలిసిపోతుంది. ఒకసారి తమ దృష్టికి వచ్చాక – ఊరికి ప్రయోజనకరంగా దాన్ని సరిదిద్ది గాని శాంతించరు. బండ్రేవు కోడు మురుగు కాల్వ ఉత్తరం గట్టు మీద తాము 4 ఏళ్ల నుండి పెంచుతున్న శ్యామ సుందర వృక్షాల పొదల మట్టి కోసుకుపోయిన చోట్లలో నేడు కూడ తాము సేకరించిన ట్రాక్టర్ మట్టి – దుమ్ము – తుక్కులను నింపి వాటికి రక్షణ కల్పించి వచ్చారు.
3) ఈ నాడు ఎక్కువ మంది కార్యకర్తలు తమ శ్రమ విరాళం సమర్పించింది మాత్రం నారాయణరావు నగర్ లోని ఒక ప్రముఖ వీధిలోనే! రెస్క్యూ టీం వారితో సహా 25 మందికి పైగా ఆ వీధికిరు వైపులా – పిచ్చి, నిరర్ధక మొక్కల్ని, ముళ్ళ కంపను, నరుకుతూ, ఊడుస్తూ, దంతెలతో పోగులు చేస్తూ – వాటిని ట్రాక్టర్ లో నింపి చెత్త కేంద్రానికి తరలిస్తూ – అవసరమైతే మురుగులో దిగి కూడ వ్యర్ధాలను తొలగిస్తూ – ఈ వేసవి ఉక్కపోతతో బట్టలు తడిసి నానుతూ.... 2 గంటల సమయాన్ని ఇట్టే పూర్తి చేసి మరీ కాఫీ సేవించి గృహోన్ముఖులయ్యారు.
DRK. ప్రసాదు డాక్టర్ గారు – కరోనా హెచ్చరికలు చేసి, సామాజిక దూరం, మాస్కుల సంగతి మళ్ళీ గుర్తు చేసి, మన స్వచ్చ సుందర చల్లపల్లి లోని సామాజిక అద్భుతాన్ని సందర్శించాలనుకొంటున్న ఇద్దరు విశిష్టవ్యక్తుల విషయం ప్రస్తావించారు: ఒకరు – అమెరికా ప్రవాసిని, ఇక్కడి సామాజిక కార్యకర్త పడాల సింతియా గారు, రెండు – శాశ్వత ప్రాతఃస్మరణీయులైన వావిలాల గోపాలకృష్ణయ్య గారి మనుమడు సోడేకర్ గారు. (ఈ ఇద్దరు ధన్యులను చూసే అదృష్టం మన స్వచ్చ కార్యకర్తలకు ఈ కరోనా రక్కసి మూలంగా ప్రస్తుతానికి ఉండకపోవచ్చు.)
ఎంతో కాలం నుండి స్వచ్చ సుందర చల్లపల్లికి గరిష్టంగా బాధ్యత వహిస్తున్న – RTC డ్రైవర్ శ్రీ తోట నాగేశ్వరరావు గారి అభిమానపూర్వక బిస్కెట్ పోట్లాలు ఈ రోజు కార్యకర్తలందరికీ పంపిణీ జరిగింది – ధన్యవాదాలు.
హీరో మోటార్స్ యజమాని దాసరి శ్రీనివాసరావు గారి 10,000/- రూపాయల విరాళాన్ని ‘మనకోసం మనం’ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ దాసరి రామకృష్ణ ప్రసాదు కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించారు.
రేపటి మన గ్రామ బాధ్యత నిర్వహణ ప్రాంతం ‘బికనీర్’ దగ్గర.
1986 = 2 లక్షలు = సగం గ్రామం
ఎవరినీ నొప్పించకుండా – ఏది రాజీ పడక కదలుచు
రెండు లక్షల గంటలుగ తమ శ్రమ విరాళం సమర్పిస్తూ
సుమారుగ తమ గ్రామశౌచం సగంపైనే ప్రోదిచేస్తూ
చల్లపల్లిని నిజంగానే స్వచ్చ సైన్యం ఆవహించిందా!
- నల్లూరి రామారావు
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలు
ఆదివారం – 19/04/2020
చల్లపల్లి.