ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
ఎక్కడ – ఎప్పుడూ, ఎందరు – ఏమిటి....? – 3451*
ఎక్కడనగా - పాగోలు మార్గమందున ½ కిలోమీటరు పొడవునా: ఎప్పుడనినచో - మంగళవారం (22-4-25) వేకువ గంటన్నరకు పైగా; గ్రామ పారిశుద్ధ్య సంఘ సభ్యులు ముప్పది ముగ్గురే! ఇక వేరే చెప్పాలా -11 ఏళ్ళుగా ఇదే తంతు – చల్లపల్లితో బాటు – చుట్టూ 2-3-4 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ ఏ కాలుష్యం ఉన్నా – ఏ డ్రైను నడవలేకున్నా – పచ్చదనం లోపించినా మనసు చివుక్కుమని చెత్త పనులకు దిగడమే గదా వాళ్ళ నియమం!
నలభయ్యో – నలభై రెండో గాని వేకువల రహదారి శ్రమదానం ఈ ఉదయం దిగ్విజయంగా ముగిసింది. NTR బడి కటూ ఇటూ కిలోమీటరుపైగానూ, ముగ్గురు మాత్రం పాగోలు గ్రామ కేంద్రం వద్దా చేశారు. ఈ ముగింపు శ్రమను రోజుటివలె కాక ఈ ఉదయం కాస్త తేలిక పని - ఇద్దరు కార్యకర్తల మాట ప్రకారం "చాలీచాలని పని" - కూలీలు త్రవ్వి వదలిన డ్రైను మట్టితో మొక్కలకు పాదులమర్చిన పని ఆడుతూ పాడుతూ పూర్తికావించారు!
అలాగని అలవాటుపడిన కొందరి చేతి చీపుళ్ళు బాటను ఊడ్వలేదని కాదు; సుందరీకర్తలు తమ వ్యసనాన్ని వదిలారని కాదు; మళ్ళీ క్రొత్తగా పడిన మద్యం – నీటి సీసాలను ఏరలేదని కాదు!
అసలీ 40 నాళ్ళ వీధి పారిశుద్ధ్య శ్రమ ముగింపు ఇలానా? అపార్ట్మెంట్ల నుండీ, పాగోలు నుండీ ప్రజలు వచ్చి పాల్గొనవద్దా? ఈ రహదారి ఎవరెవరి బిడ్దో నా- పట్టించుకొనకపోవడానికి? స్వచ్ఛ కార్యకర్తలు కేవలం తమ కోసమా 2 వేల గంటలు శ్రమించి దానిని తీర్చిదిద్దింది?
ఇన్ని నాళ్ల శ్రమకు ముగింపుగా షణ్ముఖ శ్రీనివాసుని, పల్నాటి అన్నపూర్ణల జాయింట్ వెంచర్ గా కార్యకర్తలకు ఆరోగ్యదాయకమైన రాగి లడ్డుల పంపకం జరిగి,
నిన్న చిత్తూరు, అనంతపురం జిల్లాల పాతిక మంది మహిళా సర్పంచుల స్వచ్ఛ - చల్లపల్లి సందర్శననూ, నేటి కార్యకర్తల సాటిలేని శ్రమోదార్యాని Dr. DRK ప్రస్తావించి, పెద్ద కృష్ణకుమారి ప్రవచిత నినాదాలు పునరుద్ఘాటించి,
రేపటి మన శ్రమ సందడి SBI - SRYSP - గస్తీ గది - వద్దనని గ్రహించి ఈఒక్కనాడు మాత్రం 6:30 కే ఇళ్లకేగారు!
ఔరౌరా! పాగోలు బాట!
ఔరౌరా! పాగోలు బాట! ఇపుడందాలకు పెద్ద పీట
దాని సొగసు-దాని హొయలు తరం కాదు వర్జించుట
తగు మాత్రపు పచ్చదనం తనివి తీర సౌందర్యం
బహుశా 2 మలుపులతో బాట కింత క్రొత్తదనం!
- నల్లూరి రామారావు
22.04.2025.