ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
3452* వ నాటి శ్రమ వివరాలిలా –
అవి 23-4-25 → బుధవారం వివరాలనుకొండి. నెలకు పైగా → 17-18 వందల పనిగంటల - 1 ½ కిలోమీటర్ల పాగోలు రహదారికీ, అంతకు ముందు ఏకంగా 50 పని దినాల - సుమారు 2000 పని గంటల - 4 కిలోమీటర్ల వెంకటాపురం బాటకూ దారబోసిన చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల శ్రమదానం గ్రామ ముఖ్య వీధి అయిన బందరు రోడ్డును ప్రవేశించింది.
గ్రామం నుండి ఒక్క పైసా ప్రతిఫలమాసించని 29 మంది కార్యకర్తలు ఈ వేకువ 4.13-6.05 కాలాలలో
1) గస్తీ గది ప్రాంతమూ,
2) SBI కేంద్రమూ,
3) మూతబడ్డ వడ్లమర ఎదురుగానూ,
4) 6 వ నంబరు కాల్వగట్టు ఉద్యానమూ,
5) శాయినగర్ తొలి బజారులోనూ చెమటలు చిందించారు!
ఐదవది చిక్కటి మురుగు కాల్వ, గట్టూ పని! మెట్ట తామర తదితర మొక్కల్తో మూసుకుపొయిన డ్రైన్నూ, 2 ప్రక్కలా బజారును క్రమ్మేసిన ఏవేవో మొక్కల్ని 6 గురే చక్కబెట్టారంటే నమ్మండి!
బందరు రోడ్డుకు ఉత్తరాన పంటకాల్వ గట్ల మీద డజను మంది చెమటలొలికి, ట్రాక్టరు వ్యర్ధాలు దొరికి, మినీ ఉద్యానంగానీ, పడమటి మొండి వీధిగానీ ఇప్పుడు కళకళలాడుతున్నవి గదా!
SRYSP విద్యాశాల గేటు దాక నిర్విరామంగా ఊడ్చిన 6 గురి దుమ్ముకొట్టుకున్న ముఖాలు చూస్తే తెలియడంలా - వాళ్ళ పనితనమేమిటో – ఆ వీధి భాగం ఎందుకంత శుభ్రంగా మారిందో!
నాకప్పుడప్పుడనుమానం వస్తుంటది – ‘అప్పటి దాక ప్రశాంతంగా ఉన్న కార్యకర్తలు వీధి కాలుష్యాలూ, అస్తవ్యస్తతా చూడగానే ఎందుకావేశపడతారా – ఆయుధాలతో అంతగా రెచ్చిపోతారో’ అని! ‘ఈ మురికి వీరులు అడిగీ అడగ్గానే పాటగాడు అంత బాగా పాడేస్తాడేమిటా’ అని!
గస్తీ గది వద్ద నేటి నినాదకుడు వక్కలగడ్డ సాద్వి, సమీక్షకుడు Dr. డి.ఆర్.కె.,
రేపటి వేకువ పనులు ప్రారంభం SBI వద్ద నుండి !
కార్యకర్తలందించిన కానుక
పుష్పించిన ఆ మొక్కలు నీడ పంచుచున్న చెట్లు
గడ్డి, పిచ్చి మొక్కలేని కమనీయత, రమణీయత
సౌందర్యారాధకులకు - స్వచ్ఛ శుభ్ర ప్రేమికులకు
కార్యకర్తలందించిన కానుక పాగోలు బాట!
- నల్లూరి రామారావు
23.04.2025.