ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
గురువారం (24-4-25) నాటి వీధి శ్రమ రీతులు - @3453*
వరసగా నెల రోజులు పరిశీలించే క్రొత్త వాళ్ళకు ఈ కార్యకర్తల పారిశుద్ధ్య పద్ధతుల్లో పెద్దగా మార్పులేం కనిపించవు! ‘ఆ..! ఏముంది చూసేందుకు - చీపుళ్లతో వీధి ఊడ్పులూ, దంతెలతో డ్రైన్ల తుక్కులాగుడూ, తానే నాటి - పెంచిన చెట్లు కనుక అందంగా తయారు చేసుడూ, రోడ్ల ప్రక్క మరీ పల్లాలుంటే బరంతులు నింపుడూ, రోడ్ల గుంటలు పూడ్చుడూ, సుందరీకరణ కోసం గోడ లెక్కుడూ, చెట్ల మీదికి ఎగ బ్రాకుడూ.....” ఇవేగా అనుకొంటారు!
కాని – “4 లక్షల పైగా పని గంటల వీళ్ళ శ్రమదానా లెందుకు, విసుగూ విరామం లేని పదకొండేళ్ళ ఊరి మెరుగుదల చర్యల పరమార్ధమేమి? జనం నుండి చాలీచాలని ప్రతి స్పందనల మధ్య ఈ డాక్టర్ల, మహిళల, ఉద్యోగుల మొండి ప్రయత్నాల పర్యవసానమేమి? వీళ్ళ పనులు మంచివే కనుక రేపటి నుండి మనం కూడ వాళ్ళతో చేరుదాం!..." అని ఏ ఒకరో ఇద్దరో తప్ప నిర్ణయించుకోరు!
షరా! మామూలే - ఈ వేకువ కూడ 35 మంది –
1) ఉద్యానాల్లో పాదుల-సుందరీకరణ ప్రయత్నాలు చేసి,
2) అరకిలోమీటరు దూరాన 5 గురు శాయినగర్ తొలి వీధి లోపాల్ని సరిజేసి,
3) గస్తీగది ప్రాంతంలో మరిన్ని శుభ్ర సుందరీకరణలకు పాల్పడి,
4) బందరు రోడ్డు ఉత్తరపు డ్రైన్ లో మరొక బండెడు చెత్తను బైటకు గుంజి,
5) రిజిస్ట్రార్ ఆఫీసు, పింగళి ఆస్పత్రుల దాక ఊడ్చి రక్తపరీక్షా కేంద్రాల వైపు శుభ్రపరచి....
చెమటలు క్రక్కారు, మధ్యలో జోకులేసుకొన్నారు, 2-3 చోట్ల కొందరు తాము తీర్చిదిద్దిన వీధి భాగాన్ని మనసారా చూసుకొంటూ ఫొటోలు దిగారు! (తమ పని ఫలితాన్ని ఇంటి దగ్గర ఇంకోమారు చూసి అనందిస్తారన్నమాట!)
ఇక - 6.25 వేళ - కాఫీల అనంతరం
- భోగాది వాసుని సుస్పష్ట నినాదాలతోనూ,
- దాసరి వైద్యుల వారి ఎక్కడెక్కడి-ఎప్పటెప్పటి స్వచ్చ కబుర్లతోనూ – జ్ఞాపకాలతోనూ,
- రేపటి పనుల కోసం SRYSP గేటు వద్ద కలవాలనే నిర్ణయంతోనూ నేటి శ్రమదానం పూర్తి అయ్యెను!
- నల్లూరి రామారావు
24.04.2025.