3454* వ రోజు .... ....

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.

మరొక అభివందనీయ శ్రమదానం – [శుక్రవారం-  25-4-25] @3454*

         ఐతే-ఎందుకా అభివందనీయత? ఏమిటి ఆ 36 గురి, వీధి పరిశుభ్రతా ప్రత్యేకత? దేశంలోకెల్లా సామాజిక శ్రమ సందేశం ఇక్కడే తొలిప్రొద్దు పొడిచిందా? ఇంతకెంతో ముందే ఎన్నిమార్లు-ఎందరు మహనీయులింత కన్నా బాగా దేశ సేవలు చేసారో! _ అంటే:

1) పదకొండేళ్లుగా చెప్పుకోదగ్గంత శ్రమదాతల గుంపు పాతిక వేల జనాభా గల గ్రామం కోసం ఎంత మురికి బండ పనులకైనా దిగడం;

2) దేశ జనాభాతోబాటు కాలుష్యం బెడద పెరిగి ఊళ్ల వీధులూ, జనం మనసులూ స్వార్థం జాడ్యంతో ఖరాబైపోయిన వర్తమాన దుస్థితి;

3) ఏదొక చోట - ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు కాలుష్య దుర్మార్గమనే పిల్లి మెడలో గంట కట్టక తప్పని తరుణం కావడం;

4) మన ఊరి ఎంగిళ్లను, అనారోగ్యాలను, అస్తవ్యస్తాలను మనం కాక ఎవరు సరిదిద్దాలి?” అనే ఇంగితం ఈ ఊరి కొందర్లో మేల్కొనడం.... వంటి హేతు పూర్వక సేవలను కాక ఇంకా వేటిని అభినందించాలి?

         తీరికే లేని ఒక పసుపులేటి సత్యాన్ని ఏమిటి హడావిడిగా తిరిగి వెళ్తున్నావని అడిగితే – “5:00-6:00 మధ్య నిద్రపట్టక ఇంటి దగ్గర పడుకొంటే ఏమొస్తది? గంటైనా ఇక్కడ పనిచేస్తే సరదాగా ఉంటది,” అన్నాడు! ఈ మురికి దుమ్ము - బురద పనులు ఒక స్వచ్చ కార్యకర్తకు సరదాఅన్నమాట!

         చిన్నపిల్లలు - గంధం తర్షిత్ - యశ్వంత్ ల పారిశుద్ధ్య పనులు ఎంత ముచ్చట కొలిపాయో తక్కిన కార్యకర్తలకు!

         ఐదారు కిలోమీటర్ల మంగళాపురం నుండి మట్టా జ్యోతి, సుధీర్లు వేకువనే వచ్చారు సరే - మళ్లీ కూలికి వెళ్ళవలసిన వాళ్ళింత శ్రమించాలా?

         8 నుండి 12 ఏళ్ల మరో ఇద్దరు చిన్నారుల శ్రమదానం విశిష్టమైది కాదా?

         6.10 తర్వాత - SRYSP మొదలు కర్మల భవనం దాకా వీధంతా శుభ్రంగా ఉందో లేదో చూడండి, గస్తీ గది వద్దా, కళాశాల వద్దా ఉద్యానాలు కనువిందుచేస్తున్నాయా లేదా గమనించండి!

         గంధం తర్షిత్ బెదురు లేకుండా స్వచ్చోద్యమ నినాదాలెలా చేశాడో చూశారా? DRK గారు మూత లేకుండా వచ్చే ఇసుక లారీల నుండి జారిన సమస్యను కార్యకర్తల్తో చర్చించారు, క్రొత్త 4 గురు కార్యకర్తల్నభినందించారు,

         రేపటి వేకువ పనుల కోసం మునసబు వీధి వద్ద ఆగాలని నిర్దేశించారు!

         ఇక పై 10 రోజుల్లో

ఇది మన MTM రోడ్డు ఇది మొన్ననె ప్రారంభం

ఇక పై 10 రోజుల్లో ఎట్లుండునొ దీనందం

ఎంతెంతగ శ్రమదానం ఈ వీధిన జరుగనుందొ!

ఏమాత్రం తృప్తి స్వచ్ఛ కార్యకర్తలకు దక్కునొ!

- నల్లూరి రామారావు

  25.04.2025.