ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
3456*వ విడత బందరు తదితర వీధి సేవలు!
కావడానికి ఆదివారమేగాని, (27-4-25) 49 మంది కాదు. 39 మందే స్వచ్చ కార్మికులు హాజరయ్యారు. ముగ్గురు చిన్నారుల, ఇద్దరు డాక్టర్ల, టైలర్ల గైరుహాజరీతో ఆ కొరత!
సరే - వాళ్ళు వాహనాలను ఆపుకొన్నది మునసబు వీధి వద్ద, పనివేళ 4-17- 6.06 ల మధ్య, అన్ని రకాల కాలుష్యాల పని బట్టింది
1) బందరు వీధి, 2) సజ్జా వారి బజారూ, 3) పాక్షికంగా మునసబు వీధి, 4) 2 ఉద్యానాల్లో, 5) కర్మల భవనం వెనుకా! సంతృప్తి చెందినది నేటికి సరిపడా!
వందా - నూటిరవై గజాల్లోనే కొబ్బరిబొండాల కొట్లు, పింగళి వారి ఉద్యానమూ, రాజ భవన పూదోటా, వగైరాలు! మరి ఈ కాస్త జాగాల్లో 39 మంది పనులు చేస్తుంటే పుట్టుకొచ్చే సందడి మాత్రం తక్కువా?
ఈ సందడి, ఈ సఖ్యతల కోసమేగదా- చల్లపల్లి, రామానగరం, మంగళాపురం వంటి వివిధ గ్రామాల కార్యకర్తలు అంత చీకటి వేళ వచ్చి, స్వచ్ఛంద దిన చర్యలకు దిగేది?
వచ్చిన కార్యకర్తలు వచ్చినట్లు చకచకా అవసరమైన ఆయుధాలు తాల్చడమూ, ఒంటికి దుమ్ము కొట్టుకున్నదో - బట్టలు మాసిపోతున్నవో- తలనుండి చెమట కళ్లలోకి జారుతున్నదో - దుమ్ము - చెత్త డిప్పలు మోస్తుంటే తల నిండా దుమ్ము పడిందో- ఉద్యానాల్లో దూరి పనులు చేస్తుంటే పుల్లలే గుచ్చుకొంటున్నవో - పట్టించుకోకుండ గంటన్నర పాటు అనుకొన్న పనులు ముగించడమూ!
30-40 మంది సామూహిక- సదాశయ శ్రమదానంతో అదొక ఊపు - ఉత్సాహం పుట్టుకొస్తాయి మరి! ముసలీ- ముతకా కార్యకర్తల ఆనంద - ఆరోగ్య రహస్యం అదే గదా!
6.15 కు, నందేటి వారందించిన కాఫీలాస్వాదించి, బృందావనుడు పంచిన లడ్డులూ,(అవి N. శివ కుమారి ఖర్చుతో + అన్నపూర్ణ శ్రమతో తయారైనవి) పల్నాటి వారి గట్టి చెక్కలూ, స్వీకరించి,
బాగా సాగదీసి, అన్న పూర్ణ చెప్పిన నినాదాలకు బదులిచ్చి ఆకుల దుర్గా ప్రసాదు గారు అగ్రహారం లో రేపు సాయంత్రం 5.00 కు నూతనంగా ప్రారంభించు మహిళా దుస్తుల తయారీ వద్దకు ఆహ్వాన మందుకొని,
రేపటి వేకువ భగత్ సింగ్ గారి ఆస్పత్రి వద్ద కలవాలని నిర్ణయించు కొని, గృహో న్ముఖులైరి!
ఇది కనిపించని యుద్ధం
ఇది కనిపించని యుద్ధం - సకల కలుషితాల పైన
ఇది అమూల్యమగు త్యాగం - ఈ సమాజ పురోగతికి
ఈ గ్రామం చూసిందా -ఇంత దీర్ఘ శ్రమదాతృత?
దేశం చూస్తున్నది ఈ సౌమనస్య సౌహార్దత !
- నల్లూరి రామారావు
27.04.2025.