1988* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు. 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1988* వ నాటి ప్రత్యేకతలు

          నేటి ప్రాతః సమయం 4.03 కు బందరు జాతీయ (NH 16) రహదారిలో అమరావతి రాజ భవనం దగ్గరకు చేరుకొన్న చల్లపల్లి స్వచ్చోద్యమకారులు 37 మందిలో వృత్తి వైద్యులు, చిరు – పెను వ్యాపారులు, గృహిణులు, ప్రస్తుత – విశ్రాంత ఉద్యోగులు, రైతులు, కాంపౌండర్లు, నర్సులు ఉన్నారు. 6.10 దాక తమ దైహిక – మానసిక శక్తి వంచన లేకుండ వేలాది దినాలు వలెనే ఉన్న ఊరి మెరుగుదల కోసం చెమటోడ్చారు. 5.00 – 6.00 గంటల నడుమ వందలాది గ్రామస్తులు ఈ శ్రమదాతల ప్రయత్నాలకు ప్రేక్షకులుగానే మిగిలారు తప్ప – మెచ్చుకొంటూ వెళ్లారే తప్ప కార్యకర్తలతో చేతులు కలపలేదు. ఈ నాటి శ్రమదానం మూడు విధాలుగా చల్లపల్లి కి అక్కరకు వచ్చింది.

- గ్రామ భద్రతా దళం వారు గంగులవారిపాలెం బాటలోని బండ్రేవు కోడు మురుగు కాల్వ ఉత్తరం గట్టు మీద తమ పోషణలో ఉన్న చెట్ల కుదుళ్ళు కోసుకొని పోకుండ ట్రాక్టర్ నిండా మట్టిని వ్యర్ధాలను నింపుకొని పోయి, దింపి, ముందు జాగ్రత్తలు పాటించారు. ఇదే దారిలో నిన్న విద్యుత్ కార్మికులు నరికిన చెట్ల కొమ్మలు, ఆకులు, గడ్డిని వీరీవిధంగా సద్వినియోగపరిచారు!

 

- దింటకుర్తి శైలజ వంటి కొత్త కార్యకర్తలు చేరి, సుందరీకరణ సభ్యులు అమరావతి ప్రభువుల “వైజయంతం” గోడ అందాలకు మెరుగులు దిద్దారు. వేగంగా వచ్చే – వాహనాల రొదలు, వేసవి ఉక్కతో కారే చెమటలు ఏవీ వీరి మనః కేంద్రీకరణకు అడ్డురాలేదు. నానాటికీ తమకళా నైపుణ్యాన్ని పెంచుకొంటూ – గ్రామ సౌందర్యాలకు భరోసా ఇస్తూ ఈ దార్శనికుల కృషి వర్ధిల్లుతూనే ఉంది.

 

- 20 మందికి పైగా కార్యకర్తల్లో సగమంది రహదారి దక్షిణంగా ఉన్న ఉద్యానవనంలోను, మిగిలిన వారు ఉత్తర దిశలోని వైజయంతం లోపల దీక్షాదక్షతలతో పనిచేసిన విధానం చూసి తీరాల్సిందే. ఉత్తరపు గోడ బారునా ఎండుతున్న పిచ్చి – ముళ్ళ మొక్కల్ని, గడ్డిని నరికి, పీకి, రకరకాల వ్యర్ధాలను గొర్రులతో లాగి, చీపుళ్లతో ఊడ్చి, ఆ గుట్టలను తరలించే సమయం చాలక ఇప్పటికి వదిలి వేశారు. రోడ్డుకు దక్షిణాన ఫెన్సింగ్ లోని ఉద్యానాన్ని కొందరు మహిళలెంత క్షుణ్ణంగా బాగుపరచారంటే – ఇప్పుడక్కడ ఒక్క గడ్డిపరక లేదు., కలుపు లేదు. నట్టిల్లులా శుభ్రంగా – మరొకసారి చూడాలనిపించేంత అందంగా రూపొందింది. (శాస్త్రి గారి వాట్సాప్ చిత్రాలలో గమనించండి!)

 

- విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రక్కన ఎత్తైన వేప చెట్ల కొమ్మలు తొలగించడం ఎంత సాహసమే ఆలోచించండి!

 

          అన్ని జాగ్రత్తలు పాటించిన సమీక్షా సమావేశంలో నేటి ముఖ్య సమాచారం గతంలో చల్లపల్లి లో వైద్యుడైన M. సత్యనారాయణ గారు (ప్రస్తుతం విశాఖ జిల్లా యలమంచలి) మనకోసం మనంట్రస్టుకు ఇక మీద ప్రతి నెలా 10 వేల చొప్పున 6 నెలల పాటు విరాళం ప్రకటించడం!

 

          రేపటి కార్యక్రమం కూడ బందరు రహదారిలో - అమరావతి జమీందారు గారి వైజయంతం దగ్గరే!

 

         మురుగు వీర కధాక్రమం

స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బెట్టిదనిన...

సామాజిక ఋణశేషం తాత్త్వికత పునాదిగా...

మురుగు – పంట కాల్వలెన్నొ మొలలోతున దిగి దేవుచు

దోమల – ఈగల – జబ్బుల తుడిచి పెట్టు ప్రయత్నం!

 

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలు

మంగళవారం 21/04/2020

చల్లపల్లి.

4.03 కు చిన్న రాజాగారి ఇంటి వద్ద