3460* వ రోజు .... ....

 ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటిమానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.

3460* నాటి ఉపమార్గ పారిశుద్ధ్యాన్ని చిత్తగించండి!

         గురువారం (మేడే) నాడు 30 మంది సాధించిన గ్రామ బాధ్యలివి! ఆ వీధి చిన్నదే – గాని హైవే వాహన రద్దీని తగ్గించగల్గుతున్నది! దాని చరిత్ర కూడ తక్కువేం కాదు - పదేళ్ల నాడు సదరు వీధి వేకువ దృశ్యాలు గుర్తుకు తెచ్చుకొండి - చెంబులతో చక్కగా బారులు తీరి పదేసి మంది కూర్చొని ఉండేవాళ్లు!  

         అది భారతలక్ష్మి వడ్లమర వీధి: ఇప్పుడు రిలయన్స్ స్మార్ట్ బజారు; ఈరోడ్డు ODF+ లో, హరిత సుందరీకరణలో మహనీయ స్వచ్చ కార్యకర్త వాసిరెడ్డి కోటేశ్వరరావుదే పెద్దన్న పాత్ర! ఈ వేకువ 2 గంటలపాటు స్వచ్చ కార్యకర్తలు కొనసాగించినది అతని వారసత్వాన్నే!

         ఐతే ఇందరు కష్టించినా వడ్లమిల్లు దాకనే పని పూర్తి చేయగలిగారు. బాటకు తూర్పున బాగా రోడ్డు మార్జిన్ ఎగుడు దిగుళ్ళు సరిచేయడం వల్ల, రాతి ముక్కల్ని దిమ్మిశతో అణగ్గొట్ట వలసి రావడం చేత, చెరువు వైపు ఉద్యానంలో ప్లాస్టిక్ తుక్కులు, సీసాలు, ఎండు కొమ్మలు, ఆకులు నిండడం వల్లా పని చురుగ్గా సాగలేదు!

         “ఇందరు తలపండిన పారిశుద్ధ్య అనుభవజ్ఞులు ఇంతసేపు ఈ 150 గజాల వీధినేనా శుభ్రపరిచింది?” అని కాదు ఆశ్చర్యపడవలసింది – “ఈ చిన్న వీధిలోనేనా ట్రాక్టరు నిండా వ్యర్ధాలు దొరికింది?” అనే!

         స్థానికులెవరూ కార్యకర్తలుగా మారనేలేదీ పూట! స్మార్ట్ బజారు ఉద్యోగులు సైతం వ్రేలు పెట్టలేదు. ఇద్దరు - ముగ్గురు రెగ్యులర్ వాలంటీర్లు కూడ గైరు హాజరే! ఐనా సరే - ఈ స్వచ్చ - సుందర రథయాత్ర సజావుగానే సాగిపోయింది!

         ప్రపంచ కార్మిక దినాన్ని గుర్తుచేస్తూ కాబోలు – ఐదారుగురు ఎర్ర దుస్తులు ధరించారు. ఈనాటి నినాదకర్త, పాటగత్తె మట్టా మహాలక్ష్మి!

         రేపటి వీధి బాధ్యతలు కూడ ఈ సకల వస్తుదుకాణం (బందరు రోడ్డు) వద్దనే అని నిర్ణయించడమైనది!

         శ్రమదాన సాంస్కృతి కోద్యమం

సుమారొక వందేళ్ల క్రిందట స్వతంత్రోద్యమ సందడుండెను

తరతరాల బానిసత్వపు సంకెలలనది త్రెంచి వేసెను

ఇప్పుడొక శ్రమదాన సాంస్కృతి  కోద్యమం మొలకెత్తి వాతా

వరణ రక్షకు బయలు దేరెను – మహోద్యమముగ మారుచుండెను!         

- నల్లూరి రామారావు

 01.05.2025.