ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
ఆటవిడుపు (ఆదివారం - 4.5.25) నాటి శ్రమదానం సంగతి! @3463*
చల్లపల్లిలో చాలమంది క్రియాశీలురకు సైతం బద్ధకం పెంచే వారమే కావచ్చు, బడులకూ, కార్యాలయాలకూ, అంగళ్ళకూ సెలవు దినమే కావచ్చు, చల్లపల్లి స్వచ్ఛ సుందర పనిమంతులకు మాత్రం కానే కాదు!
ఆ మాటకొస్తే స్వచ్ఛ కార్యకర్తలు సదరు వారాన్ని ప్రత్యేకంగా జరుపుతారు! గతంలో ‘ఆనంద ఆదివారాల పేరిట ATM సెంటరులో 3-4 వందల మంది ఛాత్రుల, ప్రజల సమక్షంలో ఆడి-పాడి గ్రామస్తుల్లో స్వచ్ఛ స్ఫూర్తి కోసం ప్రయత్నించేవాళ్లు - కోవిడ్ పుణ్యాన అవి ఆగి పోయాయి!
మీరెవరైనా గమనించారో లేదో గాని - కొందరు వాలంటీర్లలో ఈ వారం ఉత్సాహం ఇనుమడిస్తుంది కూడ! అడపాదడపా కొన్ని అల్పాహార - భోజన భాజనాలు కూడ ఈ వింత మనుషులు పని ముగిసిన చోట్లనే నిర్వహించుకొంటారు - ఈ పూటలాగా!
ఈ ఆదివారమేలనో కార్యకర్తల సంఖ్య 40 కే పరిమితమయింది! ఇందులో మంగళాపుర - రామానగర – చల్లపల్లీయులేకాక – హైదరాబాదు నుండి కూడ 10-11 ఏళ్ల హేమచంద్ర, మరొక యువతి – హర్షిత పాల్గొనిరి!
నేటి ప్రధాన స్వచ్ఛ కర్మకాండలు అడపా వారి వీధి మొదలు దర్శనీయ పబ్లిక్ టాయిలెట్ల దాక జరిగినా, దుమ్ము - ఇసుకలు ట్రాక్టరులో నింపుకొనే పని రామాలయం వద్ద నుండే జరిగింది.
తినుబండారాలు, ఇతర అంగళ్ల ప్రాంతాలు కార్యకర్తలకు ఎక్కువ పని కల్పించాయి. ATM సెంటరొక్కటే 12 మందికి పని చూపెట్టింది. వాళ్ళవనే కాదు – సగం మంది ముఖాలు దుమ్ము - దూళితో మారిపోయాయి మరీ!
ఏడెనిమిది మందిలో ఎంత కసి అంటే – వాళ్ళ పనీ, కాలుష్యాల మీద పంతము చూస్తుంటే 6:05 దాటినా విజిలు ఊద బుద్ధి కాలేదు; ఊదినా 6:10 దాక వాళ్లు పని విరమించలేదు! వీధి శుభ్రతలపట్ల కార్యకర్తల నిబద్ధతనెలామెచ్చాలో తెలియడం లేదు!
ఎట్టకేలకు 6.15 కు జ్యోతి ఫొటో స్టూడియో వద్ద పాటల శ్రీను పాట కాక నినాదాలందుకొని, అందరూ పునరుద్ఘాటించి,
ఆస్మత్ప్రాయోజిత అల్పాహార స్వీకారమొనరించి,
రేపటి బందరు వీధి పనుల నిమిత్తం ATM కేంద్రం వద్దనే కలవాలని నిర్ణయించుకొని,
ఆదివారం కార్యక్రమం ముగిసెను!
శ్రమదానం తప్పనిసరి!
సామూహిక ప్రయత్నముంటే - సమైక్యభావన ఉంటే-
మన గ్రామపు మంచి చెడులు మనవే’ అను స్పృహ ఉంటే '
‘పరిసరాల శుభ్రతలే ప్రజారోగ్య’ మని తెలిస్తె.....
చల్లపల్లిలో వలె ఇక శ్రమదానం తప్పనిసరి!
- నల్లూరి రామారావు
04.05.2025.