ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తిరస్కరిద్దాం
భావితరానికి మంచి పర్యావరణాన్ని అందిద్దాం
సోమవారం 5.5.2025 - 3464* వ రోజు నాటి శ్రమ జీవన సౌందర్యాలు!
అనుకున్న ప్రణాళిక ప్రకారం మెయిన్ సెంటర్ లో జరగవలసిన స్వచ్ఛ సేవ నిన్న పడిన వర్షం కారణంగా బైపాస్ రోడ్ లోని భారతలక్ష్మి రైస్ మిల్లు దగ్గరకు మార్చబడింది.
తెల్లవారు జామున 4:14 ని.లకు 10 మంది కార్యకర్తలతో ప్రారంభమైన స్వచ్ఛ శ్రమ బైపాస్ దారికి అటు ఇటూ రెండు ప్రక్కలా ఉన్న పిచ్చి మొక్కలను శుభ్రం చేస్తూ ఎంతో అందంగా ఆ దారిని, అలాగే అక్కడే ఉన్న కామినేని అపార్ట్మెంట్ చుట్టూ విజయ్ నగర్ లోని అంతర్గత రహదారినీ మన కార్యకర్తలు అందంగా తయారుచేశారు. “శ్రమ అన్నది మానవుని సహజ గుణం” అన్న సామెత శ్రమ అన్నది స్వచ్ఛ కార్యకర్తల దైనందిన జీవితంలాగా గృహాల ముందు దర్శనమిస్తున్నా పట్టించుకోని మాచర్ల కంపను స్వచ్ఛ కార్యకర్తలు పరిశ్రమించిన ఒక గంట తరువాత చూస్తే రోడ్డు చాలా అందంగా, చూడముచ్చటగా ఉన్నది.
తడిసిన నేల కావడంతో కలుపు మొక్కలను వేర్లతోసహా లాగి మెరక పల్లాలను గొర్రులతో సరిచేసి చేటచీపురుతో ఊడ్చి చేసిన పనిని ఒకసారి వెనుదిరిగి చూస్తే “సరిరారు నీకెవ్వరూ ఓ స్వచ్ఛ కార్యకర్తా ఈ గ్రామసేవలో” అన్న చందాన ఆ ప్రాంగణమంతా ఎంతో ముచ్చట గొలుపుతుంది.
ఫోటోలలో చూసినట్లుగా శంకర్రావు గారు అనే కార్యకర్త చేసిన తీరు చూస్తూ ఉంటే ఆయన ఒక విశ్రాంత ఉన్నతాధికారి అయినప్పటికీ ఒక తలపండిన వ్యవసాయ కూలీలాగా చూపిన నైపుణ్యం మాటలలో చెప్పలేనిది. ఏది ఏమైనా స్వచ్ఛ కార్యకర్తల శ్రమతో ఈరోజు KDCC బ్యాంకు నూతన భవనం చుట్టూ, కామినేని అపార్ట్మెంట్ చుట్టూ పెళ్లి శోభ సంతరించుకుంది.
ఆ దారిలో మంచినీటి పైపుల కొరకు పంచాయతీ వారు త్రవ్విన గుంతలను గతంలో మనం పూడ్చగా వర్షానికి క్రుంగి ఏర్పడిన పల్లాలను పూడ్చడం మళ్లీ మన కార్యకర్తలకు తప్పలేదు.
6 గం.ల వరకూ 21 మందితో జరిగిన స్వచ్ఛ పరిశ్రమ రధసారధుల వారు సైరన్ వినిపించగానే పనికి విరామమిచ్చి కాఫీ కబుర్లలోకి వెళ్లారు. తరువాత జరిగిన సమీక్షా కార్యక్రమంలో కస్తూరి విజయ్ గారికి దక్కిన స్వచ్ఛ నినాదాల అవకాశం,
తదుపరి డాక్టరు గారు మాట్లాడుతూ వెంకటాపురం రోడ్డులో మొక్కల నరికివేత విషయాన్ని స్పందనలో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం,
మాచర్ల కంపను కొంతకాలం వరకు లేతదశలోనే తొలగించి నిర్మూలించడం,
ప్రతిరోడ్డునూ ఒక్కో కార్యకర్త పర్యవేక్షణ బాధ్యతను తీసుకోవడం లాంటి ముఖ్య విషయాలను ముచ్చటించిరి.
రేపు మనం కలుసుకోవలసిన ప్రాంతం సజ్జా ప్రసాదు గారి రోడ్ మొదట్లోనే అని చెప్పి నిష్క్రమించుట జరిగినది.
తె.జామున 4:20 నుండి మైకులో పాటల శబ్దాలు మ్రోగుతున్నా నిద్రలేవని జనం 6 గం.ల తరువాత గేటు తీసి వారి ఇంటి ముందర కార్యకర్తలు చేసిన పరిశుభ్రతను చూసి మురిసిపోవడం కొసమెరుపు.
సరిలేరు మీకెవ్వరూ!
ఎవరు ఎవరు ఎవరు – ఇంకెవరు ఎవరు ఎవరు
చెత్తలేని వీధులకై శ్రమియిస్తుందెవరు
పరిశుభ్ర చల్లపల్లి కొరకు పాటు పడిందెవరు
నువు గుండె మీద చెయ్యి వేసి చెప్పరా – వాళ్లు స్వచ్ఛ కార్యకర్తలని చాటరా!
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
05.05.2025.