ఒకసారి వాడి పారేసి ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చాటుదాం.
ప్రతి ఒక్కరు ప్రతిన బూని ఈ భువిని కాపాడుదాం!
మంగళవారంది : 06.05.2025 – 3465* వ రోజు శ్రమ ఘట్టములు!
ఈరోజు తెల్లవారు జామున 4:18 ని॥లకే బైపాస్ రోడ్ లోని సజ్జా ప్రసాదు గారి బజారు మొదట్లో ఆగి దారికి అటూ ఇటూ ట్రాన్స్ ఫార్మర్ వరకు పరిశుభ్రం చేయడం జరిగింది. 10 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ క్రమేపి కార్యకర్తల కలయికతో ఎంతో ఉత్సాహంగా సాగింది.
పవనుడు సహకరించక తీవ్రమైన ఉక్కపోతలో కూడా మాకు గ్రామ స్వచ్ఛ శుభ్రతలే ముఖ్యమంటున్న కరుడు కట్టిన కార్యకర్తలు వారివారి పనిముట్లను చేతపట్టి, ఒక ప్రక్కన కలుపు తీయడం మెరక పల్లాలు సరిచెయ్యడం, చీపుళ్ళతో ఊడ్చి అద్దంలా తయారుచెయ్యడం లాంటి పనులు స్వచ్ఛ కార్యకర్తలకే చెల్లు,
ఈరోజు మైక్ లో మార్చి వినిపించిన కొత్త ప్రబోధ గీతాలతో పెద్ద వారైన కోడూరి వెంకటేశ్వరరావు గారి లాంటి వారు హుషారైన కేకలతో ఉందిలే మంచికాలం చల్లపల్లికీ అనుకుంటూ కష్టమును మైమరుస్తూ చేసిన పని వర్ణనాతీతం అలాగే ఒక ప్రత్యేక దళం లాగ ఇద్దరు కార్యకర్తలు కోత రంపంతో దారిలోకి అడ్డువచ్చిన చెట్ల కొమ్మలను కత్తిరిస్తుండగా కొంతమంది షెడ్డర్ లో వేయడానికి అనువుగా పేర్చడం సమయం 6 గం॥ దాటినా ఆ పని జరుగుతూనే ఉంది. ‘నా అందం చూడు మామయ్యో’ అని కవి రాసిన జానపద గీతం గుర్తొచ్చినట్టుగా రోడ్డు అందం ఎంత చూసినా తనివి తీరడం లేదు.
ఈ లోపు అనుకున్న సమయం 6 గం॥ అవనే అయింది. డాక్టరు గారి విజిల్ తో పని ఆపి వచ్చి కాఫీలు సేవించిన పిదప కొమ్మలు కత్తిరించు కార్యకర్తలు వచ్చు వరకు ఆగి చివరి ఘట్టమైన సమీక్షా కార్యక్రమం 27 మందితో జరిగింది.
స్వచ్ఛ కార్యకర్త కలెక్టర్ కార్యాలయ ఉద్యోగి తూము వెంకటేశ్వరరావు గారు ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’ నినాదంతో చుట్టూ ఉన్న ఇళ్ళ జనం నిద్ర లేచి బయటకు వచ్చి చూశారు.
నిన్న బందరు వెళ్ళి స్పందన అర్జీ ఇచ్చిన విశేషాలు. ఏప్రియల్ నెల జమా ఖర్చుల వివరాలు తెలియజేయగా ప్రాతూరి శాస్త్రి మాష్టారి నెలనెలా ఐదు వేల విరాళం అందజేయడం, రామారావు మాష్టారి అమెరికా ప్రయాణాన్ని అందరం గుర్తుచేసుకుంటూ ముగించడం జరిగింది.
2 రోజుల పాటు ఆ ప్రాంతంలో పనిచేస్తే మనల్ని చూసి నిద్ర పట్టక వచ్చిన ఒకే ఒక బాల కార్యకర్త మణికంఠ చిన్నవాడైనా గట్టివాడే.
రేపు కలుసుకోవలసిన ప్రదేశం బందర్ రోడ్డులోని ATM సెంటర్ వద్దనే!
మనకోసం మనం
ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు
ఎందుకు ఒక గంట నీవు ఊరి సేవ చేయవు
ఏడాదికి ఏడాది నీ కోసమె నువ్వు
ప్రతి రోజొక గంట స్వచ్ఛ చల్లపల్లి కివ్వు!
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
06.05.2025.