ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని మానేద్దాం!
భావితరాలకు ఆదర్శంగా నిలుద్దాం!
చక్కటి పర్యావరణాన్ని అందిద్దాం!
బుధవారం 7.5.2025 – 3466* వ రోజు నాటి స్వచ్ఛ సేవా విశేషాలు.
తెల్లవారు ఝామున 4.20 ని॥కు 8 మంది కార్యకర్తలతో బందరు రోడ్డులో ATM సెంటరు వద్ద ప్రారంభమైన స్వచ్ఛ సేవ కొద్దిసేపటిలోనే 25 మంది కార్యకర్తలతో ఊపందుకుంది.
గత రెండు రోజుల క్రితమే ఈ ప్రాంతమంతా అత్యంత శుభ్రంగా మలచిన తీరు వీక్షకుల ప్రశంసలు అందుకున్ననూ, భారీ వాహనాల టాప్ కప్పని ఇసుక లోడుల వలన మరల ఒకసారి శుభ్రం చేయవలసిన అగత్యం ఏర్పడినది. అయినను ఏమాత్రం విసుగు చెందక ఒక్కొక్కరు చీపుళ్ళతో క్రమబద్ధంగా ఒక్కొక్క భాగాన్ని ఎంచుకుని పోటాపోటీగా బలంగా ఊడుస్తూ ప్రధాన రహదారిపై దుమ్ముధూళికి స్థానం లేకుండా చేస్తూ బందరు రహదారిని సుందరమయం చేశారు.
చల్లపల్లి గ్రామ నడిబొడ్డున ATM సెంటర్ ను పేవర్ టైల్స్ తో అత్యంత సుందరంగా మలచి ప్రత్యేక కార్యక్రమాలు జరుపుకునే విధంగా తయారుచేసిన ‘స్వచ్ఛ చల్లపల్లి’ రథసారధులకు అభివాదములు. కానీ ప్రస్తుతం ‘కుంచించుకుపోతున్న ATM సెంటర్’ అనే కాప్షన్ పెట్టాల్సిన పరిస్థితి దాపురించింది. వ్యక్తిగత స్వప్రయోజనాల కోసం అందరికి ఉపయోగపడాల్సిన అందమైన వేదిక కొందరికే పరిమితమవడం బాధాకరం. ఈ విషయమై అధికారులు ఆలోచన చేయాలని, పరిష్కారం చూపాలని స్వచ్ఛ కార్యకర్తల ఆవేదనతో కూడిన అభిలాష.
ప్రత్యేక దళం సభ్యులు ఎవరు కూడా ATM సెంటర్ లో కన్పించడం లేదేమిటబ్బా అని ఆరా తీయగా “కమ్యునిస్టు బజారు”లోని రద్దును లోడ్ చేసుకొని గంగులవారిపాలెంలో రోడ్డు మార్జిన్లను సరిచేస్తున్నారని వినికిడి.
వేసవికాలపు ఉక్కపోతతో చెమటతో తడిసిన శరీరాలను శుభ్రం చేసుకుని కాఫీ కప్పులతో కబుర్లాడుతూ, అస్వాదిస్తూ శివకుమారి గారు చెప్పిన స్వచ్ఛ నినాదాలతో గొంతు కలిపి, రామారావు మాస్టారు మరియు శివకుమారి గార్ల రేపటి అమెరికా ప్రయాణానికి అభినందనలు తెల్పుతూ,
కోడూరు వెంకటేశ్వరరావు గారు ప్రతి నెలా ఇచ్చే 520/- విరాళాన్ని స్వీకరించి,
గురవయ్య మాస్టారి సూక్తులపై చలోక్తులు విసురుకుంటూ ఈ నాటి స్వచ్ఛ కార్యక్రమంపై డాక్టర్ గారి సంతృప్తితో కూడిన తుది పలుకుల సమీక్షకు మనసులోని ఆనందాన్ని తెలియజేస్తూ,
రేపటి స్వచ్ఛ కార్యక్రమం కూడ ATM సెంటర్ వద్దనే అని తెలుసుకుని వెనుదిరిగారు.
- భోగాది వాసుదేవరావు
సుందరీకరణ కార్యకర్త
స్వచ్ఛ సుందర చల్లపల్లి
07.05.2025.