ఒక్కసారికే వాడి పారేసే ప్లాస్టిక్ సంచులు వద్దు!
గుడ్డ సంచుల వాడకమే ముద్దు!
గురువారం – 8.5.2025 – 3467* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమదాన విశేషాలు!
తెల్లవారు ఝామున 4.13 ని॥కు బందరు రోడ్డులోని ATM సెంటర్ వద్ద 10 మందితో ప్రారంభమైన శ్రమదానం మరి కొద్దిసేపటికే 24 మందితో ఊపందుకుంది.
ప్రత్యేక దళ సభ్యులు సాగర్ టాకీస్ వద్ద నిరుపయోగంగా పడివున్న కరంట్ స్థంభాన్ని ట్రాక్టర్ లో తీసికెళ్ళి గంగులవారిపాలెంలో మట్టి కొట్టుకుపోకుండా డ్రైను వద్ద దన్నుగా ఏర్పరిచారు.
ఆకుల మరియు సజ్జా ప్రసాద్ గార్ల ద్వయానికి గణేశ్ ప్రెస్ వద్ద చేతుల నిండా పని దొరికింది. 6 గం॥కు చూస్తే ఆ ప్రాంతమంతా శుభ్రతతో సుందరమయమైంది.
కోడూరి వారి బృందం లైబ్రరి పరిసర ప్రాంతాలలో ఎన్నో నెలలుగా పేరుకుపోయిన డ్రైనేజి మట్టి మెరకలను సరిచేయడమే కాక డ్రైనేజిలో పాతుకుపోయిన నానారకములైన ప్లాస్టిక్ చెత్తను బయటికి లాగి ఆ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దారు.
సుభాషిణి మరియు హాస్పిటల్ స్టాఫ్ తో పాటు సుశిక్షితులైన కరడుగట్టిన కార్యకర్తలు చీపుళ్ళకు పనిజెప్పి ప్రధాన రహదారిని శుభ్రతతో అందంగా మలిచారు.
ఇకపోతే, అతికష్టంగా అందరికి మంచినీళ్ళు అందించే ఆనందరావు, ప్రతి పనిలో నేనుండాలంటూ సాయమందించే గోపాలకృష్ణయ్య గారు, కార్యకర్తల శ్రమ జీవన సౌందర్యాన్ని ‘క్లిక్’ మనిపించే శాస్త్రి గారు;
కాఫీ తాగడం మీ హక్కు అంటూ అందరికి ఆనందంగా సర్వ్ చేసే శ్రీనివాస్, జరిగే ప్రతి పనిని పర్యవేక్షిస్తూ తుదిపలుకులలో అపరిమిత ఆనందాన్ని వ్యక్తపరుస్తూ కార్యకర్తల శ్రమను కొనియాడే మన డాక్టర్ గారు.
ఇదండీ ఈనాటి స్వచ్ఛ కార్యక్రమ ముఖచిత్రం.
రేపటి మన శ్రమదాన కార్యక్రమం - ATM సెంటర్ పరిసర ప్రాంతములోనే.
- భోగాది వాసుదేవరావు
సుందరీకరణ కార్యకర్త
స్వచ్ఛ సుందర చల్లపల్లి
08.05.2025.