3468* వ రోజు ... ....

ప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు!

గుడ్డ సంచుల వాడకమే ముద్దు!

శుక్రవారం 9-5-2025 - 3468 వ నాటి స్వచ్ఛ శ్రమదాన విశేషాలు.

          తెల్లవారుఝామున 4.17 ని॥కు ప్రధాన కూడలిలో ప్రారంభమైన స్వచ్ఛ సేవ మరికొంత సమయానికి 25 మందితో ఊపందుకుంది.

          గత రెండు రోజుల నుండి ప్రధాన రహదారిని చీపుళ్ళతో ఊడ్వగా ఏర్పడిన రద్దును ట్రాక్టర్లో లోడ్ చేస్తూ, ఒకరిపై ఒకరు సరదాగా చలోక్తులు విసురుకుంటు ప్రత్యేక దళ సభ్యులు బిజీగా ఉన్నారు.

          బందరు రోడ్డులోని స్వచ్ఛ సుందర చల్లపల్లి పబ్లిక్ టాయిరెట్స్ వద్ద సుందరీకరణ బృందం సొగసైన పూల మొక్కల అందాన్ని ఇనుమడింపజేస్తూ మొదళ్ళలోని రద్దును వేరుచేస్తున్నారు.

          పెట్రోల్ బంకు వద్ద డ్రైనేజిలోని చెత్తను బయటికి తీస్తూ శంకరరావు గారు, చెక్ పోస్ట్ వెంకటేశ్వరరావు గారు దర్శనమిచ్చారు.         

          గురవయ్య మాస్టారు, రక్తదాత విజయ్ కుమార్ లు నా అభ్యర్ధన మేరకు డాక్టర్ గారి అనుమతితో లైబ్రరీ ప్రక్కన గల స్కూలు నందు జంగిల్ క్లియరెన్స్ 60% చేశారు. రేపటికి మరికాస్త మిగిలి ఉంది.

          మిగిలిన సభ్యులు చీపుళ్ళకు పనిజెప్పి ప్రధాన రహదారిని, రోడ్డు ప్రక్కన షాపులలోని చెత్తను బయటికి లాగి తమదైన స్టైల్ లో స్వచ్ఛ శుభ్రతను చూపించారు.

          వేసవి కాలం, ఉక్కపోత కారణంగా 6 గం॥కు అతికష్టంగా, అయిష్టంగానే చేరుకుని కాఫీ కబుర్లు చెప్పుకుంటూ నే జెప్పిన స్వచ్ఛ నినాదాలకు గొంతు కలిపి డాక్టర్ గారు చెప్పిన తుది పలుకులు విని,

          రేపటి కార్యక్రమం కూడ సెంటర్ లోనే అని తెలుసుకుని ఈనాటి కార్యక్రమానికి స్వస్తి పలికారు.

          అదండీ ఈ నాటి ఎపిసోడ్ లోని ముఖ్య సంగతులు!

- భోగాది వాసుదేవరావు

   సుందరీకరణ కార్యకర్త

   స్వచ్ఛ సుందర చల్లపల్లి

   09.05.2025.