ప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు!
గుడ్డ సంచుల వాడకమే ముద్దు!
శనివారం - 10-5-2025 – 3469* వ రోజు నాటి శ్రమదాన విశేషాలు!
తెల్లవారుఝామున 4:20 ని.లకు చల్లపల్లి మెయిన్ సెంటర్ లో 10 మందితో ప్రారంభమైన స్వచ్ఛ సేవ క్రమక్రమంగా 29 మంది చేరికతో ఊపందుకుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో మంద్రస్థాయిలో వీనుల విందుగా ఉత్సాహానిచ్చే పాటలు వింటూ పనిలో వేగం పెంచారు.
ప్రత్యేక దళ సభ్యులకు కెనరా బ్యాంక్ వద్ద గల రద్దు కనిపించిన వెంటనే ట్రాక్టర్లో లోడ్ చేసికొని గంగులవారిపాలెంలో రోడ్డు మార్జిన్ లో సర్థి రహదారి విశాలమవటం చూసి సంతృప్తి చెంది వెనుదిరిగారు.
డాక్టర్ గారి అనుమతితో నా అభ్యర్థన మేరకు కోడూరు వారు, రిటైర్డు హౌసింగ్ AE గారు లైబ్రరి ప్రక్కన గల మాస్కూలు నందు పనికి ఉపక్రమించారు. వారు పని బాగా చేస్తారని తెలుసు గాని ఇంత బాగా చేస్తారని దగ్గర నుండి చూస్తే గాని తెలియలేదు. మరి కాసేపటికి Dr.పద్మావతి మేడమ్, మాధురి, జాహ్నవీలు వచ్చి పనిలో వేగం పెంచారు. 6 గం॥ సమయానికి ఆ ప్రాంతాన్ని అద్దంలా తయారుచేశారు.
మహిళా కార్యకర్తలు చీపుళ్ళకు పని జెప్పారు. షాపులలో దాగిన చెత్తను బయటికి లాగి పోగు పెట్టి ట్రాక్టర్ కెక్కించి ఈరోజుకు సంతృప్తిపడ్డారు. మా కార్యకర్తలు అడుగుపెట్టిన ప్రాంతం అద్దంలా మెరవాల్సిందే. వారు వచ్చిన తరువాత ఏ పనైన అంత ఇష్టంగా చేస్తారు మరి.
ఉదయం తెల్లటి టీ షర్ట్ తో వచ్చిన కార్యకర్తలు పని ముగిసే సమయానికి చెమటతో తడిసి దుమ్ము ధూళితో నిండి మురికి పట్టిన షర్ట్ ను చూసి మురిసిపోతుంటారు. అట్లుంటది మరి మా కార్యకర్తలతోని పని.
భానుప్రకాష్ చెప్పిన స్వచ్ఛ నినాదాలతో గొంతు కలిపి, డాక్టర్ గోపాలకృష్ణయ్య గారు ఇచ్చిన విరాళం 2000 రూ॥ అందుకొని వారికి ధన్యవాదములు తెలిపి డాక్టర్ గారు చెప్పిన విషయాలు ఆసక్తిగా విని రేపటి కార్యక్రమం కూడా చల్లపల్లి సెంటర్ లోనే అని తెలుసుకుని వెనుదిరిగారు.
- భోగాది వాసుదేవరావు
సుందరీకరణ కార్యకర్త
స్వచ్ఛ సుందర చల్లపల్లి
10.05.2025.