1989*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు. 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1989* వ నాటి సామాజిక బాధ్యతలు

 

          ఐదారేళ్లుగా ఏ ఒక్క నాడూ తమ గ్రామ బాధ్యతలు విస్మరించని స్వచ్చ సైనికులు నేటి వేకువ కూడ 3.59 – 6.10 వేళల మధ్య త్రిముఖంగా – రెండు ప్రాంతాలలో తమ కర్తవ్య నిర్వహణకు పూనుకొన్నారు. వీళ్ళు సంఖ్యలో 33 మందే గాని, శ్రమదానం లో పూర్తి ఆనందం పొందుతూ – ఉద్వేగం చెందుతూ – నిర్దేసించుకొన్న లక్ష్య సాధనలో అవలీల గా కొన్ని అద్భుతాలు చేస్తుంటారు! ఎవ్వరూ వీళ్ళని ప్రేరేపించలేదు, ప్రలోభపెట్టలేదు, మెచ్చి మేకతోళ్ళు కప్పలేదు; కేవలం తమ సామాజిక ఋణ భారాన్ని దించుకోవాలనే తాత్త్విక తే పునాదిగా – స్వయం నిర్దేశిత గ్రామ కర్తవ్యాల నిర్వహణలో శ్రమిస్తున్న – 1990 రోజులుగా ప్రస్థానిస్తున్న – చల్లపల్లి మట్టిలో మాణిక్యాలు వీరు!  

 

          ఉమ్మడిగా మొత్తం స్వచ్చ సైన్యం ఆశయం – ఆరాటం సమగ్ర – సర్వతో ముఖ – స్వచ్చ సుందర చల్లపల్లే గాని, వైయక్తిక అభిరుచుల్ని బట్టి తమకనువైన బాధ్యతలను ఎన్నుకొంటారు – లీనమైపోతారు! అలాంటి నేటి కార్యకర్తల కృషి వివరాలు:

 

- గ్రామ రెస్క్యూ టీం వారు తమకు దొరికిన వ్యర్ధాలను – అంటే గంగులవారిపాలెం దారిలోని కొమ్మలు – రెమ్మలను, అమరావతి రాజా గారి భవన ప్రాంతపు దుమ్ము – ధూళి, గడ్డి – గాఢంలను ట్రాక్టర్ తో బండ్రేవు కోడు కాలువ ఉత్తరం గట్టు మీద మట్టి కోతల్లో దించి, సర్ది అటు రోడ్డు భద్రతకు, ఇటు తామే పెంచుతున్న చెట్లకు, రక్షణ కల్పించారు. (అనుకోని హఠా త్ర్పమాదం జరిగి కీర్తి ఆస్పత్రి ప్రక్క పూరిల్లు కాలుతుందని తెలిసి, తమ నీళ్ళ టాంకర్ ను సిద్ధపరిచారు గాని, ప్రభుత్వ అగ్ని మాపకశకటం ఆపని మొదలెట్టిందని తెలిసి ఆగిపోయారు)

 

- అమరావతి రాజు గారి వైజయంతం గోడను, పెద్ద గేటు దిమ్మెలను అంగుళం – అంగుళంగా – సొంత వ్యయప్రయాసలతో సుందరీకరిస్తున్న స్వచ్చ సుందర కళాకారులను “ఇన్నాళ్ల కఠోర శ్రమతో మీకేం ఒరుగుతుంది?” అన్ని ప్రశ్నించాలకొన్నాను గాని , గతంలోనే “మన ఊరు అందంగా – ఆహ్లాదంగా – అన్ని ఊళ్ళకన్నా మిన్నగా కనిపిస్తే చాలదా....?” అనే సమాధానం గుర్తు వచ్చి, ఆగాను.          

 

- 18 మంది కార్యకర్తలు వైజయంతం లోపలి సువిశాల భాగంలో ముళ్ళ – పిచ్చి చెట్లను నరికి, బండెడు ఎండుటాకుల్ని ఊడ్చి పోగు చేసి, ఆవరణ స్వరూపాన్ని మార్చి వేస్తున్నారు. అక్కడ ఎన్ని ఎండు కొమ్మలు, పనికిరాని రాలి పడిన కొమ్మలు, కాయలు, గడ్డి ఉన్నాయో అన్నీ వీళ్ళ కృషితో శుభ్రమైపోయి రూపు రేకలు మారుతున్నాయి!

 

          ఇన్ని వేల దినాల – రెండున్నర లక్షల నిస్వార్ధ పని గంటల – కృషికి సాక్షిగా ఉన్న నాకు పదేపదే వస్తున్న సందేహం ఒక్కటే – ఇంకా ఎన్ని వేల దినాల తర్వాత నా సోదర గ్రామస్తులంతా ఈ స్వచ్చ – శుభ్ర – సుందర – శ్రమదాన వేడుకలోకి వస్తారోనని!

 

          రేపటి మన గ్రామ కర్తవ్య నిర్వహణ వేదిక కూడ బందరు జాతీయ రహదారి ఉత్తర దిశలోని వైజయంతమే దాని ప్రహరీ గోడే!

 

              స్వచ్చంద నివాళి

స్వచ్చోద్యమ కారుడనగ సకల గ్రామ హిత వాది

కార్యవాది – ఖడ్గవాది – గ్రామ కలుష విరోధి  

మానవతా వాది - అతడు మనకు మార్గదర్శి

అతనిది వసుధైక దృష్టి – అతనికి ఘన నివాళి!

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలు

బుధవారం 22/04/2020

చల్లపల్లి.

3.59 కు చిన్నరాజా గారి ఇంటి వద్ద