3477* వ రోజు ....

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు!

పర్యావరణ హితమే ముద్దు!

19-5-2025 – 3477* వ రోజు..

          రాత్రి కొద్దిగా జల్లుపడి తడిగా ఉండటం వలన శ్రమదాన వేదికను బస్టాండ్ సెంటర్ నుండి బైపాస్ రోడ్డులోని బాలికల హాస్టల్ వద్దకు మార్చబడినది. 9 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ క్రమేణ 23 మందితో ఊపందుకుంది. చిరుజల్లులు సందడి చేసినా ఉక్కపోత మాత్రం తగ్గలేదు.

          రైస్ మిల్ గోడ ప్రక్కగా మొక్కల మొదళ్ళలో శుభ్రం చేస్తూ, చెత్తను ప్రోగుపెడుతూ, సందడి చేస్తూ ఇద్దరు కార్యకర్తలు శ్రమించటం కన్పించింది.

          ప్రత్యేక దళ సభ్యులు రోడ్డు ప్రక్క మరొక ప్రాంతంలో ఎగుడు దిగుడులను సరిచేస్తూ ఎప్పటి చెత్తను అప్పుడు లోడ్ చేస్తూ ఉషారుగా కన్పించారు.

          బాలికల హాస్టల్ ఎదురుగా కత్తులు, దంతులు ఏది అవసరమైతే అది ఉపయోగిస్తూ ఇద్దరు నిబద్ధత గల కార్యకర్తలు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తూ కన్పించారు.

          మూడు రోడ్ల కూడలిని శ్రద్ధగా చీపుళ్ళతో శుభ్రం చేస్తూ కొందరు, చెత్తను లోడింగ్ చేయడంలో సహకరిస్తూ మరికొందరు బిజీగా కన్పించారు.

          కార్యకర్తల కాఫీ సేవనం పూర్తయిన పిదప జరిగిన తుది సమావేశంలో, ఈ నెల 24, 25 తేదీలలో N.T.R పార్క్ చల్లపల్లి నందు జానపద, పౌరాణిక నాటక ప్రదర్శనలను విజయవంతం చేయాలని బోలెం రామారావు కోరటము, ఫ్లెక్సీలు ఉపయోగించవద్దని Dr. D.R.K గారు చెప్పటం, రేపటి స్వచ్ఛ సేవ బాలికల హాస్టల్ వద్దనే అని తెలుసుకోవటంతో నేటి కార్యక్రమానికి కార్య కర్తలు స్వస్తి పలికారు.

భోగాది వాసుదేవరావు

    సుందరీకరణ కార్యకర్త

    స్వచ్ఛ సుందర చల్లపల్లి

    19.05.2025.

 

          వెర్రిగ చేయడమేమిటి?

మితి మీరినవో శ్రద్ధలు – శ్రుతి మించినవో దీక్షలు?

ఊరి పట్ల కర్తవ్యం ఉవ్వెత్తున మేలుకొనెనొ!

కాకుంటే - విద్యాధిక స్థితిమంతులు ప్రతి వేకువ

వీధి పారిశుద్ధ్య పనులు వెర్రిగ చేయడమేమిటి?

- నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.

   లాస్ ఏంజల్స్, USA.

  19.05.2025.