1990*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు. 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1990* వ నాటి స్వచ్చ – సుందర జ్ఞాపకాలు

 

          2000 చారిత్రాత్మక దినాలకు 10 అడుగుల దూరంలో నిలిచిన ఈ నాటి స్వచ్చోద్యమ సంరంభం వేకువ 4.00 – 6.30  నడుమ రెండు వీధుల్లో – 3 విధాలుగా నడిచింది. (6.30 కు నేనింటికి వచ్చే సమయానికి ఏడుగురు ఇంకా తమ పనిలో మునిగే ఉన్నారు.) 36 మందిలో  కొందరు బందరు రహదారి ప్రక్కన వైజయంతం దగ్గర, కొందరు ఆవరణ లోపల, నలుగురైదుగురు గంగులవారిపాలెం బాటలోను పనిచేశారు.


- సుందరీకరణ ముఠా సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు గమనించాను. గోడకు క్రింది వరుసలో సాంప్రదాయక బొమ్మంచులు దిద్దుతూ కొందరు, ప్రవేశ ద్వారం దిమ్మెల మీద రంగురంగుల అందమైన పూల తీగలను ప్రాకిస్తూ కొందరు 2 ½ గంటల పాటు తమ గ్రామ రహదారి అందాలను శిఖర స్ధాయికి చేర్చే తపనలో గడపడం - పాతవాడిని గనుకనాకాశ్చర్యం కలిగించలేదు.

 

- రెస్క్యూ టీం వారు గ్రామ వీధుల్లో ని మట్టిని, దుమ్మును, ఆకులలముల్నీ ట్రాక్టర్ లో నింపుకొని తెచ్చి బండ్రేవు కోడు మురుగు కాల్వ ఉత్తరపు గట్టు మీది ఏడాకుల చెట్ల మొదళ్ళలో సర్దుతూ – తమ పనిలో తాము మునిగారు.

 

- ఎక్కువ మంది కార్యకర్తలకు వైజయంతం లో తట్టు ప్రాంతం చేతుల నిండా ఊపిరాడనంత పని కల్పించింది. అతిపురాతనమైన రావి చెట్టు ఆకులే బళ్ళ కొద్దీ ఉన్నాయి. ఒక మూల పల్లంలో మినీ డంపింగ్ యార్డు, కొబ్బరి చెట్టు చుట్టూ దట్టంగా పెరిగిన ముళ్ళ చెట్లు, చిన్నా చితకా పనికిరాని పిచ్చిమొక్కలు.... వీళ్ళ ధాటికి కాలుష్యాలన్నీ మాయమై సువిశాల ఆవరణంతా ఇన్నేళ్ల తర్వాత చూడముచ్చటగా ఉన్నది.

 

- నాలాంటి సందేహజీవులకు ఎన్నెన్నో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి :

 

* ఈ కరోనా కష్టకాలంలో కూడ ఊరికి పెడగా – మురుగు కాల్వ గట్లను, పెంచుతున్న చెట్లను ఇంతగా ఎవరు సంరక్షిస్తారు?


* ఒడలంతా చెమటలతో, బట్టలకంటుకొంటున్నరంగులతో, రోజూ గంటల తరబడి సొంత ఖర్చుతో ఊరిలోని ఒకొక్క వీధిని ఎవరు సుందరీకరిస్తారు?

 

* తమదికాని ఇంత పెద్ద ఆవరణను గంటలు – రోజుల కొద్దీ శ్రమించి – శ్రమించి – ఒక తపస్సులాగా క్రమబద్ధీకరించి, ఆఖరుకు ఇంగ్లీష్ తుమ్మ చెట్లను గూడ ట్రిమ్ చేసి, ఎవరు ఎందుకు – ఎప్పుడు – ఇంతగా సుందరీకరించారు? ప్రశ్నలు వందలు – సమాధానం మాత్రం ఒక్కటే – “స్వచ్చ సుందర సైనికు” లు మాత్రమే!

 

          రేపు కూడ ఈ బందరు రహదారి ప్రక్క – అమరావతి రాజ ప్రాసాదం దగ్గరే ఆగి, మన గ్రామ కర్తవ్య దీక్షలను కొనసాగిద్దాం!

 

              ఒకానిక విన్నపం

అందరి మెప్పును పొందుట అంతగ సులభం కాదని

అధిక సంఖ్యలో ప్రజలను ఆకట్టుటె గొప్పయని

ప్రజల మేలుకై తప్పక ప్రజలతో మమేకమవ్వాలని...

స్వచ్చోద్యమ పంచవర్ష సాక్షిగ ఇది సత్యమని....

 

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

గురువారం 23/04/2020

చల్లపల్లి.

4 am కు చిన్నరాజా గారి ఇంటి వద్ద