3488* వ రోజు ....

 మొక్కలు నాటుదాం!

పచ్చదనాన్ని పెంచుదాం!

02-06-2025 – సోమవారం -  3488*వ రోజు.

         ఉదయం 4:18 నికు వేకువ సేవకు ఇష్టపూర్వకముగా విచ్చేసిన మొదటి ఫోటో వారియర్స్ 16 మంది కాగా, ముగింపు సమయానికి 42 మంది కార్యకర్తలతో కాసానగర్ ప్రాంతమంతా సందడి నెలకొంది.

         నిన్నటి రోజు కాసానగర్ సెంటర్ డివైడర్ లలో విజయవాడ గైనకాలజిస్ట్ ల అసోసియేషన్ వైద్యుల బృందం (VOGS) చేత నాటించిన మొక్కలకు పాదులు తీసి, శుభ్రం చేసి, చంటి పిల్లలపై అమ్మ చూపే ప్రేమకు తార్కాణంగా డాక్టర్ పద్మావతి మేడం శ్రద్ధగా మొక్కలను సాకడం కనిపించింది.

         రహదారికి దిగువన బందరు వైపుగా గల చెట్లకు పాదులు తీసి, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మొక్కల మొదళ్ళులోని కలుపు పీకి, చెత్తా చెదారాన్ని వేరు చేసి, మొక్కలు మరింత నేవళంగా పెరగడానికి సహకరిస్తూ, వంగిపోయిన 5 అడుగుల చెట్లకు గట్టి కర్ర కట్టి నిలబెట్టి, వాటికి దన్నుగా మట్టి పోసి సంతృప్తి చెందుతూ మెజారిటి కార్యకర్తలు శ్రమించడం కనిపించింది.

         ప్రముఖ పారిశ్రామిక వేత్త విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు గారు తన సహచరులతో కలసి నేటి శ్రమదానంలో పాల్గొనటం విశేషం. శ్రమదాన అనంతర సమావేశంలో శ్రీ విక్కుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ “స్వచ్ఛ శ్రమదానంలో పాల్గొనటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, 10సం॥ పైగా నిర్విరామంగా, ఒక యజ్ఞంలా చెయ్యడం గొప్ప విషయమని, స్వచ్ఛ చల్లపల్లి దేశవ్యాప్తంగా పేరు గాంచినదని, చల్లపల్లి ప్రవేశించగానే స్వచ్ఛత, శుభ్రత, సుందరత్వపు మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తుందని, తాను తరచూ శ్రమదానంలో పాల్గొనటానికి ప్రయత్నిస్తానని తెలియజేశారు.

         Dr. DRK గారు మాట్లాడుతూ ఉద్యమ ఆశయాలను వివరించి, చల్లపల్లిలో జరిగిన అభివృద్ధిని తెలియజేసి, మాటలకన్నా చేతలే ప్రభావశీలంగా ఉంటాయని, వేకువ ఝామున జరిగే ఈ శ్రమదానం ప్రధానమని, కార్యకర్తల కృషే అభివృద్ధికి మూలమని తెలిపారు.

         సీనియర్ కార్యకర్త, ఉద్యమ ఆద్యుడు శ్రీ తూములూరి లక్ష్మణరావు పలికిన స్వచ్ఛ నినాదాలతో గొంతు కలిపి,

         రేపటి శ్రమదాన వేదిక హైవే లో కాసానగరం - శివరాంపురం మధ్యలోనని తెలుసుకుని కార్యకర్తలు నేటికి వెనుదిరిగారు.

- భోగాది వాసుదేవరావు

   సుందరీకరణ కార్యకర్త

   స్వచ్ఛ సుందర చల్లపల్లి

   02.06.2025.

        

         సాగుతున్న కటిక నిజం

‘ఎందుకురా ఈశ్రమ’ అని ఏనాడూ బాధపడక

‘జనమింకా కదలిరాని’ సంగతికీ దిగులొందక

యథాశక్తి ప్రతి వేకువ గంటన్నర శ్రమ తోడుగ

సాగుతున్న కటిక నిజం – నమ్మేస్తున్నారు జనం!

- నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.

   లాస్ ఏంజల్స్, USA.

   02.06.2025.