3489* వ రోజు ....

 చెట్లను పెంచుదాం!

పర్యావరణాన్ని కాపాడుదాం!

03-06-2025మంగళవారం 3489* వ రోజు.

         మొక్కలు తెచ్చి, గోతులు తవ్వి, మొక్కలు నాటి, పాదులు తీసి, ప్రతిరోజు నీరు పోసి, రక్షణగా కంపకట్టి దినదినము చూచుకుంటు, అనుదినము కాచుకుంటు, మొక్కల ఎదుగుదలను చూచి మురిసిపోయే మనసు గల ధన్యులు స్వచ్ఛ కార్యకర్తలు.

         నేటి ఉదయం 4:12 ని॥కు 8 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ, ముగింపు సమయానికి 29 మంది కార్యకర్తలతో కళకళలాడింది.

         హైవేలో బందరు వైపుగా రహదారికి దిగువన నీడ నిచ్చే చెట్ల వద్ద కత్తులతో ముళ్ళ మరియు కలుపు చెత్తా చెదారాల్ని వేరు చేయువారు కొందరయితే, గొర్రులతో చెత్తను పోగు పెట్టువారు మరికొందరు. ఈ చెత్తను డిప్పలకెత్తి ట్రాక్టరు వద్దకు చేర్చువారు ఇంకొందరు, చెత్తను లోడ్ చేసుకొను వారితో క్రమశిక్షణగా, ఈ విధంగా క్రమబద్ధంగా పని వెంట పని జరిగిపోతుంది.

         రహదారికి దిగువన గతంలో పెట్టిన పూల మొక్కల వద్ద ఏర్పడిన కలుపును తీయువారు కొందరయితే, చీపుళ్ళతో ఎప్పటి చెత్తను అప్పుడు ఊడుస్తూ పోగుపెట్టువారు మరి కొందరు.  గ్రాస్ కట్టర్ మిషన్ తో నిపుణుడైన ఒక కార్యకర్త రహదారి అంచులను శుభ్రం చేయుట కన్పించింది.

         6.05 ని॥కు నేటికి పని ముగించి, కాఫీ సేవిస్తూ కబుర్లాడుకుంటూ తుది సమావేశంలో Dr.DRK గారు జరిగిన పని తాలూకూ సంతృప్తితో కూడిన పలుకులను విని, పల్నాటి అన్నపూర్ణ చెప్పిన స్వచ్ఛ నినాదాలతో గొంతు కలిపి రేపటి శ్రమదాన వేదిక హైవేలో గల కాసానగర్ - శివరాంపురం మధ్యలోనే అని తెలుసుకుని నేటికి కార్యకర్తలు స్వస్తి పలికారు -

- భోగాది వాసుదేవరావు

   సుందరీకరణ కార్యకర్త

   స్వచ్ఛ సుందర చల్లపల్లి

   03.06.2025.

         ఒక దశాబ్ది తపః ఫలము

ఏ ఊళ్లో కాలుష్యపు వికటహాసమో అప్పుడు

అదే ఊళ్ళొ శుభ్ర - హరిత పక పక విన్పించునిపుడు

ఇది సమష్టి శ్రమ ఫలితము – ఒక దశాబ్ది తపః ఫలము

స్వఛ్ఛ సైనికుల కష్టం చాటుతున్న సందేశము!

- నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.

   లాస్ ఏంజల్స్, USA.

   03.06.2025.