3490* వ రోజు ....

 మొక్కలు నాటుదాం!

పచ్చదనాన్ని పెంచుదాం!

04-06-2025 – బుధవారం – 3490* వ రోజు

         వేకువ ఝామున 4.14 నికు 12 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ మరికొద్ది సమయానికి 28 మందితో ఊపందుకుంది. హాస్పిటల్ స్టాఫ్ అధికంగా హాజరవటం ఈనాటి విశేషం.

         నిన్నటి వలెనే ఈ రోజు కూడా బందరు వైపున ఎడమ ప్రక్క దిగువన చెట్ల వద్ద శుభ్రం చేయుట, పాదులు తీయుట, వంగిన చెట్లను కర్ర గట్టి నిలబెట్టుట వంటి కష్టతరమైన పనులను ఇష్టంగా చేస్తూ నైపుణ్యం గల సీనియర్ కార్యకర్తలు దర్శినమిచ్చారు. వారికి సహాయముగా గొర్రులతో ఎప్పటి చెత్తను అప్పుడు లాగి పోగు పెడుతూ మహిళా కార్యకర్తలు కన్పించారు. రహదారి అంచున పారతో చెత్తను శుభ్రం చేస్తూ స్వేదం చిందిస్తూ ఒక మహిళా కార్యకర్త అగుపించారు.

         మరికొంతమంది కార్యకర్తలు రహదారి ప్రక్కన గతంలో నాటిన పూల మొక్కల వద్ద చతికిలపడి కూర్చుని ఓర్పుగా ముళ్ళ కంచెలోని కలుపును జాగ్రత్తగా తీస్తూ శుభ్రం చేయడం కన్పించింది.

         రహదారికి ప్రక్కన మరికొంత దూరములో గ్రాస్ కట్టర్ నుపయోగించి శుభ్రం చేయడమే గాక కత్తి పట్టి పెద్ద కలుపు మొక్కలను కట్ చేస్తూ 10 గజాల మేర శుభ్రం చేయడం కన్పించింది.

         కాఫీ సేవానంతర సమీక్షా సమావేశములో వేల్పూరి లక్ష్మి పలికిన స్వచ్ఛ నినాదాలతో శృతి కలిపి రేపటి శ్రమదాన వేదిక విజయవాడ రోడ్డులో గల NTR పార్కు అని తెలిసికొని, Jun 5 పర్యావరణ దినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం ఉందవి Dr. DRK గారి మాటలలో విని నేటికి కార్యకర్తలు స్వస్తి పలికారు.  

- భోగాది వాసుదేవరావు

   సుందరీకరణ కార్యకర్త

   స్వచ్ఛ సుందర చల్లపల్లి

   04.06.2025.

 

         ఒక దశాబ్ది తపః ఫలము

ఏ ఊళ్లో కాలుష్యపు వికటహాసమో అప్పుడు

అదే ఊళ్ళొ శుభ్ర - హరిత పక పక విన్పించునిపుడు

ఇది సమష్టి శ్రమ ఫలితము – ఒక దశాబ్ది తపః ఫలము

స్వఛ్ఛ సైనికుల కష్టం చాటుతున్న సందేశము!

- నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.

   లాస్ ఏంజల్స్, USA.

   03.06.2025.