3491* వ రోజు ....

 ఒక్కసారి మాత్రమే వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులు వాడకం నివారిద్దాం

పర్యావరణ పరిరక్షణకు అందరం సహకరిద్దాం!

5.6.2025 వ తేది 3491* వ రోజు విశేషాలు!

         వేకువ జాము 4:16 ని॥ NTR పార్కులో 18 మందితో స్వచ్ఛ సేవ మొదలైంది. ముందుగా అనుకున్న ప్రకారం NTR పైలాన్ ఎదురుగా రెండు వైపులా వెనుక భాగాన మొక్కలను నాటడానికి మట్టిని సమానంగా సర్దుకొనే పనిలో కొందరు, మొక్కలు నాటవలసిన వరుస క్రమం, ఏ ఏ మొక్కలను ఎక్కడ నాటాలో ప్రణాళికతో మరికొందరు, పైలాన్ కు వెళ్ళే దారికి వెలుపల రెండు ప్రక్కలా మరికొందరు మట్టి సర్దే పనిలో తలమునకలవగా కొద్ది నిమిషాలలోనే పార్కును అభివృద్ధి పరచే పనిలో భాగస్వాములైన ఉదయపు నడక మిత్రులు (Morning Walkers) అక్కడికి చేరుకున్నారు.

         పార్కు మెయిన్ గేటుకు ఎదురుగా లోపలి కొంత భాగాన్ని కార్యకర్త కోడూరు వేంకటేశ్వరరావు (చెక్ పోస్ట్ బాబాయ్) గారు మరికొద్ది మంది కలిసి సర్వాంగ సుందరంగా తయారుచేశారు.

         మహిళా కార్యకర్తలు మరియు సుందరీకరణ బృందం వారు పబ్లిక్ టాయిలెట్స్ ఎదురుగా ఉన్న రద్దును తీసి గోడ అంచులకు బలంగా వేయడం జరిగింది.

         మన ఉద్యమానికి సంపూర్ణ మద్దతునిస్తూ పరోక్ష సహకారమిస్తున్న ఉదయపు నడక వారు కార్యకర్తలతో మమేకమై మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా పనిలో భాగస్వాములవడం మంచి పరిణామం. నూరు వరహాలు, టెకోమా రెడ్, టెకోమా ఎల్లో, సువర్ణ గన్నేరు మొక్కలను నాటడం జరిగింది.

         మొత్తం 42 మందిలో ప్రతి ఒకరూ వచ్చిన దగ్గర నుండి చివరి వరకూ పనిలో బిజి బిజీ గానే ఉంటూ చెమటతో తడిసి ముద్దయినారు.

         ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు ప్రపంచమంతా ఎలా జరుపుకుందో గానీ స్వచ్ఛ చల్లపల్లిలో ప్రతి రోజూ పర్యావరణహితమైన పనులతోనే కార్యకర్తలు శ్రమించడం జరుగుతుంది. NTR పార్కు ప్రాంగణంలో 95 మొక్కలను ఈరోజు నాటడం జరిగింది.

         6 గంటలయ్యే సరికి విజిల్ మ్రోగగానే అందరూ కాఫీ కబుర్లలో సేద తీరి చెమటతో తడిసిన బట్టలు ఆరేలోగా సమీక్షా సమావేశానికి చేరుకున్నారు. జై స్వచ్ఛ చల్లపల్లి నినాదం ఉదయపు నడక మిత్రులు శ్రీ నాయుడు శ్రీధర్ (బుజ్జి) గారు చెప్పగా స్వచ్ఛ గళం నుండి వినిపించిన ఒక్కరోజైనా స్వచ్ఛ కార్యకర్తగా బ్రతుకు నేస్తమాఅనే ప్రభోద గీతం విని, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ఉదయపు నడక వారికి డాక్టరు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

         మొక్కల పర్యవేక్షణకు తోటమాలి ఏర్పాటు విషయం ఆలోచించి, ప్రతి మొక్కను బ్రతికించాలని సూచించడం జరిగింది.

         రేపు కలవవలసిన ప్రదేశం హైవే రోడ్ లోని మొన్న పని ఆగిన ప్రదేశమని చెప్పి నిష్క్రమించడం జరిగింది.

 

అపరిశుభ్రతతో నిండిన ఒకనాటి ఊరు గుర్తుందా

ప్లాస్టిక్ వ్యర్ధాల గుట్ట బైపాస్ జ్ఞాపకముందా

దశాబ్ద కాలంగా స్వచ్ఛ కార్యకర్త శ్రమ ఫలితం

చూడముచ్చటైన స్వచ్ఛ చల్లపల్లి మన గ్రామం!

-నందేటి శ్రీనివాస్

ప్రజాకళాకారుడు

05.06.2025

 

     వలస పోయె శ్రమదానం!

కాసానగరం దగ్గర కాలుష్యం పెరిగిందని

జాతీయపు రహదారికి సౌందర్యం తరిగిందని

30 - 40 మందికి వచ్చిందట పూనకం

వానైనా చీకటైన వలస పోయె శ్రమదానం!

-  నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.

   లాస్ ఏంజల్స్, USA.