3493* వ రోజు ....

 ఒక్కసారి మాత్రమే వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులు వాడనే వాడం

కాలుష్య రక్కసి నుండి పర్యావరణాన్ని కాపాడుదాం అందరం

ది. 7.6.2025 శనివారం 3493* వ రోజు శ్రమ ఘట్టాలు

         వేకువనే 4:16 ని॥లకు 216 జాతీయ రహదారికి ఒక ప్రక్కన జరుగుతున్న సేవ 17 మందితో ప్రారంభమయింది. మొక్కల చుట్టూ పరిశుభ్రం చేయడం, పిచ్చి గడ్డి, కలుపును తొలగించడం మొక్కల మొదళ్లకు మట్టిని పోసి సరిచెయ్యడం లాంటి పనులు జరుగుతూ ఉన్నాయి.

         ఈలోపుగా ఒక్కొక్కరు చేరుకుని గొర్రులతో లాగడం, చెత్తను ప్రోగు బెట్టడం చేస్తుండగా అనుకున్న సమయానికి ఒకింత ముందుగానే ముక్త్యాల గ్రామం నుండి సందర్శానార్ధం వస్తారన్న 35 మందితో బస్సు రానే వచ్చింది. వారిలో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. కార్యకర్తలు చేస్తున్న సేవను ఎంతో దగ్గరగా గమనిస్తూ డాక్టరు గారిని అడిగి వారి వారి సందేహాలను తీర్చుకున్నారు. వారిలో ఎక్కువ మంది మన కార్యకర్తల శ్రమను అతి దగ్గరగా నిశితంగా పరిశీలించి సమాజానికి చేసే సేవలో కూడా ఇంత నాణ్యతతో కూడిన శ్రమ చేస్తారా అని ఆశ్చర్యపోవడం జరిగింది.

         6 గం॥ సమయానికి విజిల్ మ్రోగగానే వచ్చిన వారితో కలిసి మొత్తం 70 మంది కాఫీ సేవించిన పిదప సమీక్షా సమావేశానికి విచ్చేశారు. నా గాత్రం నుండి జై స్వచ్ఛ సుందర చల్లపల్లి నినాదంతో పాటు ఒక పాట, పద్యం ఆలపించగా అంతా శ్రద్దగా వినడం జరిగింది. తరువాత డాక్టరు గారు మాట్లాడుతూ ఒక సామాజిక ఉద్యమ నేపద్యాన్ని ప్రత్యక్షంగా చూసి తెలుసుకుని స్ఫూర్తి పొందటానికి అంత దూరం నుండి (ముక్త్యాల గ్రామం) సమయానికి విచ్చేసిన వారందరికీ అభినందనలు తెలియజేశారు, వారి నుండి రాఘవేంద్రరావు గారు, పంచాయితీ సెక్రటరీ గారు, ఓ మహిళా సోదరి స్వచ్ఛ సేవలను కొనియాడుతూ వారి స్పందన తెలియజేశారు.

         స్వచ్ఛ చల్లపల్లి ఆత్మీయులు డా. శివన్నారాయణ గారు ప్రసంగిస్తూ నిజానికి, అబద్ధానికి, కూలికీ, సేవకూ, బాధ్యతకు ఉన్న వ్యత్యాసాలను గూర్చి అందరికీ అర్ధం అయ్యే వివరణాత్మక ఉపన్యాసం ఇచ్చారు.

స్వచ్చోద్యమానికి

         డా. గోపాళం శివన్నారాయణ గారు 5,000/-,

         ప్రాతూరి శాస్త్రి గారు 5,000/-,

         కోడూరు వెంకటేశ్వరరావు గారు 520/-,

         డా. మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారి 2,000/- విరాళాలు అందజేయడం జరిగింది.   

         రేపు కలువవలసిన ప్రదేశం గూర్చి ఈరోజు పని ఆపిన ప్రదేశం అనుకుని నిష్క్రమించిరి.        

- నందేటి శ్రీనివాస్

   ప్రజాకళాకారుడు

   07.06.2025

 

         పూజనీయమా కాదా?

అనునిత్యం కొలిచేందుకు ఆరాధ్యులు కావాలా?

సన్మార్గం, నిస్వార్థపు జాడ మీకు దొరకాలా?

క్రికెటర్లూ, సినీ నటుల వెంటె మీరు పడతారా?

పుష్కరకాలపు కష్టం పూజనీయమా కాదా?

-  నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.

   లాస్ ఏంజల్స్, USA.

    07.06.2025.