ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం అరుదైన – 2000* వ నాటి విశేషాలు!
దేశంలో – బహుశా ప్రపంచంలో ఎక్కడా జరగని అసాధారణ – సుదీర్ఘ చల్లపల్లి స్వచ్చోద్యమం లో అరుదైన – 2000* నాటి వేకువ 4.00 కే గంగులవారిపాలెం దారిలోని బండ్రేవుకోడు మలుపు దగ్గరకు చేరుకొన్న 57 మంది కార్యకర్తల విజయ గర్వదాయకమైన స్వచ్చ – శుభ్ర – సుందరీకరణ ప్రయత్నం ఈరోజు ముందుగానే – 5.30 కే ముగిసింది.
- 18 మంది నిన్నటి తరువాయిగా కాలువ ఉత్తర గట్టుకు, తారు రోడ్డుకు, చెట్ల మూలాలకు పటిష్టత చేకూర్చుతూ, సగం ఆరిన మురుగు మట్టిని డిప్పలతో పైకి చేర్చి, సర్దారు. పావుగంటకు పైగా వీరి శ్రమదాన విన్యాసాలను, తత్ఫలితంగా – గత వారం రోజుల కృషితో బారులు తీరి అందానికి భరోసా ఇస్తున్న చెట్లను అటు ఇటు తిరిగి చూసి ఆనందించాను. (ఈ అరుదైన నిస్వార్ధ శ్రమానందం ఈ కార్యకర్తలు ప్రతి క్షణం పొందుతూనే ఉంటారు!)
- దారిపొడుగునా అరకిలోమీటరు మేర – గంటన్నర పాటు మిగిలిన కార్యకర్తల శ్రమదాన సందడే సందడి! చీకటైనా - మురుగు కాల్వలో ఏ తుక్కునూ వదలక – ఎండు గడ్డినీ, ఆకుల్నీ, ఉత్తరేణి చీకుకంపలనూ ఉపేక్షింపక - కత్తులతో నరికేవారు, దంతెలతో లాగేవారు, చీపుళ్లతో ఊడ్చేవారు, వంగలేని పెద్దలు చెట్లను ట్రిమ్ చేసి తగులుకొన్న వరిగడ్డిని లాగుతూ – ఇలా ఎవరి ఆనందాలు వారివే! ఈ అద్భుత గ్రామ సౌకర్య కార్యక్రమాన్ని కెమెరాలో బంధించే – అన్ని చోట్లకూ తిరుగుతూ పర్యవేక్షించే పెద్దాయన శాస్తి గారి, మన పెద్ద డాక్టరు గారి సంగతి ఇక చెప్పవలసిన పనేలేదు.
నాకైతే – 58 ఏళ్ల నాడు తొలిసారి చూసిన గుండమ్మ కధ సినిమాలో మహానటి హావభావాలు ప్రదర్శించిన “అలిగిన వేళనె చూడాలీ – గోకుల కృష్ణుని అందాలూ .... అనే పాట గుర్తొచ్చి,
“పని సమయంలో చూడాలీ – స్వచ్చ సైనికుల చందాలూ ....” అని అప్పటికప్పుడు (మనసులోనే) కొంత వ్రాసుకున్నాను కూడ!
మనం సరే! 30 వేల కిలోమీటర్ల దూరాన అమెరికా ప్రవాసి నాదెళ్ళ సురేష్ తన సెల్ ఫోన్ కంటితో ఈ దృశ్యాలను పరవసించి చూస్తూ - వింటూ - ఆనంద ఉద్వేగాలతో బిగ్గరగా స్వచ్చోద్యమ సంకల్ప నినాదాలను పదేపదే ప్రకటించాడు.
కరోనా కట్టడులను పాటిస్తూ – Dr. పద్మావతి గారి సమయ నిబంధనలనుసరిస్తూ 20 నిముషాల పాటు సాగిన సమీక్షా సమావేశంలో DRK గారి ప్రసంగం, శంకర శాస్త్రి గారి (నిన్నటి దికాక మళ్ళీ) 5000/- దాతృత్వం, చాలా పెద్ద డాక్టరు గోపాలకృష్ణయ్య గారి నెలవారీ 2000/- విరాళం, 18 ఏళ్ల వైవాహిక స్ఫురణగా దేసు మాధురి – ప్రభాకరులచే సంచుల పంపకం, కేకులతో బాటు 1000/- విరాళం – నందేటి శ్రీనివాసుని గానం – మల్లంపాటి ప్రేమానందం గారి సపోటా పండ్ల వితరణం – తాతినేని (మొక్కల) రమణ గారి పాయస పంపకం – మనకోసం ట్రస్టు వారి స్వీట్లు, హాట్ల వితరణం - ఇలా ఈ నాటి స్వచ్చోద్యమ విశేషాలు ఎన్నని వర్ణించను? పొడి మాటల్లో కాక ఒక పాటలో వినండి.
(ఏమని వర్ణించనూ .... ఎంతని కీర్తించనూ...)
రేపటి నిత్యనూతన శ్రమదాన వైభవం కూడ ఈ గంగులవారిపాలెం దారిలోనే ఉంటుంది.
స్వచ్చ కార్యకర్తల ఒక సహజగుణం
వెలుగువచ్చు – గాలి వీచు – విరులు కనులు విచ్చి చూచు –
వర్షం – శీతల వాయువు వచ్చి మొక్క తలను ఊచు
చల్లపల్లి స్వస్తతకై స్వచ్చ కార్యకర్త నడచు!
రెండు వేల నాళ్ళ శ్రమకు నీరాజన మర్పిస్తా!
- నల్లూరి రామారావు
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు ‘మనకోసం మనం’ ట్రస్టు బాధ్యులు,
ఆదివారం – 03/05/2020
చల్లపల్లి.