2001*వ రోజు....

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 2001* వ నాటి శ్రమదాన ముచ్చట్లు 

            మబ్బు పట్టిన ఈ నాటి వేకువ 4.00 - 6.00 నడుమ యధా ప్రకారం జరిగిన స్వచ్చంద శ్రమదానం లో పాల్గొన్న వారు 30 మంది. వారి నియమబద్ధ శ్రమదాన స్వేదంతో తడిసి, స్వస్త - సుందర - పునీతమైన ప్రాంతం 22 వ వార్డులోని చివరి భాగమైన గంగులవారిపాలెం దారిలోని ఊర మురుగు - బండ్రేవు కోడు మురుగు కాల్వల సంగమ ప్రదేశం.

రెండు వేలో – మూడు వేల రోజులో – ఆ సంఖ్యా ప్రాధాన్యలంతగా పట్టని – రికార్డులు, రివార్డుల పట్ల పెద్దగా దృష్టినిల్పని – తమ గ్రామ పౌర సమాజ ఋణ విముక్తి పట్ల మాత్రమే ద్యాస నిలిపిన స్వచ్చ కార్యకర్తలు తమ ఊరి శుచి – శుభ్రత – సౌందర్యాలను ఒక్కో మెట్టు ఎక్కిస్తూ – అలవక, పోలవక – 2001 వ అడుగు వేశారు!

            రెస్క్యూ దళం వారి తారు రోడ్డు, వృక్ష మూలాల పటిష్టతా కృషి ఈ నాడు కాస్త మందిగించింది. వారి నేటి పని ప్రాంతం మురుగు కాల్వలో నుండి నిట్ట నిలువుగా ఉండటమూ, అక్కడ దట్టంగా అల్లుకొన్న గుర్రపు డెక్క, బొత్తిగాచాలని వెలుతురూ అందుకు కారణాలు కావచ్చు. వీరిలోని ఒక ఆల్ రౌండర్ కార్యకర్త కాలికి ఒక పాము చుట్టుకోవడమూ, దాన్ని విదిలించుకోవడంతో కొంత పని సమయ నష్టం జరిగింది! (ఆ పామూ, కార్యకర్తలూ ప్రస్తుతం అంతా క్షేమం.) మరొక 5 చెట్ల కుదుళ్ళ రక్షణా కార్యక్రమం రేపటికి మిగిలేపోయింది!

            కత్తుల వారి, దంతెల, చీపుళ్ళ వారి వీధి శుభ్రతా ప్రయత్నం, పూల మొక్కల పాదుల మరామత్తు కృషి యధావిధిగా జరిగిపోయింది. వరి గడ్డిని, ఇతర వ్యర్ధాలను ఊడ్చి పోగులు చేశారు. నలుగురు వాలంటీర్లు మూల మలుపులోని తాడి చెట్లను సుందరీకరించారు. ఎండు వరిగడ్డి వెంటులుగా మెలివేసి, కొన్ని చోట్ల మొదళ్ళకు చుట్టి అలంకారించారు.

            తమ శ్రమదాన సమయంలో కార్యకర్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో విధించిన సామాజిక దూరం, మూతులకు చిక్కాల బిగింపు వంటి నిబంధనలన్నిటినీ ఈ రోజు కూడ తు.చ. తప్పక పాటించారు.

            2002 వ నాటి మన గ్రామ సామాజిక బాధ్యతల కోసం రేపు శుభోదయాన 4.00 కు ఈ గంగులవారిపాలెం దారిలోనే కలుసుకొందాం!

            క్రమం తప్పని స్వచ్చ ఉద్యమ

స్వార్ధమును చిదిమేసుకుంటూ – త్యాగములకే జన్మనిస్తూ

వ్యష్టి నుండి సమిష్టి దాకా జైత్రయాత్రలొనర్చి – ఈ పం

దొమ్మిదొందల రోజులుగ తమ ఊరి మేలుకు పాటుబడుతూ

నిబ్బరంతో నిజంగానే క్రమం తప్పక స్వచ్చ సైన్యం ఉద్యమిస్తుందా!      

 

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

సోమవారం 04/05/2020,
చల్లపల్లి
.