ఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను మనం వాడటం ఆపేద్దాం!
02.07.2025 బుధవారం 3517* వ రోజు నాటి స్వచ్ఛ సేవల ఘట్టాలు.
స్వచ్ఛ చల్లపల్లి ప్రవేశ స్వాగతద్వారం వద్ద తెల్లవారుజామున 4.13 నిమిషాలకు 15 మంది స్వచ్ఛ కార్యకర్తలతో ప్రారంభమైన స్వచ్ఛ యజ్ఞం రోడ్డు ప్రక్క గద్దగోరు మొక్కలకు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను లాగి అత్యంత పరిశుభ్రంగా ఆ ప్రాంతమంతా శుభ్రపరిచారు.
కొంతమంది కార్యకర్తలు స్వాగతద్వారం (బందరు) వైపు కొన్ని మొక్కలకు మొదట్లో మట్టి పోయడం, పాదులు చేయడం స్వచ్ఛ సుందర చల్లపల్లి బోర్డుకు క్రింది భాగంలో ఉన్న మట్టిదిబ్బను సరిచేయడం చేసారు.
ఒక కార్యకర్త గ్రాస్ కట్టర్ తో గరిక, ఊడ, తుంగ లాంటి చిన్న గడ్డిని సమానంగా కట్ చేయడంతో ఆ ప్రాంతమంతా చూడచక్కగా తయారైంది.
రహదారికి ఒక ప్రక్క అడవి తంగేడు పూలు, ఒక ప్రక్క సువర్ణ గన్నేరు పసుపు పూల సోయగాలు, మరోప్రక్క అందంగా ఇది “స్వచ్ఛ సుందర చల్లపల్లి” అని తెలియచేసే బోర్డు, మధ్యలో చల్లపల్లికి వచ్చే వారికి రారమ్మని స్వాగతం పలికే వెడల్పైన స్వాగతద్వారం దారి పొడవునా రంగురంగుల పూలు అంతటి అద్భుతమైన ఘట్టం ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది ఈ “స్వచ్ఛ సుందర చల్లపల్లి” ఉద్యమం.
మబ్బులు కమ్మి వర్షం కురవని చల్లని గాలిలో మనసుకు హత్తుకుని స్ఫూర్తి పొందే ప్రబోధగీతాలు వింటూ ప్రతి కార్యకర్త ఊరి బాగుకు 2 గంటలపాటు 30 మంది కార్యకర్తలు శక్తి కొలది శ్రమచేస్తూ 6 గంటలకు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి చెమట, మట్టి తడిని శుభ్రం చేసుకొని కాఫీ సేవించారు.
తదుపరి సమీక్షలో ఆడపా గురవయ్య మాష్టారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదంతో గొంతు కలిపి వారు చెప్పిన సుభాషితాలు విని,
రామానగరం వాస్తవ్యులు యార్లగడ్డ పుష్పసుందరావతి మొన్న వారి కుమారులతో స్వచ్చోద్యమం కోసం పంపిన 5,000/- విరాళాన్ని గుర్తుచేసుకుని,
రేపు కలవవలసిన ప్రదేశము ఈరోజు పని ఆగిన చోటు అని నిర్ణయించుకొని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
02.07.2025
అనుభూతుల పరంపరలె
బురదలోన కాళ్లు దించి మురుగు పనులు చేయునపుడు
ఆయాసమె కలిగిందో – ఆనందమె మిగిలెనో
చిమ్మ చీకటిలో వీధి చక్కదిద్దునప్పుడు
అనుభూతుల పరంపరలె అమూల్యములు ఇప్పుడు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
02.07.2025