3518* వ రోజు .....

 ఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను మనం వాడటం ఆపేద్దాం!

03.07.2025 గురువారం 3518* వ రోజు నాటి స్వచ్ఛ సేవలు. 

         జాతీయ రహదారిపై తెల్లవారు జాము 4.22 నిముషాలకు 14 మందితో చల్లపల్లి స్వచ్చ కార్యక్రమాలు ప్రారంభమయినవి. రహదారికి ఒక ప్రక్క చేస్తున్న పనులకు కొనసాగింపుగా మొక్కల చుట్టూ కలుపు తీయడం, రహదారి క్రింది భాగంలో పెరిగిన పెద్ద పెద్ద పిచ్చి మొక్కలను లాగి వేయడం చేస్తూ, ఆ వచ్చిన చెత్తను రహదారి ప్రక్కన పెద్దగా కోతకు  గురై మట్టి కొట్టుకు పోయిన ప్రదేశాలలో వేయడం జరిగింది.

         కొంతమంది కార్యకర్తలు మాత్రం పెద్ద మొక్కలు వరిగిపోవడంతో వాటిని సరిచేసి పొడవాటి కర్రలు పాతి నిటారుగా ఉండే లాగున తాడుతో కట్టి, అవసరానికి మించి నీటి ఎద్దడికి  గురి కాకుండా వాటి మొదట్లో మట్టిని పోయడం జరిగింది.

         రోజులు గడుస్తున్న కొద్దీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ ఈ ఉద్యమ ప్రస్థానంతో చల్లపల్లి లో అనేక మౌలికమైన మార్పులు జరిగాయని, కాబట్టి మా ఓపికున్నంత వరకూ ఈ ఉద్యమంలో భాగస్వాములై ఊరికి మా వంతు సేవ చేస్తూనే ఉంటామని కార్యకర్తలు అనేక సందర్భాలలో వారి మనో భావాలు వ్యక్త పరుస్తూ ఉండటం చూశాం.

         10 సంవత్సరాలకు పైగా చల్లపల్లిలో జరుగుతున్న ఈ స్వచ్చ సేవలు అనేక ప్రాంతాల వారికి స్ఫూర్తి నిస్తున్నాయి. ఇంకా కొంతమంది యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతు కూలీలు ఈ ఉద్యమంలో భాగస్వాములైతే మన చల్లపల్లి ఊహించని మార్పులతో చరిత్రలో నిలిచిపోతుంది.

         ఏ రోజుకారోజు చేసిన పనిని ఒకసారి వెనుతిరిగి చూసి చేసిన కష్టాన్ని మరిచిపోయి సంతోషాన్ని మాత్రమే మనసంతా నింపుకుని వెళ్ళే కార్యకర్తలకు ఈ చల్లపల్లి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు.

         6 గంటల వరకు  శ్రమించి విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి, కొద్దిసేపు కాఫీ కబుర్లతో గడిపి తదుపరి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. హైవే రోడ్ లో స్వాగత ద్వారం వద్ద దూర ప్రాంత సర్వీసులైన బెంగుళూరు, హైదరాబాద్ బస్సులు చల్లపల్లి లోని ప్రయాణికుల కొరకు ఆగుతున్నందున వారి సౌకర్యార్థం డా.పద్మావతీ మేడం గారు ఏర్పాటు చేసిన 2 సిమెంటు బల్లలను అందరూ తిలకించి, పంచాయతీ కార్యదర్శి మాధవేంద్ర రావు గారు పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదలకు జై కొట్టి, ప్రయాణీకుల సౌకర్యార్థం సిమెంటు బల్లలు ఏర్పాటు చేసిన  సర్పంచ్, కార్యదర్శి పంచాయతీ తరపున ధన్యవాదాలు తెలుపుతూ రేపు మనం కలవవలసిన ప్రదేశం హైవే లోని వంతెన వద్ద (గంగులవారిపాలెం సమీపంలో ఉన్న) అనుకుని నిష్క్రమించారు.    

- నందేటి శ్రీనివాస్

   ప్రజాకళాకారుడు

   03.07.2025

         ఒక విశిష్ట అధ్యాయము!

గ్రామముతో ఒక బంధన - ఒక చింతన - ఒక ప్రేరణ

అపసవ్యమొ - అవకరమో - అనుమానమొ - తమ ఊరికి

కలుగకుండ చూచుకొనే కఠినమైన ప్రయత్నమది

చల్లపల్లి చరిత్రలో అది విశిష్ట అధ్యాయము!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

    03.07.2025