ఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను మనం వాడటం ఆపేద్దాం!
4.7.2025 శుక్రవారం 3519* వ రోజు శ్రమ సంస్కృతి ప్రతిబింబాలు!
14 మంది కార్యకర్తలతో 21 6 జాతీయ రహదారి వంతెన (గంగులవారిపాలెం సమీపాన) స్వచ్ఛ శుభ్ర కార్యదీక్ష మొదలై పైభాగాన ఒక ప్రక్క అపరిశుభ్రంగా ఉన్న భాగాన్ని బాగుచేయడం, వంతెన మీదకు మట్టి చేరి దానిపై మొలచిన గడ్డిని పూర్తిగా తీసివేయడం, మందుబాబులు పీఠం వేసి కూర్చుని రోజుల తరబడి వేసిన ఖాళీ మద్యం సీసాలను ప్లాస్టిక్ గ్లాసులను, పగులగొట్టిన గాజు పెంకులను ఏరి వేయడం మహిళా కార్యకర్తల వంతు అయింది.
వంతెనకు అటూఇటు ఉన్న అడవి తంగేడు మొక్కల పాదులలో గడ్డిని తీసి శుభ్రం చేయడం, ఇబ్బడిముబ్బడిగా మొలచి ఏపుగా ఎదిగిన జిల్లేడు కంపను నరికివేయడం, వచ్చిన కొంత భాగంలోని చెత్తను వంతెన సమీపంలో ఏర్పడిన మట్టికోతవలన పడిన గోతులలో వేసి సరిచెయ్యడం, కొంతమంది కార్యకర్తలు చేశారు.
ప్రజలలో ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమ లక్ష్యాలతో అది సాధించిన విజయాలతో పని లేని కొందరు వ్యక్తులు. ఎదిగిన మొక్కలను మొదళ్ళకంటూ నరికినా, నాటిన మొక్కలను మట్టితో సహా పెకలించుకుపోయినా, చెక్కు చెదరని సంకల్పంతో, అచెంచల విశ్వాసంతో హైవే దారిని, చల్లపల్లి పొడవునా, నాల్గు దిక్కులా నందనవనం లాగా చెయ్యడమే మా లక్ష్యం అంటూ వారి స్వేద జలంతో ఈ ఊరిని శుభ్రంగా కడిగేస్తున్న స్వచ్ఛ కార్యకర్తలు ఈ చల్లపల్లికి కొండంత అండ అని చెప్పడంలో సందేహం లేదు.
హైవే పొడవునా కొంత భాగంలో పెద్ద చెట్లకు మొదళ్ళకు మట్టి పోసి కర్రకట్టి సరిచేస్తున్న కొంతమంది కార్యకర్తల కఠోర దీక్ష, శ్రమ ఎప్పటికీ వృధా కాదు!
6 గంటల వరకు 32 మంది కార్యకర్తలు శ్రమించి విజిల్ మ్రోగడంతో పనికి విరామమిచ్చి కాఫీ సేవించారు.
డా. వరప్రసాదు (చిన్న డాక్టరు) గారి సతీమణి జయరాణి గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ కేకుల పంపిణీ, స్వచ్చోద్యమ ఖర్చులకు 2000/- విరాళం,
డా.మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు 2,000/-,
ప్రాతూరి శాస్త్రి గారు 5,000/-,
షణ్ముఖ శ్రీనివాస్ గారు 2,500/- లను రధసారధుల వారికి అందజేశారు.
డా. వరప్రసాదు గారు చెప్పిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి జై కొట్టి,
రేపు కలవవలసిన ప్రదేశం కూడ ఈ వంతెన పైనే అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
04.07.2025
ఏ తెలియని కారణమో!
చాల మంది దృష్టిలొ ఇది స్వార్థ రహిత సదాచరణె
సగం మంది ఆలోచన స్వచ్ఛ సేవ చేయాలనె
ఏదో ఒక సంకోచము – ఏ తెలియని కారణమో
వేకువ సేవల నుండే వెనకకు లాగును వారిని!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
04.07.2025