3522* వ రోజు . ....

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వినియోగం మనకెంతో నష్టం

కాలుష్య కోరల నుండి పర్యావరణాన్ని రక్షించకుంటే మనకు తీరని కష్టం!

7.7.2025 సోమవారం 3522* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమ యజ్ఞం!

         జాతీయ రహదారిపై నేటి తెల్లవారుజామున 4:17 నిమిషాలకు 12 మంది కార్యకర్తలతో స్వచ్ఛ యజ్ఞం ప్రారంభమయింది. పెద్ద పెద్ద జిల్లేడు చెట్లు, పిచ్చి చెట్లు ముళ్ళ పాదులను సంహరించుకుంటూ, పైన రహదారి ప్రక్క మార్జిన్ లో పూల మొక్కల చుట్టూ ఉన్న గడ్డిని బాగుచెయ్యడం జరిగింది.

         ఆ ప్రాంతములో ఇంతకుముందు కార్యకర్తలు పని చేసి ఎక్కువ రోజులు అగుట చేత పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు విపరీతంగా పెరిగి కార్యకర్తలు ఎక్కువగా శ్రమించి ఆపనిని కొంతభాగం చేయగలుగుతున్నారు. మహిళా కార్యకర్తలు మాత్రం మార్జిన్ లో గడ్డిని సమానంగా కొడవళ్ళతో కోస్తూ చూపరులకు ఎంతో అందంగా కనపడే లాగున ఆ మార్జిన్ తయారయింది.

         మరొక బృందం వారి పని షరామామూలే అన్నట్లు పెద్ద మొక్కలకు మొదళ్లు బలం అయ్యేటట్లు మట్టిని తవ్వి పోసి వంగిన మొక్కలను నిలబెట్టి కట్టడం లాంటి పనులతో అందరూ 6 గంటల వరకూ శ్రమించి విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి చేతి పనిముట్లు జాగ్రత్త చేసి తదుపరి కాఫీ సేవించి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

         సమీక్షా కార్యక్రమంలో పైడిపాముల రాజేంద్రప్రసాద్ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదంతో గొంతు కలిపి,

         రేపు కలవవలసిన ప్రదేశం ఇక్కడే అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

   ప్రజాకళాకారుడు

   07.07.2025

 

         శ్రేష్టమైన సంపద!

అవలీలగ పదేళ్లుగా అవలంబించాంబాధ్యత

అది సేవో – కర్తవ్వమొ ఆలోచించుటె విజ్ఞత

అందుకు ప్రతి ఫలఫలముగ మన మందుకొన్న సంతృప్తే

జీవితకాలం తరగని శ్రేష్టమైన సంపద!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

    07.07.2025