పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
12.07.2025 శనివారం 3527* వ రోజు శ్రమదాన విశేషం!
ముందుగా నిన్న సమీక్షా కార్యక్రమంలో అనుకున్నట్లుగా నేటి వేకువ 4:20 నిమిషాలకి బైపాస్ రోడ్డులోని దాసరి రామమోహనరావు గారి ఇంటి సమీపంలో 16 మంది కార్యకార్తలు గ్రూప్ ఫోటో దిగి రోడ్డు ప్రక్కల ఉన్న పిచ్చి మొక్కలను, అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డిని పరిశుభ్రం చేశారు. ఆ సమీపంలోని వారి ఇంటి పెరట్లో బాగుచేసుకుని రోడ్డు ప్రక్కనే పడవేసి నిర్లక్షంగా వదిలేసిన పెద్ద చెత్త గుట్టను కార్యకర్తలు ట్రాక్టర్ లోకి లోడింగ్ చేసి డంపింగ్ కేంద్రానికి తరలించారు.
డ్రైన్ ప్రక్కనే ఉన్న గార్డెన్ కు బయట ప్రక్కన ఉన్న మాచర్ల కంప, గడ్డి, ఎండిపోయిన తుక్కును మొదలుకంట పెకలించి ఎంతో పరిశుభ్రంగా బాగుచేశారు. మహిళా కార్యకర్తలు ఆ ప్రాంతమంతా శుభ్రంగా ఊడ్చి వచ్చిన మట్టిని గార్డెన్ లో వేసి తుక్కును డిప్పలకెత్తి ట్రాక్టర్ లోకి లోడ్ చేశారు.
రాత్రి వర్షం పడడం చేత వేకువ నుండే వాతావరణం చల్లగా ఉండి పని చేయడానికి వీలుగా ఉండడంతో 49 కార్యకర్తలు ఎంతో ఉత్సాహభరితంగా ఆ ప్రాంతాన్ని 6 గంటల వరకూ పరిశుభ్రం చేసి విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చారు.
తదుపరి సమీక్షలో నేటి విశేషమైన శ్రీ దాసరి రామమోహనరావు గారి పుట్టిన రోజు సందర్భంగా కార్యకర్తలంతా రామమోహనరావు గారికి శుభాకాంక్షలు తెలిపి వారు ఏర్పాటు చేసిన అల్పాహార విందును, స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం ఈరోజు అందించిన 1,00,000/- విరాళాన్ని స్వీకరించి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేశారు. దాసరి రామమోహనరావు గారు చల్లపల్లి అభివృద్ధి కోసం నేటితో ఇచ్చిన విరాళం మొత్తం 26,00,000/-
ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో పేటేరు వాస్తవ్యులు రంగస్థల నటులు దీవి రామమోహనరావు గారు వారి కుటుంబంతో సహా స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొని రంగస్థల పద్యాలు ఆలపించి అందరినీ అలరించారు.
డా. మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదంతో గొంతు కలిపి,
రేపు కలవవలసిన ప్రదేశం జాతీయ రహదారిపై క్లబ్ రోడ్ సమీపంలోనే అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
12.07.2025.
కొందరు తొలి అడుగేస్తే
కష్టాలతొ వన్నె తరగి గ్రామం వెలవెలబోతే
పచ్చదనం అడుగంటుచు ఆహ్లాదం కొడిగటితే
అవ్వానిని సరిదిద్దగ కొందరు తొలి అడుగేస్తే
అడుగులు కలపని సోదర గ్రామస్తుల నేమనవలె?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
12.07.2025