ఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం ప్రమాదకరం!
15.07.2025 మంగళవారం 3530* వ రోజు నాటి పని పాటల సిత్రములు!
హైవే పై క్లబ్ రోడ్డుకు సమీపంలో 4:14 నిమిషాలకు 12 మంది కార్యకర్తలతో ఈరోజు పని మొదలైంది. క్రమక్రమంగా కార్యకర్తలు పెరుగుతూ రహదారికి పొడవునా మనం పెట్టిన మొక్కలలో వచ్చిన విపరీతమైన కలుపు, మొక్కలను చుట్టుముట్టి పెరుగుదలకు ఆటంకమైన పిచ్చి దొండ తీగ మొదలగు వాటిని లాగివేసి మొక్కలకు 5 అడుగుల దూరం వరకు క్రింది భాగంలో కార్యకర్తలు శుభ్రం చేసుకుంటూ ముందుకు సాగారు.
విచ్చలవిడిగా మొలచిన జిల్లేడు చెట్లు, ముళ్ళ పొదలు చేయడానికి వీలులేక నలుగురు కార్యకర్తల సహనానికి పెద్ద పరీక్ష అయింది. మరీ క్రింది భాగంలో నిలబడడానికి కూడా సరిగా లేక ఏటవాలు భూమిపై కాలు ఎక్కువ సేపు మోప లేక వారి తిప్పలు వర్ణనాతీతం.
గడ్డి కోసే యంత్రంతో ఒక కార్యకర్త చేస్తున్న పని నిరాటంకంగా కొనసాగుతూ వంతెన దగ్గరలోకి వెళ్లింది. మరొక ఐదుగురు కార్యకర్తలు వంగిపోయిన నీడనిచ్చు వృక్షాలను వారి నైపుణ్యంతో పునరుద్ధరించి వాటికి ముళ్ళ కంపను, పాదులను కట్టి వాటి మొదట్లో మట్టిని పోసే బాధ్యతను కూడా వారే భుజస్కందాలపై వేసుకోవడం గమనార్హం.
“ఉందిలే మంచి కాలం ముందు ముందునా” అని మహాకవి శ్రీ శ్రీ గారు రాసినట్లుగా చల్లపల్లికి వేం చేసినా, చల్లపల్లి మీదుగా ప్రయాణించినా కార్యకర్తల చెమట చుక్కల శ్రమలో నుంచి ఓ అద్భుతంగా ఆవిష్కరింపబడిన పర్యావరణ ప్రపంచంలోకి అడుగిడుతున్న అనుభూతి భవిష్యత్ లో అందరూ పొందుతారు.
ఊరి బాగుకొరకు చేసే శ్రమలో కూడా ఎంతో సంతోషాన్ని పొందుతున్న కార్యకర్తలు 6 గంటల వరకు 32 మంది శ్రమ చేస్తూ విజిల్ మ్రోతకు పనికి విరామమిచ్చి సంకేతం కొద్ది నిమిషాల వ్యవధిలో ఒంటి చెమట తడిని శుభ్రపరచుకుని కాఫీ కబుర్ల తదుపరి 120 స్పీడుతో హైవే లో వెళ్ళే వాహనాలను జాగ్రత్తగా తప్పుకొంటూ సమీక్షా సమావేశానికి నడిచారు.
శరత్ గారు చెప్పిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదంతో “సాధిస్తాం సాధిస్తాం” అంటూ జై కొట్టి,
రేపు కలువవలసిన ప్రదేశం కూడా ఈరోజు పని ఆగిన చోటున అని అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
15.07.2025.
చల్లపల్లిలో వృక్ష విలాపం – 1
(చల్లపల్లి వృక్ష సంపద తరపున దాసరి వారి వేదనకు నల్లూరి వారి పద్య రూపం)
అయ్యలారా! అమ్మలారా! పిన్నలారా! పెద్దలారా!
చల్లపల్లి నివాసులారా! చుట్టు ప్రక్కల జనము లారా!
వినుడు వినుడీ వృక్షసంతతి వేదనామయ విలాపమ్మును
వేయి శుభములు కలుగజేసే విన్నపం ఇది శ్రద్ధచూపుడు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
15.07.2025