ఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు!
19.07.2025 - 3534* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమ సంగతులు!
నేటి ఉదయం 4.23 నిమిషాలకు 16 మంది కార్యకర్తలతో మొదలైన శ్రమదానం జాతీయరహదారి బండ్రేవు కోడు వంతెన దగ్గర నుండి గంగులవారిపాలెం రోడ్డు వరకు పసుపు కాంతులీనూతూ చూపరులను ఆకర్షిస్తున్న సువర్ణగన్నేరు పూల మొక్కల వద్ద శుభ్రం చేయడానికి ఉపక్రమించారు. ఆ మొక్కల క్రింద ఉన్న పిచ్చి కలుపు మొక్కలు, పిచ్చి తీగ మొక్కలు, కలుపు గడ్డిని క్రింది భాగంలో శుభ్రం చేసినారు.
రోడ్డు అంచున ఉన్న గరిక, గడ్డిని ఒక కార్యకర్త గడ్డికోత యంత్రంతో అత్యద్భుతంగా కత్తిరించగా ఆ ప్రాంతం ఎంతో ముచ్చట గొలుపుతున్నది.
ఇద్దరు కార్యకర్తలు ప్రత్యేకంగా గడ్డికత్తిరించే యంత్రానికి అవరోధంగా ఉన్న పెద్ద పెద్ద పిచ్చి మొక్కలను కత్తులతో తొలగిస్తూ గంగులవారిపాలెం రోడ్డు వరకు మిషన్ పనికి అంతరాయం లేకుండా సిద్ధం చేశారు.
ఆరుగురు కార్యకర్తలు మొక్కలకు దన్నుగా మట్టి పోసి, వాటి సంరక్షణ కొరకు నిటారుగా నిలబెట్టి కంప కట్టే పని చేశారు.
మహిళా కార్యకర్తలు అలుపెరగని శ్రామికులవలె చీపుళ్ళు చేతబట్టి గడ్డి కోత యంత్రం వెనుక ఊడ్చిన తీరు చూస్తుంటే ఆ ప్రాంతంలో “నెయ్యి ఒలికినా తిరిగి తీసుకోవచ్చు” అన్నట్లు అనిపిస్తుంది.
నిన్నటి కార్యక్రమంలో పని చేస్తూ ఉండగా వచ్చిన వర్షానికి, ఈరోజు కార్యక్రమంలో పని చేస్తున్నంత సేపు గాలి లేక ఉక్కిరి బిక్కిరి చేసిన ఉక్కపోతకు ఏదైతేనేం ఈ రెండు రోజులు కార్యకర్తలు తడిసి ముద్దయ్యారు.
6 గంటల వరకూ అలుపెరగక పరిశ్రమించిన స్వచ్ఛ సైనికులు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి, ఆసుపత్రి సిబ్బందిలో ఒకరైన స్వచ్ఛ కార్యకర్త నరహరశెట్టి గౌతమ్ కుమార్ సావధానంగా పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదంతో గొంతు కలిపి సాధిస్తాం సాధిస్తాం అంటూ,
రేపు కలవవలసిన ప్రదేశం “స్వచ్ఛ చల్లపల్లి స్వాగత ద్వారం” వద్ద అనుకుని అప్పటికే సూర్యుడు చిటపటలాడుతుండడంతో సమీక్ష ముగించారు.
- నందేటి శ్రీనివాసరావు
ప్రజా కళాకారుడు
19.07.2025.
చల్లపల్లిలో వృక్ష విలాపం – 5
(చల్లపల్లి వృక్ష సంపద తరపున దాసరి వారి వేదనకు నల్లూరి వారి పద్య రూపం)
వేలమందికి నీడనిస్తూ జంతుజాతికి చలువజేస్తూ
కంటికింపగు - మనసుసొంపగు పచ్చదనముల పందిరేస్తూ
దశాబ్దాలుగ పెరుగు చెట్లను దారుణంగా నరికివేసే
కరకు మనసుల మొరటు మనుషులు కలరుగద మీమధ్యనే?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
19.07.2025